Temple to Visit For Early Marriage: కొందరికి పెళ్లికాలేదనే బాధ..మరికొందరికి పెళ్లైనా సఖ్యత లేదనే బాధ. గ్రహదోషాలు మాత్రమే కాదు ఇందుకు ఎన్నో కారణాలుంటాయి. కొన్ని ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే పెళ్లికి , వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయంటారు పండితులు. ఇవన్నీ తమిళనాడులోనే ఉన్నాయి.... 


మధురై ఆలయం
మీనాక్షి దేవిని సుందరేశ్వరుడు వివాహం చేసుకున్న ప్రదేశం మధురై. ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే వివాహం, సంతానానికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం.  


ఉప్పలి అప్పన్ ఆలయం
కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉప్పలి అప్పన్ ఆలయం.  దీనినే తిరువిణ్ణగర్ దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ మార్కండేయ ఋషికి భూదేవి చిన్న బాలిక రూపంలో కనిపిస్తే ఆమెను పెంచి పెద్దచేసి శ్రీమహావిష్ణువుకి ఇచ్చి వివాహం జరిపించాడని స్థలపురాణం. ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే వివాహానికి ఉండే అటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 


తిరుమణంచేరి ఆలయం
తమిళనాడు నాగపట్టణం సమీపంలో చిన్నగ్రామంలో ఉంది తిరుమణంచేరి ఆలయం. పరమేశ్వరుడు పార్వతీదేవిని ఇక్కడే వివాహం చేసుకున్నాడని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వివాహానికి ఉండే ఆటంకాలు తొలగిపోతాయంటారు. ఇక్కడ స్వామివారిని కళ్యాణసుందరేశ్వరస్వామిగా పూజిస్తారు.  


తిరుకరుకావూర్ ఆలయం
తంజావూర్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుకరుకావూర్ ఆలయం. ఇక్కడ కొలువైన గర్భరక్షాంబిక అమ్మను దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయంటారు. 


తిరుచ్చేరై ఆలయం
కంభకోణం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచ్చేరి ఆలయంలో శ్రీమహావిష్ణువు సారనాథుడిగా కొలువయ్యాడు. కావేరి దేవిని స్వామివారు పెళ్లి చేసుకున్నది ఇక్కడే అని స్థలపురాణం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వివాహం తొందరగా జరిగిపోతుంది...


నాచ్చియార్ ఆలయం
కుంభకోణానికి సమీపంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు నరైయూరు నంభిగా, అమ్మవారు నాచ్చియార్ గా పూజలందుకుంటున్నారు. వివాహంలో ఆటంకాలు ఎదురైతే...తల్లిదండ్రులతో కలసి ఇక్కడ పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.  


మదిచూర్ ఆలయం 
హరిహరులు కొలువైన మదిచూర్ ఆలయం చెన్నైలో ఉంది. పెళ్లికానివారు ఈ ఆలయంలో గోడలపై పసుపు కొమ్ములు కట్టి మొక్కుకుంటే పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. అమ్మాయిలకు వేరు - అబ్బాయిలకు వేరే పుసుపు కొమ్ములు ఉంటాయి. ఇక్కడ పసుపుకొమ్ములు కట్టి వెళ్లిన వెంటనే వివాహం నిశ్చయం అవుతుందని భక్తుల విశ్వాసం.


తిరువిడనత్తై ఆలయం
మహాబలిపురం తిరువిడనత్తై వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అమ్మవారిని కోమలవల్లిగా , విష్ణువును వరాహ అవతారంలో పూజిస్తారు. ఇక్కడ స్వామివారిని నిత్య కళ్యాణ పెరుమాళ్ గా వ్యవహరిస్తారు..అందుకే ఈ ఆలయాన్ని సందర్శిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. 
 
తిరునల్లూరు ఆలయం
గౌరీ శంకరుల వివాహాన్ని అగస్త్య ముని ఇక్కడే జరిపించారని చెబుతారు. పాండిచ్చేరిలో కరైకాల్ అనే చిన్న పట్టణంలో ఉన్న ఈ ఆలయంలో శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. పెళ్లి సంబంధం కుదరడంలో ఎదురైన ఆటంకాలు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తొలగిపోతాయి. 
 
తిరువేడగం ఆలయం
తిరువేగడం ఆలయంలో శివుడిని ఏడగనాథర్ గా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు కులాలి అమ్మై. ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తే మూడు నెలల్లో వివాహం నిశ్చయం అవుతుందని భక్తుల నమ్మకం. హిందువులే కాదు..ఇతర మతస్తులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు


తిరువవీళిమిళలై ఆలయం
శివుడు కాత్యాయిని అమ్మవారిని వివాహం చేసుకున్న ప్రదశమే తిరువవీళిమిళలై. పెళ్లికానివారికి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. సంతానలేమి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం.