సినిమా రివ్యూ : విరూపాక్ష
రేటింగ్ : 3/5
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సోనియా సింగ్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులు
స్క్రీన్ ప్లే : సుకుమార్
ఛాయాగ్రహణం : ష్యామ్ దత్ సైనుద్దీన్
సంగీతం : బి. అజనీష్ లోక్ నాథ్
నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్
సమర్పణ : బాపినీడు .బి
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్
కథ, దర్శకత్వం : కార్తీక్ దండు
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'విరూపాక్ష' (Virupaksha Movie). ప్రమాదానికి (బైక్ యాక్సిడెంట్) గురైన తర్వాత ఆయన నటించిన చిత్రమిది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సూపర్ నేచురల్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేసిన సాయి ధరమ్ తేజ్ విజయం అందుకుంటారా? లేదా?
కథ (Virupaksha movie story) : రుద్రవనంలో అమ్మవారి జాతర ఉండటంతో సూర్య (సాయి ధరమ్ తేజ్) వెళతాడు. ఆ ఊరి సర్పంచ్ హరిశ్చంద్ర ప్రసాద్ (రాజీవ్ కనకాల) కుమార్తె నందిని (సంయుక్తా మీనన్)ను ప్రేమిస్తాడు. ఊరి నుంచి సూర్య వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి గుడిలో ఓ వ్యక్తి మరణిస్తాడు. దాంతో ఊరికి అరిష్టం అని అష్టదిగ్బంధనం వేస్తారు. అప్పుడు ఒకరి తర్వాత మరొకరు... నలుగురు మరణిస్తారు. ఒక దశలో ఆ మరణాలను ఆపడానికి ఏకైక పరిష్కార మార్గం నందిని సజీవ దహనమే అని పూజారి చెబుతారు. అలా ఎందుకు చెప్పారు? ప్రేమించిన అమ్మాయిని, ఊరిలో ప్రజలను కాపాడటం కోసం సూర్య ఏం చేశాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Virupaksha Review Telugu) : లాజిక్ ఎండ్ అయిన చోట మేజిక్ మొదలు అవుతుంది (Magic begins where logic ends) - చిత్ర పరిశ్రమ బలంగా నమ్మే సూత్రం ఇది. దర్శకుడు కార్తీక్ దండు సైతం ఓ మేజిక్ నమ్ముకున్నారు... అదే అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని! ఆ నేపథ్య సంగీతానికి తోడు గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే & ష్యామ్ దత్ సినిమాటోగ్రఫీ!
'విరూపాక్ష' ప్రచార చిత్రాలు చూస్తే... ఇది ఏ తరహా చిత్రమో ప్రేక్షకులకు అర్థం కావడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఇటువంటి సినిమాల్లో ప్రేమకథను ఆశించి ఎవరూ థియేటర్లకు రారు. ఆ ప్రేమ కథే సినిమాకు అడ్డంకిగా నిలిచింది. సినిమా మొదలు, చివరిలో ప్రేక్షకుడికి పంటి కింద రాయిలా తగులుతుంది. ప్రేమ కథను పక్కన పెట్టి హారర్ అంశాలకు వస్తే సినిమా అద్భుతమే!
'విరూపాక్ష' ప్రారంభమే ఆసక్తిగా మొదలైంది. ఒళ్ళు జలదరించే సన్నివేశంతో కార్తీక్ దండు సినిమాను మొదలు పెట్టారు. నేరుగా కథలోకి వెళ్ళిపోయారని సంతోషించే లోపు ప్రేమ కథను తీసుకొచ్చి కాసేపు పక్క చూపులు చూసేలా చేశారు. అయితే, అసలు కథలోకి వెళ్ళింది మొదలు పతాక సన్నివేశాల వరకు ఉత్కంఠకు గురి చేస్తూ, మధ్య మధ్యలో భయపెడుతూ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇచ్చారు.
సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకుడి మదిలో సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ క్షుద్ర పూజలకు కారణం ఎవరు? అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు వ్యక్తిని చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేయడంలో సుకుమార్ 100 శాతం సక్సెస్ అయ్యారు (సినిమా చూడాలనుకుంటే సోషల్ మీడియాలో స్పాయిలర్స్ జోలికి అసలు వెళ్లొద్దు). ఆయన స్క్రీన్ ప్లే సూపర్బ్! దానికి తోడు అజనీష్ నేపథ్య సంగీతం, శ్యామ్ దత్ ఛాయాగ్రహణం కొన్ని చోట్ల భయపెట్టాయి. సాంకేతికంగా సినిమాలో ఉన్నత విలువలు ఉన్నాయి.
అందరి నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్న దర్శకుడు కార్తీక్ దండు... క్లైమాక్స్ ట్విస్ట్ తర్వాత సన్నివేశాన్ని ఇంకా బాగా రాసుకుని ఉంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. అప్పటి వరకు ఉన్న 'హై'ను ఆ సీన్ కాస్త డౌన్ చేసింది. అందులో లాజిక్ కూడా లేదు. అయితే, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్బ్! రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా కొత్త కథను చూపించడంలో, పల్లెటూరిలో హారర్ ఎలిమెంట్స్ సెటప్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
నటీనటులు ఎలా చేశారు? : హీరోయిజం చూపించే సినిమా కాదిది. హీరో క్యారెక్టర్ కూడా కథలో భాగంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇటువంటి కథ, ఆ పాత్రలో నటించడానికి ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)ను ప్రత్యేకంగా అభినందించాలి. పాత్రకు ఏం కావాలో, ఆయన అది చేశారు.
'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్'తో సంయుక్తా మీనన్ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఆయా సినిమాల్లో ఆమె పాత్ర పరిధి తక్కువ. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కనిపించారు. 'విరూపాక్ష'లో అలా కాదు... చివరకు వచ్చే సరికి కథే ఆమె పాత్ర మీద నడుస్తుంది. ఆ సన్నివేశాల్లో నటిగా సంయుక్త నటన నెక్స్ట్ లెవల్. కమర్షియల్ సినిమా కథానాయిక పరిధి దాటి నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు.
సాయి చంద్, సోనియా సింగ్, అజయ్, రవి కృష్ణ, సునీల్, యాంకర్ శ్యామల, రాజీవ్ కనకాల... ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు కార్తీక్ దండు అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు.
Also Read : 'ఓ కల' రివ్యూ : డిప్రెషన్‌కు ఆత్మహత్యే పరిష్కారం కాదని చెప్పే సినిమా!
చివరగా చెప్పేది ఏంటంటే? : అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. సినిమాలో నిదానంగా నడిచిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవసరమా అనిపించే ప్రేమకథ ఉంది. క్షుద్ర పూజలు, మరణాలు వంటి అంశాల కారణంగా పిల్లలతో కలిసి దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళలేరు. అటువంటి చిన్న చిన్న తప్పులు పక్కన పెడితే... థ్రిల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్! ఇంటర్వెల్ ముందు, ఆ తర్వాత... క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ 'వావ్' అనిపిస్తాయి. షాక్ & థ్రిల్ ఇస్తాయి. థియేటర్లలోకి వెళ్ళండి... టికెట్ రేటుకి సరిపడా థ్రిల్లును, భయాన్ని పొందండి.
Also Read : 'రుద్రుడు' రివ్యూ : రాఘవా లారెన్స్ 'ఊర మాస్' సినిమా చేస్తే?