Tower of Silence A Parsi Burial Ground: ప్రముఖ పారిశ్రామిక వేత్త,  మానవతావాది రతన్ టాటా బుధవారం కన్నుమూశారు. ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరుపుతామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.  టాటా కుటుంబం  పార్శీ మతానికి చెందినది. ప్రతి మతంలోనూ వారి వారి పద్ధతులను అనుసరించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరి పార్శీ మతంలో అంత్యక్రియలు అప్పట్లో ఎలా జరిగేవి... 


ప్రతి ఒక్కరి జీవితంలో ఆఖరి మజిలీ అంత్యేష్ఠి. చనిపోయన వ్యక్తి కుమారులు..తమవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నిర్వహించే కార్యక్రమం అంత్యక్రియలు. ఈ అంత్యక్రియలు ఒక్కో మతంలో ఒక్కోలా నిర్వహిస్తారు. హిందువులు దహనం చేస్తారు,  క్రిస్టియన్లు, ముస్లింలు ఖననం చేస్తారు. పార్శీల వరకూ వచ్చేసరికి అంత్యక్రియల విషయంలో విభిన్న పద్ధతిని అనుసరిస్తారు. 


పార్శీలలో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని రాబందులు తినడానికి వదిలిపెట్టేసి వెళ్లిపోతారట..ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఆచారం ఇది. అలా మృతదేహాలను వదిలేసే ప్రదేశాన్ని టవర్‌ అఫ్‌ సైలెన్స్ అని పిలుస్తారు. అంటే హిందువులకు శ్మశానంలా...పార్శీలకు టవర్ ఆఫ్ సైలెన్స్ ఏర్పాటు చేసుకుంటారు..


ఈ ఆచారాన్ని పార్శీలు 'దఖ్మా' అని పిలుస్తారు. ఈ పద్ధతి ఎందుకు అనుసరిస్తారంటే.. ఈ శరీరం ప్రకృతి ఇచ్చిన బహుమతి.  అందుకే మరణాంతరం దాన్ని ప్రకృతికే సమర్పించాలంటారు.  భూమి, అగ్ని, గాలి, నీరు చాలా పవిత్రమైనవి..వాటిని కలుషితం చేయకూడదు.. ఓ మనిషి చనిపోయిన తర్వాత చీకటివైపు వెళతాడు..అందుకే తన దహనసంస్కారాలను అగ్ని, నీరు, భూమి లాంటి పవిత్రమైనవాటితో చేయకూడదు అనేది వారి సిద్ధాంతం. అందుకే మృతదేహాన్ని రాబందులు, జంతువులు, పక్షులు ఉన్న చోట  గాలికి వదిలివేస్తారు.


మృతదేహాలను వదిలేసే టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ కోసం..పెద్ద ఖాళీ స్థలం చూసుకుని వృత్తాకారంలో రెండు పెద్ద గోడల మధ్య బావిని నిర్మిస్తారు.  ఎవరైతే ఈ టవరాఫ్‌ సైలెన్స్‌  నిర్మిస్తారో...లేదంటే..విరాళం అందిస్తారో వారి శవంతోనే ఈ ప్రదేశంలో అంత్యక్రియలకు అనుమతినిస్తారు. దీనిపై పరిశోధనలు చేసిన వారంతా తమ రచనలలో ఇదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారు. కోల్‌కతాలో ఓ వ్యక్తి ఇలానే ఈ టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ని నిర్మించాడని...ఆయన శవమే ముందుగా వచ్చింద. ఆయన పెంపుడు కుక్క కూడా యజమానిపై బెంగతో తినడం మానేసి ఏడు రోజులకు చనిపోతే ఆ కుక్కను కూడా తీసుకొచ్చి అక్కడే అంత్యక్రియలు నిర్వహించినట్టు చెబుతారు. 


జీవితంలో చివరి క్షణంలో కూడా దాతృత్వం ఉండాలన్నదే పార్శీల అభిప్రాయం...అందుకే రాబందులకు శరీరాన్ని వదిలేసేలా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ముందుగా ఆ మృత దేహాన్ని రాబందులు పీక్కుని తింటాయి.. ఆ తర్వాత మిగిలిన ఎముకలు ఆ మధ్యలో ఉన్న బావిలో పడిపోతాయి. 


బావికి వృత్తాకారంలో రెండు సర్కిళ్లు ఉంటాయి.. బయట సర్కిల్లో పురుషుల మృతదేహాలు, లోపల సర్కిల్లో మహిళవ శవాలు, మధ్యలో చిన్న పిల్లల శవాలు ఉంచుతారు. అవి పూర్తిగా డీ కంపోజ్ అయిన తర్వాత మిగిలిన ఎముకలు మధ్యలో బావిలో పడిపోతాయి. రెండేళ్ల తర్వాత వారి బంధువులు వెళ్లి అవశేషాలు సేకరించి డిస్పోజ్ చేస్తారు. 


ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు పార్శీలు అందరూ ఈ పద్ధతిని అనుసరించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నగరాల్లో రాబందుల జాడ ఉండడం లేదు. ఏళ్లతరబడి శవాలు బహిర్గతంగా ఉండిపోతే త్వరగా డిస్పోజ్ అవవు..పైగా కాలుష్యం పెరుగుతుంది. అందుకే ఈ ఆచారాన్ని మార్చాలంటూ ఏళ్లుగా పార్శీలు డిమాండ్ చేశారు..అయితే చనిపోయిన వారికి ఆఖరి క్షణంలో నిశ్శబ్ధంగా ఇచ్చే గౌరవం అని కొందరు చెబుతారు. 


2006లో ధున్ బరియా అనే ప్రసిద్ధ పార్సీ గాయకుడు, సామాజిక కార్యకర్త... టవర్ ఆఫ్ సైలెన్స్ వద్దకు వెళ్లి వీడియోలు తీశారు. ఇది అప్పట్లో పెద్ద దుమారమే సృష్టించింది. ఆ వీడియోస్ లో తాను టవర్ ఆఫ్ సైలెన్స్‌కి ఎలా చేరుకుందో చెప్పలేదు కానీ...అందులో చాలా శవాలు బట్టలు లేకుండా  ఉన్నాయి, కుళ్లిపోతున్నాయి..వాటిని తినేందుకు పక్షులు రాలేదు... ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో చాలామంది పర్యావరణ వేత్తలు పరిశోధనలు జరిపారు. రాబందుల సంఖ్య తగ్గడం వల్ల ఇతర మార్గాల్లో దహనం చేయాలని సూచించారు పర్యావరణ వేత్తలు.  దేశంలో ఇప్పటికీ కొన్ని  చోట్ల టవర్స్ ఆఫ్ సైలెన్స్ ఉన్నాయి...అయితే అక్కడ సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. రాను రాను పార్సీలు కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే  అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.


Also Read: రతన్ టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం- ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు


Also Read: భరతమాత ముద్దుబిడ్డ రతన్ టాటా అందుకున్న అవార్డులు, పురస్కారాలు ఇవే