మహారాష్ట్రలో జరగబోయే జెడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రతీ గడపను తట్టండి.. ప్రతీ మనిషినీ పలకరించండని కోరారు. నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మే 7 నుంచి జూన్‌ 7 వరకు మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ కమిటీ వేస్తామన్నారు. 10 నుంచి 12లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన వివిధ పార్టీల నేతలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. వారికి కండువా కప్పి ఆహ్వానించారు.


మహారాష్ట్ర ‘కిచిడీ’ ప్రభుత్వం నుంచి విముక్తి  కావాలి


’ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడిని చేయాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ఆవిర్భవించలేదన్నారు కేసీఆర్. కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన  పార్టీ కాదన్నారు.   మహారాష్ట్ర ‘కిచిడీ’ ప్రభుత్వం నుంచి మమ్మల్ని రక్షించమని ప్రజలు కోరుతున్నారు’’ అని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే మనకు కులతత్వ రోగం, మతతత్వ రోగం అంటుకొని మనం విభజింపబడతామన్నారు. గడ్చిరోలి ప్రాంతం గుండా గోదావరి నది ప్రవహిస్తున్నా... అక్కడ తాగడానికి నీరు ఎందుకు లభించడం లేదని ప్రశ్నించారు.  ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీలు, మంత్రిత్వశాఖలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి  ఉన్నా దేశానికి ఈ బలహీనత ఏంటి?’’ అని ప్రశ్నించారు కేసీఆర్.


జొన్నరొట్టె తినకుండా పిజ్జాలు బర్గర్లు తింటామా?


దేశంలో 1 లక్షల 40 వేల టీఎంసీల వర్షపాతం కురుస్తుందని.. దీంట్లో సగం నీరు భాష్పీకరణ చెందుతుందన్నారు కేసీఆర్. ఇంకా 70 వేల టీఎంసీల నీరు మన నదుల్లో ప్రవహిస్తుంది. అమెరికాలో వ్యవసాయ యోగ్యమైన భూమి 19 శాతం, చైనాలో 16  శాతం మాత్రమే ఉంది. మన భారతదేశం భాగ్యవంతమైన దేశం. దేశపూర్తి వైశాల్యం 83 కోట్ల ఎకరాలుంటే  అందులో 41 కోట్ల ఎకరాల భూమి (50 శాతం) వ్యవసాయ యోగ్యమైంది.  ఇట్లాంటి పరిస్థితుల్లో మనదేశం యావత్ ప్రపంచానికి అన్నం పెట్టాల్సింది.రైతులు పొలాల్లో పండించిన పంటలు నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు వెళ్లాలని ప్రశ్నించారు.. వీటిలో కోట్ల మంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభించాలి. ఇక్కడ తయారైన ఆహారోత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావాలి.  కానీ ఈ రోజు దేశంలో ఏం జరుగుతున్నది ?  మన పిల్లలు పట్టణాల్లో, గ్రామాల్లో పిజ్జా తింటున్నారు. మన జొన్నరొట్టె ముందు అదెంత ? కానీ మనం పిజ్జాలు తింటున్నాం. బర్గర్లు తింటున్నామని అన్నారు.


మహారాష్ట్ర భూ రికార్డుల తప్పులను సవరిస్తా- కేసీఆర్


మహారాష్ట్ర పుణ్యభూమిలో ఎన్నో నదులు పారుతున్నాయి. గోదావరి, కృష్ణా, వెన్ గంగ, పెన్ గంగ, వార్ధా, మూల, ప్రవర, పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు ఇక్కడ పుడుతున్నాయి. మహరాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారని తెలిసింది. అకోలా లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎందుకీ అగత్యం ?  మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు ?  భూ రికార్డుల్లో జరిగే అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. భూమి యాజమాన్య హక్కులు ఎవరి నుంచి ఎవరికి సంక్రమిస్తాయో ఎవరికీ తెలియదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రైతుల రక్తాన్ని పీల్చివేసింది. మహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చాం.  నీళ్లు, కరెంటు విషయంలో దేశ ప్రజలను ఎందుకు వంచిస్తున్నారు?


ఫడ్నవీస్‌ నుండి ఇప్పటి వరకు సమాధానం రాలేదు


ప్రకృతి ఇచ్చిన వరాన్ని ఎందుకు కాలరాస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మన సమస్యలు తీర్చరు. మనమెంత చైతన్యవంగా ఉంటే అంత త్వరగా సమస్యలు తీరుతాయన్నారు. మేకిన్‌ ఇండియా అంటారు. దేశమంతా నిండా చైనా బజార్లే ఉంటాయి. పతంగుల మాంజా నుంచి దేవుళ్ల విగ్రహాల దాకా చైనా నుంచే వస్తాయి. ఫ్లయిట్‌ నుంచి లైట్‌ వరకు చైనా నుంచే ఎందుకు తెచ్చుకోవాలి ? మన వస్తువులను మనం తయారు చేసుకునే శక్తి, యుక్తులు, సంపద మనకు లేవా? మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఏం పని అని ఫడ్నవీస్‌ ప్రశ్నించారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెప్పాం. ఫడ్నవీస్‌ నుండి ఇప్పటి వరకు ఏం సమాధానం రాలేదు. మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ కావాలి. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు కేసీఆర్.