R Ashwin Credits Familys Sacrifices Ahead Of 100th Test: రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఓ క్రికెట్ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్ ద్రావిడ్ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు. జట్టు కోసం ఏ త్యాగానికైనా.. ఎంతటి కష్టానికైనా అశ్విన్ సిద్ధంగా ఉంటాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్లను కకావికలం చేసి టీమిండియాకు విజయం సాధించిపెట్టగల ధీరుడు. జట్టుకు వికెట్ అవసరమైన ప్రతీసారి కెప్టెన్ చూపు అశ్విన్ వైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానంలోనూ అశ్విన్ అగ్రెసివ్‌గానే ఉంటాడు. మన్కడింగ్ ద్వారా బ్యాటర్‌ను అవుట్ చేసి... అది తప్పైతే నిబంధనల పుస్తకంలో ఎందుకు ఉందంటూ ధైర్యంగా అడిగే క్రికెటర్ అశ్విన్. అందుకే అంతర్జాకీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 12 ఏళ్లు దాటినా ఈ స్పిన్ మాంత్రికుడు.. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను వణికిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రికెట్ జీనియస్ వందో టెస్ట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘనతను తలుచుకుని అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు.
అశ్విన్ ఏమన్నాడంటే..?
వందో టెస్ట్ వరకు తన ప్రయాణం ఎంతో ప్రత్యేకమని.. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ పేర్కొన్నాడు. వందో టెస్ట్ తనకే కాదు తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమని.. తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అశ్విన్ అన్నాడు. ఆటగాడి ప్రయాణంలో కుటుంబీకుల కష్టం ఎంతో ఉంటుందన్న ఈ దిగ్గజ బౌలర్... క్రికెట్‌లో తాను ఏం చేశానో తన తండ్రికి తెలుసన్నాడు. 21 ఏళ్ల క్రితం అండర్-19 క్రికెట్ ఆడిన ధర్మశాలలో వందో టెస్ట్ ఆడుతున్నానని.. ఇక్కడ చాలా చలిగా ఉంటుందని.... కుదురుకోవడానికి సమయం పడుతుందని వివరించాడు.
అశ్విన్ తండ్రి ఏమన్నారంటే..?
అశ్విన్ కెరీర్‌లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ తన బౌలింగ్‌ను మార్చుకోవడమేనని రవిచంద్రన్ తెలిపారు. ఆఫ్ స్పిన్నర్‌గా అశ్విన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాక ఇక తను వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితే తలెత్త లేదని గుర్తు చేసుకున్నారు. తన భార్య చిత్ర చేసిన కీలక సూచనే అశ్విన్ తలరాతను మార్చిందని రవిచంద్రన్ తెలిపారు. మీడియం పేసర్‌గా కెరీర్ ప్రారంభించిన అశ్విన్‌కు మోకాలి నొప్పి సమస్యగా ఉండేదన్న రవిచంద్రన్... అప్పుడు అశ్విన్ తల్లి కొన్ని అడుగులు వేసి స్పిన్ బౌలింగ్ వేయొచ్చు కదా అని అడిగిందని అదే అశ్విన్ క్రికెట్ కెరీర్‌ను మార్చేసిందని తెలిపారు. 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాక అశ్విన్‌తో మాట్లాడానని. ఇది తప్పకుండా కెరీర్‌లో అతిపెద్ద ఘనతే. కానీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనేది అతడి అభిప్రాయమని రవిచంద్రన్ వెల్లడించారు.