వాస్తు నిర్మాణ శాస్త్రం మాత్రమే అనుకుంటే పొరపాటే. జీవితంలో పాటించాల్సిన అనేక నియమాలను గురించి, చెయ్యాల్సిన, చెయ్యకూడని పనుల గురించి కూడా సవిరణాత్మక విశ్లేషణ వాస్తులో అందుబాటులో ఉంది. చిన్నచిన్న జాగ్రత్తలతో పెద్దపెద్ద నష్టాలు తగ్గించుకోవచ్చు.
చాలా సందర్భాల్లో రాత్రింబవళ్లు కష్టించి పనిచేసినా వచ్చే సంపాదన చాలడం లేదని వాపోయే వారిని నిత్యం చూస్తూనే ఉంటాము. ఎంత కష్టపడి సంపాదించినా సరే, ఇంట్లో డబ్బు నిలవదు. డబ్బుకు సంబంధించిన అనేకానేక విషయాలు వాస్తు చర్చిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం.
చిరిగిన పర్సు
చాలా కాలం పాటు వాడుతున్న పర్సు కచ్చితంగా ఏదో ఒక రోజు పాడైపోతుంది. అలా పాడైన పర్సును వాడడం చాలా అశుభం అని శాస్త్రం చెబుతోంది. చిరిగిన పర్సు వాడడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షానికి నోచుకోని వ్యక్తి కష్టాల పాలు కాక తప్పదు. పర్సు దాని ఆకృతి మార్చుకునే విధంగా చాలా నిండుగా నింపి ఉంచకూడదు. వేస్ట్ పేపర్స్ ఎప్పుడూ పర్సులో పెట్టకూడదు. ఒకవేళ పెట్టినా వీలైనంత తొందర దాన్ని క్లియర్ చెయ్యాలి. ఈ నియమం పాటించకపోతే పర్సులో డబ్బు నిలవదు.
శాస్త్రాన్ని అనుసరించి కొత్తగా మెరిసిపోతున్న పర్సును పాకెట్ లో ధరించాలి. అయితే చాలా కాలంగా వాడుతున్న పర్సుతో ఒక రకమైన సెంటిమెంట్ కలిగి ఉంటారు కొంతమంది. అలాంటపుడు పర్సు పడేసేందుకు మనసు అంగీకరించదు. అలాంటపుడు పాత పర్సు విషయంలో కొన్ని చక్కని చిట్కాలు వాస్తులో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూద్దాం.
పాతపర్సులో ఇవి పెట్టుకోవచ్చు
మీ పాత పర్సుతో మీకు సెంటిమెంటల్ బాండ్ ఉందని అనిపిస్తే, దాన్ని పడెయ్యడం ఇష్టం లేకపోతే ఇలా చేయ్యొచ్చు. పాత పర్సులో ఉన్న ముఖ్యమైన కాగితాలు, కార్డ్స్ డబ్బు కొత్త పర్సులోకి మార్చుకోవాలి. ఇక పాత పర్సులో ఒక రూపాయి నాణాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఇది చాలా శుభప్రదమైన పరిహారం. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ నిలిచి ఉంటుంది.
పాత పర్సు చాలా లక్కీ అని మీరు భావిస్తే దాన్ని పడెయ్యకూడదు. అలాగని దాన్ని వాడడం కూడా అంత మంచిది కాదు. కానీ పాత పర్సును ఎప్పుడూ ఖాళీగా కూడా ఉంచకూడదు. ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని బియ్యం గింజలు మూటగా కట్టి దాన్ని పాతపర్సులో కొంత కాలం పాటు పెట్టుకోవాలి. తర్వాత ఆ చిన్న మూటను కొత్త పర్సులో పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం ఇలా చెయ్యడం వల్ల పాత పర్సులోని పాజిటివిటి కొత్త పర్సులో చేరే అవకాశం ఏర్పడుతుంది. పాత పర్సు ఎర్రని అక్షతల మూటతో పాటు కొన్నాళ్లు వినియోగించుకోవచ్చు. కానీ పూర్తిగా జీర్ణం అయిన పర్సును మాత్రం వినియోగించకూడదు.
Also read : శివుడు ఎవరిపై కోపంతో తాండవం చేశారు? విశ్వం ఎందుకు కంపించింది?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.