Happy Maha Shivaratri 2024:   'ఏకబిల్వం శివార్పణం' అని మారేడు దాళలలతో శివుడిని పూజిస్తారు...పరమేశుడి పూజలో బిల్వదళానికి ఎందుకంత ప్రాముఖ్యతో ఈ శ్లోకంలో ఉంది...


బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!


బిల్వపత్రం దర్శనం వలన పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశిస్తే సర్వపాపములు నశిస్తాయి.  భక్తిశ్రధ్ధలతో బిల్వ దళాన్ని అర్పిస్తే  ఘోరాతిఘోరమైన పాపాలు తొలగిపోతాయి. అలాంటి త్రిగుణము గల  బిల్వదళమును నీకు అర్పిస్తున్నాను...నన్ను అనుగ్రహించు పరమేశా అని అర్థం..


Also Read: మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో చెప్పేయండి!


శివుడు సృష్టించిన బిల్వవృక్షం


పరమేశ్వరుడి అనుగ్రహం కోసం శ్రీ మహాలక్ష్మి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్విఘ్నంగా ముగియడంతో, హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి 'ఆకలి! ఆకలి!' అని కేకలు వేసింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపుస్తనాన్ని ఖండించి...శక్తికి సమర్పించాలి అనుకుంది. అప్పుడు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు అమ్మవారిని వారించి... విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు...నీ నామాల్లో 'విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః' అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయనే వరమిచ్చాడు.ఆ సమయంలో లక్ష్మీదేవి నివేదిత స్థలం అయిన హోమగుండం నుంచి ఓ వృక్షాన్ని సృష్టించాడు..అదే బిల్వవృక్షం. ఈ దళాలతో తనను పూజిస్తే అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని చెప్పాడు శివుడు. అలా పరమేశ్వరుడి సేవకోసమే బిల్వవృక్షం భూలోకంలో పుట్టిందని చెబుతారు. 


Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!


త్రిశూలానికి సంకేతం మారేడు దళం


మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి..మూడు ఆకులతో ఉన్నందునే త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు. ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని పురాణాల్లో ఉంది.  శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం వివరణలోనే మారేడు విశిష్టత, శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు వివరంగా ఉంటాయి. మారేడు చెట్టు మొదట్లో దీపం వెలిగించిన వారికి  తత్వజ్ఞానం లభిస్తుంది. మరణానంతరం శివ శాయుజ్యం పొందుతారు. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను ముట్టుకోవడం, పూజించటం వల్ల సకలపాపాల నుంచి విముక్తి లభిస్తుంది.


Also Read: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!
  
వాడినా పర్వాలేదు 3 రేకులు తప్పనిసరి


శివార్చనకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించాలి. ఓసారి కోసిన బిల్వపత్రములు సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటుంది. బిల్వదళాలు వాడిపోయినా పర్వాలేదు కానీ మూడు రేకులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఏకబిల్వ పత్రంలో మూడు రేకులలో ఎడమవైపు ఉన్నది బ్రహ్మ, కుడివైపున్నది శ్రీ మహావిష్ణువు, మధ్యలో ఉన్నది సదాశివుడుని చెబుతారు.


కాశీ క్షేత్రంతో సమానం బిల్వ వనం


బిల్వవనం కాశీక్షేత్రంతో సమానమైనదిగా భావిస్తారు..ఈ వృక్షం కింద పరమేశ్వరుడు నివాసం ఉంటాడు. ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కలుగుతాయి. తూర్పున ఉండే సుఖం, పడమరవైపు ఉంటే సుపుత్రసంతానం, దక్షిణం వైపు ఉంటే యమబాధలు ఉండవు. అంటే మారేడు చెట్టు ఏ దిశలో ఉన్నా మంచిదే...


Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!


బిల్వాష్టకం


త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం


అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం


సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం


దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం


లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం


దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం


కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం


మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం


ఫలశృతి


బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్


Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !