Dussehra Navratri Puja Vidhi:  శరన్నవరాత్రుల్లో ప్రకృతిలో వచ్చే అనుకూల మార్పు శక్తి ఆరాధన అయితే.. ప్రతికూల మార్పు యమ దంష్ట్రలు. ఈ యమ దంష్ట్రలు ఆశ్వయుజమాసంలో వచ్చే దసరా సమయంలో, చైత్రమాసంలో వచ్చే ఉగాది రోజుల్లో ఉంటాయి. అందుకే దీర్ఘకాల అనారోగ్యంతో ఉండేవారు, వయసు మళ్లినవారు ఎక్కువమంది ఈ సమయంలోనే మరణిస్తుంటారు. అయితే ఈ ప్రతికూల శక్తిని ఇంట్లోంచి తొలగించేందుకే దేవీ ఆరాధన.  శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారి ఆరాధన చేస్తే జీవితంలో కష్టాలు,  నష్టాలు , దారిద్ర్యం తొలగిపోతుంది. తప్పుడు మార్గంలో వెళ్లేవారు సన్మార్గంలో అడుగుపెడతారు.


షోడసోపచార పూజ


దసరా సమయంలో అమ్మవారికి నిత్యం షోడసోపచారాలతో పూజ చేయాలి.  వాస్తవానికి త్రికాలాల్లో..అంటే రోజుకి మూడుసార్లు శక్తి ఆరాధన చేయాలి...కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పూటలా పూజ అంటే కుదరదు..అందుకే నిత్యం ఉదయం, సాయంత్రం పూజ చేయాలి. శక్తి కొలది నైవేద్యం సమర్పించాలి. నిత్యం ఒకే సమయంలో పూజ చేసేందుకు ప్రణాళిక వేసుకోండి. షోడసోపచార పూజ చేయలేని వారు అమ్మవారికి దీప, ధూప నైవేద్యాలు సమర్పించి దుర్గా అష్టోత్తరం, కవచం , లలితా సహస్రనామం..ఇలా ఏది చదువుకున్నా చాలు.. 


Also Read: దసరాల్లో మీ ఇంట ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు వాస్తు ప్రకారం అనుకూలమైన రంగులివే!


కౌమారీ పూజ


దసరా నవరాత్రుల్లో కౌమారీ పూజ చేయడం శుభఫలితాలనుఇస్తుంది. పదేళ్లలోపు చిన్నారులను ఇంటికి ఆహ్వానించి బాలపూజ చేయాలి. 
బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రంలో బాలపూజ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.  భండాసురుడు అనే రాక్షసుడి సంతానం దేవతలను హింసలు పెట్టేవారు. హంసలు లాగే రథంపై వచ్చిన చిన్నారి భండాసురుడి 30 మంది పిల్లల్ని సంహరించింది. చిన్నారి అయినా శక్తి తక్కువేం లేదంటూ అప్పటి నుంచి బాల ఆరాధన ప్రారంభించారు. రెండేళ్ల బాలిక నుంచి పదేళ్ల బాలిక వరకూ పూజించవచ్చు. దసరా నవరాత్రుల్లో బాలపూజ చేయడం వల్ల విద్య, జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని విశ్వాసం.  


Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!


అపరాజితా దేవి ఆరాధన


విజయ దశమి రోజు అపరాజిత దేవీని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. దుర్గాదేవి అంశలలో ఇదో అవతారం. అపరాజిత అంటే ఎవరిచేతిలోనూ ఓటమి లేనిది అని అర్థం. భూమండలంపై అధర్మం పెరిగినప్పుడు ఉద్భవించింది అపరాజిత. ఈ అమ్మవారిని ఆరాధిసతే అపజయం అనేదే ఉండదు. దేవీపురాణం , చండీసప్తశతి లోనూ అమ్మవారి గురించిన వర్ణన ఉంటుంది. శరన్నవరాత్రుల్లో అపరాజిత దేవి స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. 
 
శమీవృక్షం పూజ


విజయదశమిరోజు సాయంత్రం శమీవృక్షంలో అమ్మవారి శక్తి నిక్షిప్తమైఉంటుంది. అందుకే దశమి రోజు శమీ వృక్షాన్ని పూజించాలని చెబుతారు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు వారి ఆయుధాలు భద్రపరిచింది ఈ వృక్షంపైనే. ఉత్తర గోగ్రహణ సమయంలో అజ్ఞాతవాసం ముగించుకుని ఆ శమీ వృక్షానికి నమస్కరించి ఆయుధాలను తిరిగి తీసుకుని విజయం సాధించారు. అందుకే జమ్మిచెట్టుని విజయానికి చిహ్నంగా భావిస్తారు. 


Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!
 
దాన ధర్మాలు


ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం తలపెట్టినా..దాన, ధర్మాలు చేసినప్పుడే అందుకు తగిన ఫలితం మీరు పొందగలరు. దసరా తొమ్మిదిరోజులు మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. కష్టాల్లో ఉండేవారికి అండగా నిలవండి..


ఈ 5 విషయాల్లో ఏది అనుసరించినా లేకున్నా..మొదటి, ఆఖరివి ఆచరించండి..మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.  


Also Read: ఈ ప్రాంతాల్లో దసరా సెలబ్రేషన్స్ అదిరిపోతాయ్..మీరు వెళ్లారా ఒక్కసారైనా!


అమ్మవారి పూజ చేసేవారు పాటించాల్సిన నిమయాలు



  • ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి

  • సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి - మాంసాహారం ముట్టుకోవద్దు

  • లౌకికివిషయాలపై మనసు మళ్లనీయకండి

  • నవదుర్గలకు ఒక్కో దుర్గకు ఒక్కో శ్లోకం ఉంది..వాటిని నిత్యం చదువుకోండి

  • తొమ్మిది రోజు ఒకపూట భోజనం చేయండి - నేలపైనే నిద్రించండి

  • అనారోగ్యంతో ఉండేవారు భక్తితో అమ్మవారికి నమస్కరిస్తే చాలు..నియమాల పేరుతో అనారోగ్యం పెంచుకోవద్దు..