Love Story Of Kama Deva and Rati: పురాణాల్లో ప్రేమకు సంకేతం రతీ మన్మథులు. మన్మథునిని కామదేవుడు, కాముడు, మదనుడు, రతికాంతుడు అని పిలుస్తారు. ఆయన అర్థాంగి రతీదేవి. ప్రేమికులకు, ప్రేమకు సరైన నిర్వచనం చెప్పే ఈ జంటని తలుచుకుంటే ప్రేమ సఫలం అవుతుందంటారు పండితులు. రతీ మన్మథుల ప్రేమ-పెళ్లి గురించి 'కామవివాహం' అనే పేరుతో శివపురాణం రుద్రసింహతలో ఉంది.
ప్రేమదేవతగా పిలిచే రతీదేవి..దక్ష ప్రజాపతి కుమార్తె అని ఇంకొందరు అంటారు. మన్మథుడు బ్రహ్మ మనసు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయ గల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు. ఆ శక్తిని తానొకసారి పరీక్షించి చూసుకోవాలని అనుకున్న మన్మథుడు... వెంటనే అక్కడే ఉన్న బ్రహ్మ మానసపుత్రిక అయిన సంధ్య, మరీచి, దక్షుడు లాంటి వారితో సహా బ్రహ్మదేవుడి మీద కూడా తన పూలబాణాలను ప్రయోగించాడు. ఎంతో కఠినమైన ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన వారంతా తమకు కామ వికారం కలగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతలో అక్కడ శివుడు ప్రత్యక్షమై ఆ వికారానికి కారణం మన్మథుడని తెలుసుకుని ఆగ్రహం చూపుతాడు. శివుడి కోపాన్ని తట్టుకోలేక మన్మ థుడు పక్కకు తొ లగడంతో వారంతా సాధారణ స్థితికి వస్తారు. తనను సైతం మనోవికారానికి గురిచేసిన మన్మథుడు..శివుడి మూడోకంటి అగ్నిజ్వాలకు అంతమవుతాడని శపిస్తాడు.
Also Read: శివుడు-పార్వతి ఇద్దరిలో తమ ప్రేమను ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు
మన్మథుడికి శాపం
శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బ్రహ్మ దగ్గరకు వెళ్లిన మన్మథుడు శాపాన్ని ఉపసంహరించుకోవాలని అర్థిస్తాడు . బ్రహ్మ మన్మథుడికి ధైర్యం చెబుతూ దైవ ప్రేరణతోనే అలా జరిగిందని... శివుడి కోపాగ్నికి నువ్వు దహనం కావడంలో కుమార జననం అనే దివ్య సంఘటన ఇమిడి ఉందని..ఆ తర్వాత కూడా నీకు మేలే జరుగుతుందని చెబుతాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు దక్ష ప్రజాపతి మన్మథుడి దగ్గరకు వచ్చి తన స్వేదం నుంచి పుట్టిన తన కుమార్తె రతీదేవిని పెళ్లిచేసుకోవాలని కోరతాడు. రతీ దేవిని చూసిన ఆ క్షణంలో తన మన్మథుడి బాణాలు మన్మథుడినే కొట్టాయి. దీంతో సమ్మోహనం చెందిన మన్మథుడు తన బాణాల కన్నా రతీదేవి చూపులే వేగవంతంగా ఉన్నాయని ఆశ్చర్యపోతాడు. రతీదేవితో ఆనందంగా ఉన్న మన్మథుడు బ్రహ్మ ఇచ్చిన శాపం గురించి మరిచిపోతాడు. తారకాసురుడిని సంహరించడం కోసం పార్వతికి శివుడికి జన్మించే కుమారుడే తగిన వాడని బ్రహ్మ దేవతలకు చెప్పడంతో దేవతలంతా వెళ్లి తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడి మనసు మార్చటానికి మన్మథుడిని ఆశ్రయిస్తారు. దైవకార్యం నెరవేర్చటానికి సిద్ధమైన మన్మథుడు ఆ ప్రయత్నంలో భాగంగా శివుడి ఆగ్రహానికి మాడి మసైపోతాడు.
Also Read: మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
మన్మథుడి మరో జన్మ
శివుడు కోపాగ్నికి దగ్ధమైన మన్మథుడు ఆ తరువాత ఏమయ్యాడో భాగవతంలో వ్యాసుడు చెప్పిన కథ ఇది. శివుడి ఆగ్రహానికి మాడి మసైపోయిన మన్మథుడిని చూసి రతీ దేవి విలపిస్తుండగా దేవతలంతా ఆమెను ఓదార్చి.. మన్మథుడు తిరిగి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడని చెబుతారు. కృష్ణుడికి రుక్మిణిదేవికి ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. అయితే జన్మించిన కొద్ది రోజుల్లోనే శంబరాసురుడు అనే రాక్షసుడు ప్రద్యుమ్నుడిని సంహరించే ప్రయత్నం చేస్తాడు. ఆ రాక్షసుడి బారినుంచి బాలుడిని రక్షించుకోమని నారదుడు రతీదేవికి చెబుతాడు. ఆ దేవముని చెప్పిన మాటలు అనుసరించి మాయావతి అనే పేరుతో శంబరాసురుడి ఇంట్లోనే దాసిగా చేరుతుంది రతీదేవి.
మళ్లీ రతీదేవిని చేరుకున్న మన్మథుడు
బాలుడు పుట్టిన ఎనిమిది రోజులకే శంబరాసురుడు కాకి రూపంలో రహస్యంగా వెళ్లి చిన్నారిని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు. ఓ పెద్ద చేప మింగుతుంది. ఆ చేపను పట్టుకున్న జాలరి తిరిగి తీసుకెళ్లి శంబరాసురిడికే ఇస్తాడు. ఆఇంట్లో దాసిగా ఉన్న రతీదేవి చేతికి చిక్కిన చేపను కోయగా బాలుడు బయటపడతాడు. అప్పటి నుంచీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన రతీదేవి..ఆ బాలుడికి యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత గతాన్ని, ప్రస్తుత జన్మలో జరిగినది వివరిస్తుంది. శంబరాసురిడిని జయించటానికి తనకు తెలిసిన మహామాయ అనే విద్యను నేర్పించి..సంహరించేలా చేస్తుంది. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు రతీదేవితో కలసి ఆకాశ మార్గాన ద్వారకా నగరానికి వెళతారు. శ్రీకృష్ణుడి లా రూపురేఖలున్న ప్రద్యుమ్నుడిని చూసి అందరూ కృష్ణుడేమోనని అనుకుంటారు. రుక్మిణీదేవి కూడా పురిట్లోనే తనకు దూరమైన తనయుడు ఉండిఉంటే ఇలాగే ఉండేవాడేమో అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన నారదుడు విషయమంతా వివరిస్తాడు.
మన్మథునికి ప్రత్యేకించి ఆలయాలేవీ లేకపోవచ్చు. కానీ అనేక భార్య రతీదేవితో కలిసి మన్మథుడు చేసే ప్రేమప్రయాణం అనేక ప్రాచీన ఆలయాల గోడలపై చిత్రాలుగా కనిపిస్తుంది. మన్మథుని పేరుతో ఎన్నో పర్వదినాలు కూడా మన గ్రంథాల్లో కనిపిస్తాయి. ఫాల్గుణ కృష్ణ తదియ రోజు కామమహోత్సవం అనీ, చైత్ర శుద్ధ త్రయోదశి మదన త్రయోదశి అనీ మన్మథుని కొలుచుకునేందుకు కేటాయించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే హోళీ (కాముని పున్నిమ) రోజునే మన్మథుని శివుడు దహించివేశాడంటారు. అందుకు సూచనగా కొన్ని ప్రాంతాలలో మంటలు వేయడం కనిపిస్తుంది.
మన్మథుని ప్రసన్నం చేసుకునేందుకు కామగాయత్రి పేరుతో మంత్రం కూడా ఉంది. ఈ మంత్రాని పఠిస్తే జీవితంలో మంచి తోడు దొరకడంతో పాటూ బంధం కలకాలం నిలిచి ఉంటుందని చెబుతారు.
ఓం కామ దేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి
తన్నో అనంగ ప్రచోదయాత్!