Buddha Purnima 2024:  వైశాఖ పౌర్ణమి గౌతమ బుద్ధుడికి చాలా ప్రత్యేకమైన రోజు...కపిలవస్తు రాజు శుద్ధోధనుడు - మహామాయలకు సిద్ధార్థుడిగా జన్మించినది , జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారినది, బుధ్దుడు నిర్యాణం చెందినది...ఇవన్నీ వైశాఖ పౌర్ణమి రోజే జరిగాయి. అందుకే బౌద్ధులకు వైశాఖ పౌర్ణమి చాలా ప్రత్యేకం.  హిందువులకు కూడా వైశాఖ పౌర్ణమిని అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు...
 
తల్లి మహామాయ మరణంతో సిద్దార్థుడు సవతి తల్లి గౌతమి వద్ద పెరిగాడు. అందుకే గౌతముడు అనే పేరొచ్చిందని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింత అలవర్చుకున్నాడు. 19 ఏళ్ల వయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు..వీరి కుమారుడు రాహులుడు.  ఓసారి నగరంలో పర్యటిస్తుండగా వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, మృతదేహం, సన్యాసిని చూశాడు..ఈ నాలుగు దృశ్యాలు సిద్దార్థుడి ఆలోచనను మార్చేశాయి. మొదటి మూడు దృశ్యాల వల్ల జీవితం దుఃఖమయం అని గ్రహించి..దుఃఖం లేని జీవితం కోసం 29వ ఏట ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. అడవికి వెళ్లి రథసారథి సహాయంతో రాజదుస్తులు, ఆభరణాలు తండ్రికి పంపించాడు. వివిధ ప్రాంతాలకు వెళ్లి చాలా మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాడు. 35వ సంవత్సరంలో ప్రస్తుత బిహార్ లో గయ ప్రాంతంలో ఓ రావిచెట్టు కింద 40 రోజుల  ధ్యానం తర్వాత జ్ఞానం పొందాడు. దానినే సంబోధి అంటారు. అనంతరం సిద్ధార్థుడు బుద్ధుడిగా, ఆ ప్రదేశం బుద్ధ గయగా, రావిచెట్టును బోధివృక్షంగా పిలుస్తున్నారు.  


Also Read: ఇంకా పెళ్లికాలేదా - అయితే ఇక్కడకు వెళ్లొస్తే ఓ ఇంటివారైపోతారు!


 రావి చెట్టుకి పూజలు ప్రత్యేం 


సిద్దార్థుడిని బుద్ధుడిగా మార్చిన ఆ బోధివృక్షానికి(రావిచెట్టుకి) పూజలు చేయడం అప్పటి నుంచి ప్రారంభమైంది. దీనివెనుక ఓ కథనం చెబుతారు. బోధివృక్షం కింద ధ్యానం చేసుకునే బుద్ధుడిని పూజించేందుకు ఓ భక్తుడు పూలు తీసుకోచ్చాడు..ఆ సమయంలో వన విహారంలో ఉన్నాడు బుద్ధుడు. ఆ భక్తుడు చాలాసేపు ఎదురుచూసి చూసి...తీసుకొచ్చిన పూలను అక్కడే ఉంచేది నిరాశగా వెనుతిరిగాడు. ఇది గమనించిన మరో భక్తుడు బుద్ధుడు రాగానే ఆ విషయం చెప్పి..మీరు లేకపోయినా ఇక్కడ పూజలు కొనసాగేలా విగ్రహారాధనకు అనుమతి ఇవ్వాలని కోరాడు. అందుకు అనుమతించని బుద్ధుడు విగ్రహారాధన బదులు రావిచెట్టుకి పూజలు చేయమని బోధించాడు. అప్పుడు గయలో బోధివృక్షం నుంచి విత్తనాలు తెప్పంచి బేతవనంలో నాటారు...పెద్ద ఉత్సవంలా సాగిన ఈ క్రతవులో అప్పట్లో కోశల దేశపు రాజు పాల్గొన్నాడు. ఇది జరిగింది వైశాఖ పౌర్ణమి రోజే...
 
ఘనంగా వైశాఖ పౌర్ణమి


బౌద్ధమతాన్ని అనుసరించే అన్ని ప్రాంతాల్లో వైశాఖ పౌర్ణమి రోజు రావిచెట్టుకి పూజలు ఘనంగా చేస్తారు.  హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో..ఇంకా రంగూన్, పెగు, మాండలే  ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహిళలంతా సుగంధాలు వెదజల్లే నీటి కుండలను తలపై పెట్టుకుని...మేళతాళాల మధ్య యాత్ర చేస్తారు. సాయంత్రానికి ఆ కుండల్లో నీటిని రావిచెట్టుకి సమర్పించి దీపాలు వెలిగించి, జెండాలు కట్టి పూజలు చేస్తారు.


Also Read: అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా , వ్యాయామం చేసేవారిపైనా ప్రభావం ఉంటుందా!


వైశాఖ పౌర్ణమి బౌద్ధులకు మాత్రమేనా!


వైశాఖ పౌర్ణమి బౌద్ధులకు మాత్రమే కాదు..హిందువులకు కూడా చాలా ప్రత్యేకం. శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడిగా ఉద్భవించింది ఈ రోజే అని చెబుతారు. అత్యంత విశిష్ఠమైన ఈ రూపాన్ని పూజించే ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం సమీపంలో శ్రీకూర్మంలో కూర్మదేవుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి 1500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. విష్ణుభక్తులైన ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ వైశాఖ పౌర్ణమి రోజే జన్మించారని చెబుతారు. అందుకే వైశాఖ పౌర్ణమి వైష్ణవులకు చాలా ప్రత్యేకం. ఇక శివుడి రూపంగా చెప్పే శరభేశ్వరుడు అవతరించింది ఇదే రోజు. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం కనిపిస్తుంది..అందుకే శైవులకూ ఈరోజు అత్యంత విశిష్టమైనదే.  


Also Read: జుట్టుతో ఒళ్లంతా కప్పుకునే అమ్మవారి గురించి తెలుసా!


సముద్ర స్నానం విశేషం


సాధారణంగా పౌర్ణమి తిథి తెలుగువారికి చాలా ప్రత్యేకం. ఎందుకంటే పౌర్ణమిరోజు  ఉండే నక్షత్రం ఆధారంగానే నెలలు ఏర్పరుచుకున్నాం. వాటికి అనుగుణంగానే  వ్యవసాయ, సంప్రదాయాలు కొనసాగించేవారు. పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా ఉంటాడు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజు చంద్రుడి ప్రభావం మనసుపై ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అందుకే మనసుని స్థిరంగా ఉంచేందుకు ప్రత్యేక పూజలు, జపాలు నిర్వహిస్తారు. ఈ రోజును మహావైశాఖిగా పిలుస్తారు..ఈ రోజు సముద్రస్నానం ఆచరిస్తే విశేషమైన ఫలితం వస్తుందంటారు. వైశాఖ పౌర్ణమి రోజు మహావిష్ణువుని ఆరాధించడంతో పాటూ సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎండలు విపరీతంగా ఉండే సమయం కాబట్టి... ఆహారం, నీటి కుండ, గొడుగు, చెప్పులు దానం చేస్తే పుణ్యఫలం.