Rohit Sharma records ahed of Dharamshala: ధర్మశాల(Dharamshala) వేదికగా మార్చి 7 నుంచి 11 వరకు అయిదో టెస్ట్ జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా(Team India).. ఈ టెస్ట్‌లోనూ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్లు పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని బ్రిటీష్ (England) జట్టు చూస్తోంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ అందరూ ధర్మశాల చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా సారధి రోహిత్ శర్మ అరుదైన రికార్డు ముందు నిలిచాడు.
ఆ రికార్డు ఏంటంటే..?
ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో మరో ఆరు సిక్సర్లు బాదితే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 600 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మూడు ఫార్మాట్లలో 471 మ్యాచ్‌లు ఆడిన శర్మ 594 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్సర్లు కొడితే ఆరు వందల సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. ధర్మశాల టెస్టులో హిట్‌మ్యాన్ కనీసం ఒక్క సిక్సర్ బాదినా అతడి ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో 50 సిక్సర్లు కొట్టిన మొదటి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకు ఎక్కనున్నాడు.
హెలికాఫ్టర్‌లో రోహిత్ గ్రాండ్ ఎంట్రీ
హిట్‌మ్యాన్ ప్రత్యేక ప్రైవేట్ హెలికాప్టర్‌లో ధర్మశాలలో అడుగుపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. రోహిత్ హెలికాప్టర్‌లో ధర్మశాలకు వచ్చి జట్టుతో చేరాడు. గుజరాత్‌లో జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరైన రోహిత్ తర్వాత ప్రత్యేక ప్రైవేట్ హెలికాఫ్టర్‌లో ధర్మశాలకు చేరుకున్నాడు.
రోహిత్‌కు అరుదైన గౌరవం
భారత జట్టు సారధి రోహిత్ శర్మ(Rohit Sharma)కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌లో హిట్‌మ్యాన్ శతకానికి చోటు దక్కింది. టీ 20ల్లో 35 బంతుల్లో శతకాన్ని సాధించిన హిట్‌మ్యాన్ ఊచకోతను పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్‌లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది.
అశ్విన్ రికార్డు
ధర్మశాల టెస్ట్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించనున్నారు. టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోలకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా నిలవనుంది. అశ్విన్, జానీ బెయిర్ స్టోలు తమ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు ఎలా రాణిస్తారు అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ ఎవరికి తీపి గుర్తుగా మిగలనుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది. టీమ్ఇండియా తరుపున ఇప్పటి వరకు కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో వందకు పైగా మ్యాచ్‌లు ఆడారు. అశ్విన్ 14వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.