Gautam Gambhir Message For KKR Players: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్‌... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే తొలి మ్యాచ్‌కు సమయం సమీపిస్తున్న వేళ  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న  గౌతమ్‌ గంభీర్  తన  జట్టుకు గట్టి సందేశం ఇచ్చాడు.

 

గంభీర్ హెచ్చరికలు

ఐపీఎల్‌ ద్వారా యువ క్రికెటర్లకు అద్భుతమైన అవకాశం వచ్చిందని.. అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని గంభీర్‌ సూచించాడు. తొలిరోజు నుంచే చెబుతున్నా.. ఐపీఎల్‌ తన వరకైతే సీరియస్‌ క్రికెట్. ఇదేమీ బాలీవుడ్‌ కాదు లేదా మీరు పార్టీలు చేసుకొనేందుకు కాదని గంభీర్‌ స్పష్టం చేశాడు. మైదానంలోకి దిగిన తర్వాత పోటీతత్వం ప్రదర్శించాలని... అందుకే, ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీగా ఐపీఎల్‌ను తాను భావిస్తానని గంభీర్‌ అన్నాడు. మైదానంలోనూ అత్యుత్తమ క్రికెట్‌ను ఏపీఎల్‌లో చూడొచ్చని.... కోల్‌కతాకు విపరీతమైన అభిమాన గణం ఉందని గంభీర్‌ తెలిపాడు. కోల్‌కతా జట్టుపై అమితమైన ప్రేమను చూపించే ఫ్యాన్స్‌ ఉన్నారని... ఐపీఎల్‌ టోర్నీ మొదలైన తొలి మూడేళ్లలోనే వారికి కేకేఆర్‌తో అనుబంధం పెరిగిపోయిందని గంభీర్‌ తెలిపాడు. 

 

కాన్వే దూరం!

గాయం కారణంగా న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్ కాన్వే ఈ సీజన్‌ తొలి భాగంలో ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్‌ తగిలింది. అతడిని పరిశీలించిన వైద్యబృందం శస్త్రచికిత్స అవసరమని.. కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో కన్వే కనీసం రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరం ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ చివరినాటికి సిద్ధమై.. ఐపీఎల్‌ రెండో సగానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

 

జార్ఖండ్‌ గేల్‌కు రోడ్డు ప్రమాదం

మరో విధ్వంసకర బ్యాటర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్తతో క్రికెట్‌ ప్రపంచం భయాందోళనలకు గురైంది. జార్ఖండ్ క్రిస్ గేల్‌, ధోనీ వార‌సుడిగా పిలుచుకుంటున్న రాబిన్ మింజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఐపీఎల్‌ 2024 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రాబిన్‌ను ఊహించని ధర దక్కించుకుంది. రాంచీలో బైక్‌పై వెళ్తుండగా రాబిన్‌ ప్రయాణిస్తున్న కవాసకీ సూపర్‌బైక్‌ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని అత‌డి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు.