Tirumala Bramhosthavam: శ్రీవారి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహం మాత్రమే కాదు..మరికొన్న విగ్రహాలున్నాయి..మీరు గమనించారా ఎప్పుడైనా..
ఇలా వైకుంఠం గా పేరుగాంచిన తిరుమలగిరుల్లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేల కిలో మీటర్లు ప్రయాణం చేసి క్షణకాలం పాటు స్వామి దర్శనం లభిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు.. అలాంటి భక్తులు స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తారు తప్ప గర్భాలయంలో కొలువైన ఇతర విగ్రహాలను ఎప్పుడైన చూసారా...
శ్రీనివాసుడు మనకు శిలా రూపంలో దర్శనం ఇస్తాడు కాని ఉత్సవాలు జరిగే విగ్రహాలు వేరు వేరుగా ఉంటాయి.. అసలు విగ్రహాలు ఎన్ని ఉన్నాయి.. ఏ యే విగ్రహాలు ఏ సమయంలో భక్తులకు దర్శనం ఇస్తారో తెలుసా..
తిరుమల గర్భాలయంలో ఉన్న విగ్రహాలను పంచబేరాలు (మూర్తులు)గా పిలుస్తారు. వైకానస ఆగమం ప్రకారం నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ఇందులో స్నానం (అభిషేకం), అర్చనం (పూజ), భోజనం (నైవేద్యం), యాత్ర (ఊరేగింపు), శయనం (పాన్పుసేవ)లు జరుగుతాయి. వీటన్నింటినీ ధ్రువబేరం, కౌతుబేరం, స్నపనబేరం, బలిబేరం, ఉత్సవబేరం గా కొలుస్తారు.
Also Read: తిరుమల ఆనంద నిలయం గురించి ఈ విషయాలు తెలుసా!
1. ధ్రువబేరం
నిలువెత్తు సాలగ్రామ శిలామూర్తిగా మనకు దర్శనం ఇచ్చే వెంకటాచలపతి ధ్రువబేరంగా పిలుస్తారు. ఈ స్వామి వారి ఎత్తు 8 అడుగుల ఉంటుందని అంచనా. మూలవిరాట్ కు ప్రతి రోజు రెండు సార్లు తోమాల సేవ, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు జరుగుతాయి.
2. కౌతుబేరం
నిలువెత్తు శ్రీనివాస భగవానుడికి ప్రతిరూపమైన శంఖుచక్రధారియై చతుర్భుజుడైన భోగ శ్రీనివాసమూర్తిని మనవాళప్పెరుమాళ్ అని పిలుస్తారు. 1.5 అడుగుల ఎత్తుఉన్న ఈ వెండి విగ్రహాన్ని 614 లో పల్లవరాణి సామవై బహూకరించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్వామి దివ్యమంగళ పాదాల వద్ద ఉండే ఈ భోగ శ్రీనివాసమూర్తి కి ప్రతి రోజు ఉదయం ఆకాశగంగ తీర్థం తో అభిషేకం, ప్రతి బుధవారం బంగారు వాకిలి ముందు సహస్రకలశాభిషేకం, ప్రతిరోజు ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసమూర్తి కి బదులుగా శ్రీకృష్ణుని వెండి విగ్రహానికి ఏకాంత సేవ జరుగుతుంది.
Also Read: తిరుమల ఆలయంలో ఎన్ని మండపాలున్నాయి..ఏ మండపంలో శ్రీవారికి ఏ క్రతువు నిర్వహిస్తారు!
3. బలిబేరం
కొలువు శ్రీనివాసమూర్తి లేదా శ్రీనివాసమూర్తిగా బలిబేర మూర్తికి పేరు. వెండి భోగ శ్రీనివాసమూర్తిలా పంచలోహ మూర్తి విగ్రహం ఆలయంలో దర్శనం ఇస్తుంది. తోమాసేవ అయిన తర్వాత అర్చన కంటే ముందుగా స్నపవ మండపంలో బంగారు సింహాచలంలో కొలువు తీర్చి చత్రతామర మర్యాదపూర్వకంగా సార్వభౌమోచిత సత్కారాలతో ఆస్థానం జరుగుతుంది. ఈ కొలువులో ఆనాటి తిథి వార నక్షత్రాధులతో పంచాంగ శ్రవణం, ముందు రోజు ఆదాయ వ్యాయాలతో పాటు మొత్తం రాబడులను స్వామికి వినిపించడం జరుగుతుంది. దేవస్థానం మొత్తం పర్యవేక్షించే అధికారమూర్తి ఈ కొలువు శ్రీనివాసమూర్తి.
4. స్నపనబేరం
ఉగ్ర శ్రీనివాసమూర్తిగా పిలిచే స్నపనబేరం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసుని పంచలోహ విగ్రహాలు ఉత్సవాలుగా దర్శనం ఇస్తాయి. గతంలో ఈ విగ్రహాలను ఉత్సవాల్లో పాల్గొనేవి 14వ శతాబ్దంలో బ్రహ్మోత్సవం లో జరిగిన సంఘటన కారణంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ను పూర్తిగా ఆపివేసారు. అప్పటికీ ఏడాదిలో కైశిక ద్వాదశివాడు.. కార్తిక మాసం తెల్లవారుజామున మాత్రమే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉరేగింపుగా బయటకు వచ్చి సూర్యోదయానికంటే చాల ముందుగా ఆలయంలోకి వెళ్లిపోతారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహం ఎత్తు సుమారు 25 అంగుళాలుగా ఉంటుంది.
Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!
5. ఉత్సవబేరం
ఆలయంలో కొలువైన శ్రీనివాసుడుకి ఎన్ని నామాలు ఉన్న... ఉత్సవ మూర్తికి మాత్రం మలయప్ప అని పేరు. క్రీ. శ.1339లో ఈ మూర్తుల్లో ప్రస్తావన కనబడుతుంది. ఆలయం బయట కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, నిత్యోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ భక్తులకు దర్శనమిచ్చే మూర్తి శ్రీ మల్లయప్ప స్వామి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, తర్వాత ఉత్సవాదుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా పాల్గొనే శ్రీ మలయప్ప స్వామి వారి పంచలోహ విగ్రహాల ఎత్తు సుమారు 30 అంగుళాలు. మల్లయప్ప కోనలో లభ్యమైన విగ్రహాలు కనుక ఈ మూర్తులకి ఈ మూర్తికి మలయప్ప స్వామి అనే పేరు ఏర్పడింది. అన్ని సేవల్లో స్వామివారు కనిపించేది శ్రీ మలయప్ప స్వామి వారి గానే.
Also Read: లడ్డూ సహా శ్రీవారికి నివేదించే ప్రసాదాలు ఇవే - శుక్రవారం చాలా ప్రత్యేకం!
ఆనంద నిలయం లో పంచబేరాలు కాకుండా శ్రీ సుదర్శన చక్రతాళ్వార్, శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణుడు, స్వామి వారి పరివారమైన అనంతుడు, విష్వక్సేనుడు, గరుత్మంతుడు, శ్రీరాముని పరివారమైన సుగ్రీవుడు, అంగదడు, ఆజ్ఞాపాలక ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. అక్కడ కొలువైవున్న ప్రతి మూర్తికి ఉత్సవాలు, సేవలు జరుగుతాయి. అందుకే నిత్య కల్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతుంది తిరుమల.
ఈసారి తిరుమల యాత్ర చేసినప్పుడు స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి.. ఆనంద నిలయం లో కొలువై ఉండే మూర్తులను తప్పక దర్శించుకోండి.