Valentines Day 2023 Love Story Of Lord Shiva and Parvati : ప్రేమికుల దినోత్సవం కలియుగంలో మొదలై ఉండొచ్చు కానీ పురాణకాలం నుంచి ప్రేమ ఉంది. అప్పట్లో కూడా ప్రేమను వ్యక్తపరిచే పద్ధతులు వేరు వేరుగా ఉండేవి. మరి ఆదిదంపతులుగా చెప్పే పార్వతీ పరమేశ్వరులు తమ ప్రేమను ఎలా తెలియపరిచారో చెప్పే కథనం ఇది.
''బ్రహ్మాచారిణి'' దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!
శివుడిని పెళ్లిచేసుకోవడానికి ముందున్న పార్వతీ దేవిని అలంకారాన్ని బ్రహ్మచారిణి అంటారు. శరన్నవరాత్రుల్లో ఈ అవతారాన్ని రెండోరోజు పూజిస్తారు. బుద్ధిని, శక్తిని, సంతోషాన్ని, ప్రశాంతతను, సంపదను ప్రసాదించే ఈ అవతారం వెనుక అద్భుతమైన ప్రేమకథ ఉందని మీకు తెలుసా...
Also Read: శివుడి చిహ్నాల్లో దాగిన సృష్టి రహస్యాలివే - నెలవంక దేన్ని సూచిస్తుందంటే..
బ్రహ్మచారిణి అవతారం వెనుకున్న కథ
మేనక, హిమవంతుల కుమార్తె అయిన పార్వతీ దేవి పరమేశ్వరుడిపై ప్రేమను పెంచుకుంటుంది. నిత్యం శివుడిని పూజిస్తూ.. తననే పెళ్లిచేసుకోవాలని తపిస్తుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం శివుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం తప్పు అని, అది జరగని పని అని చెబుతారు. ( ఎందుకంటే అప్పటికే శివుడు దక్షప్రజాపతి కుమార్తె అయిన సతీదేవిని ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు.. ఆమెకు ఆహ్వానం లేకుండా పుట్టింటికి వెళ్లడంతో అక్కడ అవమానం ఎదుర్కొంటుంది. ఆ అవమాన భారంతో అగ్నిలో దూకుతుంది. సతీ వియోగంతో ఆ మృతశరీరాన్ని అంటిపెట్టుకుని తన కార్యాచరణను పక్కనపెట్టేస్తాడు పరమేశ్వరుడు.దేవతల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి..శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా చెబుతారు). ఈ విషయం మొత్తం పార్వతీదేవికి తెలిసినప్పటికీ ఆమె పట్టువీడదు. శివుడి కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. అయినా శివుడి మనసు కరగదు.
Also Read: మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
సతీదేవి మరోజన్మ పార్వతి
శివుడికి భార్య లేదని..తనకు ప్రాణమైన సతీదేవిని తప్ప మరొకరి వివాహమాడేది లేదని శివుడు భీష్మించుకుని కూర్చుంటాడు. ఈ విషయం తెలిసిన తారకాసురుడు అనే రాక్షసుడు..శివుడికి పుట్టే బిడ్డ చేతిలో తప్ప తనకు ఇతరుల వల్ల చావు ఉండకూడదనే వరం పొందుతాడు.ఆ అహంకారం వల్ల దేవతలను నానా హింసలు పెట్టేవాడు. అయితే సతీదేవి పార్వతీ దేవిగా జన్మించి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలంతా..పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుడిని కోరతారు. శివునిపై పూలబాణం వేసి ధ్యానభంగం కలిగించాలని ప్రయత్నించగా..శివుడు మూడోకన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా పార్వతీదేవి పట్టువీడక మరింత ఘోరతపస్సు చేస్తుంది.
పార్వతీదేవి గురించి తెలుసుకున్న శివుడు కూడా ప్రేమలో పడతాడు..అయినప్పటికీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించిన శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసిని అంటూ తన మీద తనే నింద వేసుకుంటాడు. కానీ పార్వతీ దేవి అ మాటలను నమ్మకుండా తన తపస్సును మరింత తీవ్రం చేస్తుంది. చివరికి పార్వతి ప్రేమకు కరిగిన శంకరుడు పెళ్లిచేసుకుంటాడు. బ్రహ్మచారిణీ..సౌభాగ్యవంతురాలిగా మారుతుంది. అలా వేల సంవత్సరాలు తపస్సు చేసిన పార్వతీ దేవిని వివాహం చేసుకుని..తన శరీరంలో సగభాగాన్నిచ్చి అర్థనారీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు పరమేశ్వరుడు.