Vidura niti: చాణక్య నీతిలాగే విదుర నీతి కూడా ప్రసిద్ధి చెందింది. మహాభారత కాలంలోని అత్యంత ముఖ్య‌మైన‌ వ్యక్తులలో విదురుడు ప్రముఖంగా నిలుస్తాడు. విదురుడు తన తెలివితేటలతో అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. ఆయ‌న‌ కౌరవ స్రామ్యాజ్యానికి ప్ర‌ధాన‌మంత్రిగా, సలహాదారుగా సేవ‌లందించాడు. విదురుడి జీవిత పాఠం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయ‌న పేర్కొన్న ఎన్నో అంశాలు ఇప్ప‌టికీ నిత్య‌నూత‌నంగా ఉన్నాయి. జీవితంలో విజయం, సంతోషం, శాంతి, ప్రశాంతతలను పొందేందుకు విదురుడు ఎన్నో సూచ‌న‌లు చేశాడు. అదేవిధంగా విదురుడు ధనం, సంపద గురించి సందేశం ఇచ్చాడు స్ప‌ష్టంగా తెలిపాడు. కొంత‌మందికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్ప‌టికీ కలగదని, అలాంటి వారికి ధనాన్ని ఇవ్వకూడదని సూచించాడు.


నిజాయితీ


విదుర నీతి ప్రకారం, నిజాయితీ లేని వ్యక్తి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. నిజాయితీ లేని వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేడు. కొంతమంది తమ నిజాయితీతో అపారమైన సంపదను కూడబెట్ట‌లేమ‌ని భావిస్తారు. అక్రమ, అనైతిక మార్గాల ద్వారా సంపద త్వ‌ర‌గా సంపాదించ‌వచ్చని విశ్వ‌సిస్తారు. అయితే ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా వృథాగా ఖర్చు అవుతుందని విదురుడు పేర్కొన్నాడు. ఆ విధంగా అక్ర‌మ మార్గంలో సంపదను పొందినా అది ఆ వ్యక్తికి సంతోషాన్ని కలిగించదు. బదులుగా, దీని కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అందువ‌ల్లే నిజాయితీగా జీవించాలని విదురుడు స్ప‌ష్టంచేశాడు. మీరు ఇలా నిజాయితీగా జీవించినట్లయితే, మీరు మీ జీవితంలో ఆనందంతో పాటు శాంతిని పొందుతారు.


చిత్త‌శుద్ధి


ప్రతి ఒక్కరికి వారి సొంత లక్ష్యం ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాన్ని సాధించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అయితే అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని చిత్తశుద్ధితో కృషి చేయ‌ని వారికి భగవంతుని అనుగ్రహం లభించదని విదురుడు తెలిపాడు. అదృష్టం మీద ఆధారపడటానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. బదులుగా, ఆ ప్రయత్నం నిజాయితీగా ఉండాలి. చాలామంది తమ విధిని నమ్ముతారు. అలాగే తమ ప్రయత్నాల్లో చిన్న అపజయం వచ్చినా ఇక ఫ‌లితంపై ఆశ వదులుకుంటారు. అలాగే, వారు తమ పనులను సమర్థవంతంగా చేయడం గురించి ఆలోచించడం మానేస్తారు. భగవంతుడు ప్రతి ఒక్కరి విధిని సృష్టించాడు. ఏది ఏమైనప్పటికీ, చిత్తశుద్ధితో పని చేసి, తమ లక్ష్యాలను సాధించడానికి కృషి చేసేవారికి అదృష్టం వస్తుందని విదురుడు చెప్పాడు. కాబట్టి, వారి సాధన మార్గంలో ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోకూడదు. లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అప్పుడు భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది.


వైఫల్యం


కొందరు వ్యక్తులు అన్ని విధాలుగా సమర్థులైనప్పటికీ, వారి ల‌క్ష్య సాధ‌న‌కు ప్రయత్నించ‌రు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడి జీవితాన్ని గడుపుతారు. ఇలాంటి వ్యక్తులు తరచుగా తమ వైఫల్యాలకు తమను తాము నిందించుకుంటారు, కానీ వైఫల్యాల నుంచి నేర్చుకోరు, నేర్చుకున్న పాఠాలతో మెరుగైన జీవితం కోసం ప్రయత్నించరు. సోమరిపోతులుగా జీవిస్తూ, నిజాయితీగా పని చేయని వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదని విదుర నీతి చెబుతోంది.


డ‌బ్బు విలువ‌


ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అంద‌రూ పొందలేరని చెప్పిన విదురుడు కొంద‌రికి ఎప్పుడూ డబ్బు ఇవ్వకూడదని చెప్పాడు. విదుర నీతి ప్రకారం సోమరితనం ఉన్నవారికి ఎప్పుడూ డబ్బు ఇవ్వకండి. ఎందుకంటే డబ్బు విలువ తెలియని వారు తమ సంపదను కోల్పోతారు. అలాంటి వారు త‌మ సంప‌ద‌ మొత్తాన్ని వృధాగా ఖ‌ర్చు చేస్తారు. అందువ‌ల్ల‌ పొరపాటున కూడా సోమరిపోతులకు డబ్బు ఇవ్వ‌కూడ‌ద‌ని విదురుడు స్పష్టంగా పేర్కొన్నాడు.


Also Read: ఈ ఐదు మీ దిన‌చ‌ర్య‌లో భాగ‌మైతే మీ పేరు, ప్ర‌తిష్ఠ‌లకు తిరుగుండదు


పాపాత్ములు


పాపకార్యాల్లో నిమగ్నమైన వారికి, నిత్యం తప్పుడు పనులు చేసే వారికి ఎప్పుడూ డబ్బు ఇవ్వకూడదని విదురుడు తెలిపాడు. పాపకార్యాలలో నిమగ్నమైన వారికి సంపదను ఇస్తే, వారు దానిని చెడు పనులకు ఖర్చు చేస్తారు. ఇలాంటి చర్యలకు ఎవరూ మద్దతు ఇవ్వకూడదు. అలా తప్పుదారి పట్టే వారికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి. లేదంటే మొత్తం డబ్బు వృథా అవుతుంది. భక్తిహీనులకు ధనం ఇవ్వడం అంటే మీ సంపదను మీరే వృథా చేసుకున్నట్టేన‌ని విదుర నీతి వెల్ల‌డిస్తోంది..


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదని గమనించగ‌లరు.