Navratri 2024 Day 7 Sri Saraswati Devi Alankaram:  దేవీ నవరాత్రి  ఏడో రోజు మూలా నక్షత్రం .. చదువుల తల్లి సరస్వతి అలంకారం!


శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ..చదువులతల్లి సరస్వతీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తోంది. దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇది అమ్మవారి జన్మనక్షత్రం. త్రిశక్తులలో ఓ స్వరూపం అయిన సరస్వతీ దేవి అలంకారాన్ని దర్శించుకోవడమే మహాభాగ్యంగా భావిస్తారు భక్తులు. 


ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ వతీ ధీనా మవిత్రయవతు


త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దేవేరి సరస్వతీ దేవి. వేదాలు , పురాణాల్లో సరస్వతీ దేవి ప్రస్తావన ఉంటుంది. శరన్నవాత్రులు,   వసంత పంచమి ఉత్సవాల్లో సరస్వతీదేవి ఆరాధన ప్రత్యేకంగా జరుగుతుంది.    దేవీ భాగవతం,  బ్రహ్మవైవర్త పురాణం, ఋగ్వేదం , పద్మ పురాణంలోనూ  సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి. 


బ్రహ్మ సకల సృష్టి కర్త కావడంతో సరస్వతీదేవిని కూడా బ్రహ్మే సృష్టించాడని..సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండేందుకు తన జిహ్వపై ఆమెను ధరించాడని చెబుతారు. ఈమె కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు సర్వ శక్తి  సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని  దేవీ భాగవతంలో ఉంది .  సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.


Also Read: దేవీ త్రిరాత్ర వ్రతం - దసరాల్లో ఈ మూడు రోజులు చాలా ప్రత్యేకం!


వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానానికి అధిదేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు. జ్ఞాన ప్రదాతగా సరస్వతి గురించి ఎన్నో పురాణకథలున్నాయి. 


ఓసారి సనత్కుమారుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి జ్ఞానం గురించి చెప్పమంటే.. సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞాన సిద్థాంతాన్ని సనత్కుమారుడికి చెప్పాడట బ్రహ్మ


 జ్ఞానాన్ని ఉపదేశించమని స్వయంగా భూదేవి... అనంతుడిని అడిగిందట. అప్పుడు కశ్యపుడి ఆజ్ఞతో చదువుల తల్లిని స్తుతించిన అనంతుడు... నిర్మలమైన జ్ఞానాన్ని భూదేవికి వివరించాడట


సరస్వతీ దేవి స్తుతి తర్వాతే వాల్మీకి  మహర్షి పురాణసూత్ర జ్ఞానాన్ని సముపార్జించారు


 వ్యాసభగవానుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర  తీర్థంలో సరస్వతీదేవి గురించి తపస్సు  ఆచరించి వరాలు పొంది ఆ తర్వాతే వేద విభాగాన్ని, పురాణ రచన చేశారు


సరస్వతి దేవి శక్తి ప్రభావంతోనే పరమేశ్వరుు  ఇంద్రుడికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడని చెబుతారు


విద్య నేర్పించిన గురువు ఆగ్రహానికి గురైన యాజ్ఞవల్క్య మహర్షి  తాను నేర్చుకున్నదంతా మర్చిపోయాడు. ఆ తర్వాత సూర్యుడి గురించి తపస్సు చేయడా ప్రత్యక్షమైన ఆదిత్య భగవానుడు సరస్వతీ దేవిని ప్రార్థించమని చెప్పాడట. అలా కోల్పోయిన జ్ఞాపకశక్తిని సరస్వతీ ప్రార్థన అనంతరం తిరిగి పొందాడు యాజ్ఞవల్క్య మహర్షి


Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు


ఈ రోజు సరస్వతీ దేవికి దద్ధ్యోజనం, పాయసం, ఇతర తీపి పదార్థాలు నివేదిస్తారు. తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. కలువ పూలతో పూజ మంచి ఫలితాలను ఇస్తుంది.  ఈ రోజు సరస్వతీ అష్టోత్తరం, సరస్వతీ దేవి స్త్రోత్రాలు పారాయణం చేయడం మంచిది.  


సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిద్బవతుమే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ


Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!