Ranji Trophy 2024 Mumbai Enters Final: రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయ్ ఫైనల్ చేరింది. తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 70 పరుగులతేడాతో జయభేరి మోగించింది. బౌలర్ల ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్ 3 రోజుల్లోనే ముగియడం విశేషం. 3 ఇన్నింగ్స్ ల్లో కలిపి 18 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యారంటే బౌలర్లు ఎలా చెలరేగారో అర్ధమవుతోంది. రంజీట్రోఫీ లోముంబయ్ ఫైనల్ లో ప్రవేశించడం ఇది 48వ సారి. సోమవారం ముంబయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
సెమీస్‌లో టాస్ గెలిచిన తమిళనాడు బ్యాటింగ్ ఎంచుకొంది. కానీ పిచ్ కండీషన్ ని గుర్తు చేస్తూ ఇన్నింగ్స్ నాలుగో బంతినే వికెట్ గా మలిచాడు శార్ధూల్ ఠాకూర్. తమిళనాడు ఓపెనర్‌సాయి సుదర్శన్ యల్బీ గా వెనుదిరిగాడు. తరువాత జగదీశన్, ప్రదోష్‌పాల్, సాయికిషోర్, ఇంద్రజిత్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో ఆట మొదలయిన గంటలోపే 5 వికెట్లు కోల్పోయి తమిళనాడు 100 పరుగులయినా చేస్తుందా అనిపించింది.
ఇక అప్పుడు క్రీజులోకొచ్చిన విజయ్‌శంకర్, వాషింగ్టన్ సుందర్ పరిస్థితిని చక్కదిద్దారు. 44 పరుగులతో విజయ్‌శంకర్, 43 పరుగులతో వాషింగ్టన్ సుందర్ జట్టును ఆదుకొన్నారు. సింగిల్స్ తీస్తూనే వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అప్పటికే కీలక వికెట్లు కోల్పోయిన తమిళనాడు ని విజయ్ శంకర్ 44, ఆదుకోక పోతే జట్టు స్కోరు 100 పరుగులు కూడా దాటేది కాదు. ఇక ఈ జంట ప్రమాదకరమవుతుంది అనుకొన్న దశలో శార్ధూల్ విజయ్‌శంకర్ వికెట్ తీసాడు. తనుష్ కొటియన్ సుందర్ ని పెవిలియన్ చేర్చాడు. ఇక మిగిలిన తమిళనాడు వికెట్లు తీయడం ముంబయ్ బౌలర్లకు పెద్దగా కష్ఠం కాలేదు. దీంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 64.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం తన తొలి ఇన్నింగ్స్‌ని ఆరంభించిన ముంబయ్ కి అద్బుత ఆరంభం లభించలేదు. 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. తమిళనాడు బౌలర్ల ధాటికి పృథ్వీషా, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ లు కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆల్‌రౌండర్ శార్దూల్‌ఠాకూర్ 109 పరుగులతో ముంబయ్‌ని ఆదుకోవడమే కాదు... క్వార్టర్స్‌లో సెంచరీతో కదం తొక్కిన 10వ నంబర్ బ్యాట్సమెన్ తనుష్ కొటియన్ చేసిన 89 పరుగులతో కలిపి జట్టును 300 పరుగులు దాటించాడు. దీంతో ముంబయ్‌తొలి ఇన్నింగ్ప్‌లో 378 పరుగులు చేసింది. ముంబయ్ కి కీలకమైన 232 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.తమిళనాడు బౌలర్ సాయి కిషోర్ 6 వికెట్లతో ముంబయ్ పతనాన్ని శాసించాడు.
అనంతరం రెండో ఇన్నింగ్ప్ ఆరంభించిన తమిళనాడు... ఠాకూర్ మొదట్లోనే రెండు వికెట్లు కూల్చడంతో 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ ని అవాస్థి పెవిలియన్ చేర్చడంతో 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది తమిళనాడు. ఇంద్రజిత్ మరియు ప్రదోష్ రంజన్ పాల్ నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కానీ ఓ ఎండ్‌లో ఇంద్రజిత్ ముంబయ్ బౌలర్లని ఎదుర్కొంటున్నా మరో ఎండ్ నుంచి సహకరించే వారే కరవయ్యారు. దీ్ంతో తమిళనాడు వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 51.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యి ఇన్నింగ్స్ 70 పరుగులతో ఓటమి పాలయ్యింది. ఈ విజయంలో ముంబయ్ బౌలర్లందరూ తలో చేయి వేశారు. శార్ధూల్2, అవాస్థి2, ములాని 4, తనుష్ కొటియన్ 2 వికెట్లతో తమిళనాడుని కోలుకోలేని దెబ్బతీశారు.
రంజీ ట్రోఫీ సాధించాలని ఉవ్విళ్లూరిన తమిళనాడుకు శార్దూల్, తనుష్ కొటియన్ లు అడ్డుపడ్డారు. మరో సెమీస్ లో విదర్భ, మధ్యప్రదేశ్ జట్లలో గెలిచిన టీంతో సోమవారం పైనల్లో తలపడనుంది.