Keslapur Nagoba Jatara Darbar : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఐదురోజుల పాటూ జరిగే గిరిజన జాతర 'నాగోబా'. పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు నాగోబాకి అభిషేకం చేసి జాతరకు శ్రీకారం చుడతారు. ఐదు రోజుల పాటూ కన్నులపండువగా జరిగే జాతర 2024 లో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమవుతుంది. ఈ జాతరలో నిర్వహించే దర్బార్ కి అత్యంత ప్రాముఖ్యత ఉంది.

స్వాతంత్ర్యం రాకముందు నుంచీ దర్బార్


నాగోబా జాతర సందర్భంగా నిర్వహించే దర్బార్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు చూసి భయపడే పరిస్థితులు. అందుకే ఆ గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం  విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. దీంతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఇదే సరైన వేదిక అని భావించారాయన. అప్పటి నుంచి గిరజనులంతా ఓ చోట చేరే నాగోబా జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1942లో మొదట సారి దర్బార్ నిర్వహించారు. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ దర్బార్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు, అధికారులు హాజరవుతారు. వారి సమస్యల గురించి తెలుసుకుని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు. అందుకే ఈ దర్బార్ చాలా ప్రత్యేకం.


Also Read: నాగోబా జాతర చరిత్ర ఏంటి - ఇందులో నిర్వహించే 'భేటి కొరియాడ్' గురించి తెలుసా!


మొదట్లో పుట్టకు పూజలు


మెస్రం వంశీయులు నాగోబా దేవత వెలిసిన పుణ్యస్థలంలో పుట్టను పూజించేవారు. 1956లో ఆ పుట్ట ఉన్న ప్రదేశంలో చిన్న గుడిసె వేశారు. ఆ తర్వాత 1995లో సిమెంట్‌, ఇటుకలతో చిన్న మందిరాన్ని నిర్మించారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ సహకారంతో గుడికట్టారు. 2022 లో ఆ గుడిని మరింత ఆధునీకరించి నాగోబా విగ్రహప్రతిష్ట చేశారు. ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్ఛారణల నడుమ మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నిర్మించిన దేవాలయంలోని గర్భగుడిలో నాగోబా విగ్రహాన్ని, సతీక్‌దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. దేవాలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటుచేశారు. 


ఈ ఏడు ఇంటి పేర్లున్న గిరిజనులకు నాగోబా ఆరాధ్య దైవం


వందల ఏళ్ల క్రితం గిరిజనుల మూల పురుషులు కేవలం ఏడుగురు మాత్రమే ఉండే వారు.  మడావి, మర్సకోలా, కుడ్మేల్, పూరు, పెందూర్, వెడ్మ, మేస్త్రం అనే ఏడుగురు సోదరులుండేవారు. ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయి. ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం నాగోబా జాతర నిర్వహణ బాధ్యత మేస్త్రం వంశీయులకు అప్పగించారు. ఇప్పటికీ వారే జాతర బాధ్యతలు చూస్తున్నారు. 


Also Read: అమావాస్య అర్థరాత్రి ప్రారంభమయ్యే అద్భుతమైన జాతర - నాగోబా నమోనమః!


అమావాస్య అర్థరాత్రి జాతర మొదలు


2024 ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో జాతర ప్రారంభమవుతుంది.  తొలినుంచి వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు! వాటితో నాగోబా దైవానికి అభిషేకం జరపడంతో జాతర మొదలవుతుంది. రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది మొదలు వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. ఫిబ్రవరి 11న ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.