వెబ్ సిరీస్ రివ్యూ : సేవ్ ద టైగర్స్
రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి, సద్దాం తదితరులు
రచయితలు : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్. ఆనంద్ కార్తీక్
ఛాయాగ్రహణం : ఎస్.వి. విశ్వేశ్వర్
సంగీతం : అజయ్ అరసాడ
దర్శకత్వం : తేజ కాకుమాను
క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం
నిర్మాతలు : మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి
విడుదల తేదీ : ఏప్రిల్ 27, 2023
ఎపిసోడ్స్ : 6
ఓటీటీ వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ హీరోలుగా... 'జోర్దార్' సుజాత, పావనీ గంగిరెడ్డి, దేవయాని శర్మ హీరోయిన్లుగా రూపొందిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'. అంతరించిపోతున్న పులుల్ని, మొగుళ్ళని కాపాడుకుందాం... అనేది ఉపశీర్షిక. మహి వి రాఘవ్ షో క్రియేటర్, నిర్మాతగా రూపొందిన సిరీస్ ఇది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి, సిరీస్ ఎలా ఉంది? (Save The Tigers web series review in Telugu) అంటే...
కథ (Save The Tigers Web Series Story) : డ్రంకన్ డ్రైవ్ కేసులో విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు, తాము ఎందుకు తాగాల్సి వచ్చిందో పోలీస్ అధికారికి ముగ్గురూ వివరించడం మొదలు పెడతారు.
విక్రమ్ భార్య రేఖ (దేవియాని శర్మ) లాయర్. అత్తగారికి, ఆమెకు పడదు. వాళ్ళిద్దరి మధ్యలో విక్రమ్ ఎలా నలిగిపోయాడు? రాహుల్ ఉద్యోగం మానేసి రైటర్ అవుతాని అంటే భార్య, డాక్టర్ మాధురి (పావనీ గంగిరెడ్డి) సపోర్ట్ చేస్తుంది. భర్తను ఎంతో ప్రేమగా చూసుకునే ఆమెకు కోపం ఎందుకు వచ్చింది? భార్య మీద ఎందుకు రాహుల్ అనుమానాలు వ్యక్తం చేశాడు? బోరబండలో నివశించే గంటా రవిది పాల వ్యాపారం. అతని భార్య హైమావతి (సుజాత) బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఉంటుంది. పిల్లల చదువుల కోసం బోరబండ వదిలి గేటెడ్ కమ్యూనిటీని వెళదామని భర్తను అడుగుతూ ఉంటుంది. గంటా రవి వల్ల భార్య పిల్లలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది మిగతా కథ. మధ్యలో ముగ్గురు భర్తలు కలిసి బారులో చేసిన రచ్చ ఏమిటి? చివరలో ఫైవ్ స్టార్ హోటల్లో ఏం చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Save The Tigers Web Series Review Telugu) : భార్య వర్సెస్ భర్త... ఎన్ని కాలాలు, తరాలు మారినా సరే కొత్తగా ఉంటుంది. ఆలుమగల మధ్య గిల్లికజ్జాలు, అభిప్రాయ బేధాలు ఉంటూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు కొన్ని చిత్రాలు వచ్చాయి. ఆ సినిమాలకు, ఇప్పుడీ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'కు డిఫరెన్స్ ఏంటంటే... ఇది రియాలిటీకి దగ్గరగా ఉంటుంది.
'సేవ్ ద టైగర్స్'లో లార్జర్ దేన్ లైఫ్ ఇష్యూస్ ఏమీ చూపించలేదు. సమాజంలో, ఆ మాటకు వస్తే... చాలా జంటల మధ్య, ఇళ్లలో జరిగే సన్నివేశాలను తెరపైకి చక్కటి వినోదంతో తీసుకు వచ్చారు. పొట్ట తగ్గించాలని అభినవ్ చేసే ప్రయత్నం అతని పరిస్థితి చూసి జాలి పడేలా, నవ్వేలా చేస్తే... భార్య మీద అనుమానం వ్యక్తం చేసినప్పుడు కోపం వస్తుంది. చైతన్య కృష్ణ, దేవయాని శర్మ ట్రాక్ చూసినప్పుడు భర్తను ఆ అమ్మాయి ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఫీలవుతాం. స్కూల్ నుంచి వెళ్ళిపోమని ప్రియదర్శితో కుమార్తె చెప్పినప్పుడు కొందరు ఎమోషనల్ కావచ్చు. తెరపై కనిపించే మూడు జంటల్లో ఏదో ఒక జంటతో పెళ్ళైన జంటలు తప్పకుండా కనెక్ట్ అవుతారు.
దర్శక, రచయితలు ఎంత సహజంగా సిరీస్ తెరకెక్కించారో... అంతర్లీనంగా కథలో సందేశాన్ని అంతే చక్కగా చూపించారు. అమ్మాయికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటో చైతన్య కృష్ణ వివరించే సన్నివేశం ఈతరం పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అటువంటి బాండింగ్ అవసరమని చెబుతుంది. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని మరోసారి చెప్పారు. ఇటువంటి సీన్లు చాలా ఉన్నాయి. అయితే, కథగా చూస్తే కొత్తదనం లేదని అనిపిస్తుంది. మొదటి మూడు నాలుగు ఎపిసోడ్స్ నవ్విస్తే... ముగింపు కోసం చివరి రెండు ఎపిసోడ్స్‌లో కథపై కాన్సంట్రేట్ చేయడంతో నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. హర్షవర్ధన్, సునయన ట్రాక్ లెంగ్త్ పెంచింది. 'బతుకు జట్కా బండి' స్ఫూఫ్ కొన్ని సినిమాల్లో వచ్చింది. దాన్ని మళ్లీ కొత్తగా చేశారు. దాన్ని కామెడీ కంటే కథలో టర్నింగ్ పాయింట్ కింద వాడారు.
'సేవ్ ద టైగర్స్'లో మెచ్చుకోదగిన అంశం ఏమిటంటే... భార్య లేదా భర్త, ఎవరో ఒకరి సైడ్ తీసుకోలేదు. ఇద్దరికీ సమ న్యాయం చేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ సినిమా స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు తేజా కాకుమాను గ్లామర్ షోకి దూరంగా, ఫ్యామిలీతో కలిసి చూసేలా తీశారు. అయితే, రెండు మూడు చోట్ల డైలాగులు పిల్లలతో కలిసి చూసేటప్పుడు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.
నటీనటులు ఎలా చేశారంటే? : చైతన్య కృష్ణ కొంత విరామం తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించారు. విక్రమ్ పాత్రలో జీవించారు. బారులో భార్య మీద ఫ్రస్ట్రేషన్ చూపించే సన్నివేశంలో, ముఖ్యంగా మోనోలాగ్ డైలాగుకు అయితే విజిల్స్ పడటం గ్యారెంటీ. అభినవ్ గోమఠం డైలాగ్ డెలివరీ, టైమింగ్ సూపర్బ్. సింపుల్ సీనులోనూ అతని టైమింగ్ వల్ల కామెడీ జనరేట్ అయ్యింది. అభినవ్, రోహిణి మధ్య సీన్లు నవ్విస్తాయి. తెలంగాణ యాస, నటనతో ప్రియదర్శి మరోసారి మెప్పించారు. సీన్ డిమాండ్ చేసినప్పుడు ఎమోషనల్ పెర్ఫార్మన్స్ చేశారు.
'జోర్దార్' సుజాత, పావనీ గంగిరెడ్డి, దేవయాని శర్మ... 'సేవ్ ద టైగర్స్'లో భార్యలుగా వాళ్ళను తప్ప మరొకరిని ఊహించుకోలేం. సింపుల్ & సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. హర్షవర్ధన్, సునయన, గంగవ్వ, వేణు టిల్లు, సద్దాం పాత్రలు కథలో కీలకమైనవి. పరిధి మేరకు వాళ్ళు బాగా చేశారు.
Also Read : 'జల్లికట్టు' రివ్యూ : ఆహాలో వెట్రిమారన్ వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
చివరగా చెప్పేది ఏంటంటే? : 'జనాలు నవ్వడం మర్చిపోయారు' అని ఓ సీనులో చైతన్య కృష్ణ డైలాగ్ చెబుతారు. నిజంగా నవ్వడం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే... వాళ్ళను నవ్వించే సీన్లు 'సేవ్ ద టైగర్స్'లో ఉన్నాయి. అటువంటి సిరీస్ ఇది. వీక్షకులకు ఫన్ గ్యారెంటీ! వినోదం పక్కన పెడితే... ముగింపు అంతగా ఆకట్టుకోదు. ఎందుకంటే... అసలు కథలో కొన్ని ప్రశ్నలు అలా వదిలేశారు.
PS : సిరీస్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోకి కాబోయే భార్య, ఫేమస్ హీరోయిన్ మిస్సింగ్ అని చెబుతూ వస్తారు. ఆమె ఏమైంది? అసలు ఆమెకు, ముగ్గురు హీరోలకు లింక్ ఏంటి? అనేది 'సేవ్ ద టైగర్స్ 2'లో చూడాలి. అది హాలీవుడ్ సినిమా 'హ్యాంగోవర్' టైపులో ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read : 'విరూపాక్ష' రివ్యూ : సాయి ధరమ్ తేజ్ భయపెట్టారా? లేదా?