Nava Durga Temples Separately in Varanasi: కాశీ అన్నపూర్ణ, గౌరి, దుర్గ.. పేరేదైనా అన్నీ శక్తి స్వరూపాలే. ఆ శక్తి స్వరూపిణియే..మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతిగా ఆవిర్భవించిందని.. మళ్లీ ప్రతి అవతారం నుంచి మరో రెండు రూపాలు ఉద్భవించాయని చెబుతారు. మొత్తం ఈ తొమ్మిది రూపాలు ఒకే దగ్గర కొలువైన ఆలయాలు మహారాష్ట్ర , గోవాలో ఉన్నాయి..అయితే ఇందులో ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేక ఆలయం వారణాసిలో ఉంది. 


కాశీలో కొలువైన నవదుర్గల ఆలయాలివే


శైలపుత్రి


దసరా నవరాత్రుల్లో తొలిరోజు పూజించే అవతారం శైలపుత్రీ. పుట్టింట్లో జరిగిన అవమానం భరించలేక అగ్నికి ఆహుతైన సతీదేవి ఆ తర్వాత హిమవంతుడి ఇంట జన్మించింది. ఆమెనే శైలపుత్రి, హేమవతి అంటారు. నందివాహనంపై దర్శమనిచ్చే శైలపుత్రి..త్రిశూలం, కమలం పట్టుకుని తలపై చంద్రవంకతో దర్శనమిస్తుంది. ఈ ఆలయం కాశీలో మార్హియా ఘాట్‌లో ఉంది. శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఇచ్చే హారతి చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.  


బ్రహ్మచారిణి 


శివుడిని భర్తగా పొందేందుకు ఘోర తపస్సు చేసిన పార్వతీదేవికి ప్రతీకగా తెల్లచీర కట్టుకుని చేతుల్లో జపమాల, కమండలం ధరించిన అవతారం ఇది. బ్రహ్మచారిణీ రూపంలో పూజించే అమ్మవారి ఆలయం వారణాసిలోని గంగా ఘాట్‌ సమీపంలో ఉంటుంది. బాలాజీ ఘాట్‌ సమీపంలోనూ ‘మా బ్రహ్మేశ్వర్‌’ పేరుతో మరో ఆలయం  ఉంది.


Also Read:  దసరా సెలవులలో మీ పిల్లలకు ఇవి నేర్పించండి!


చంద్రఘంటా 


తన శిరస్సున ఉన్న చంద్రుడిని చూసి ముచ్చటపడిన గౌరీదేవి కోరిక తీర్చేందుకు శివుడు చంద్రుడిని తీసి ఆమెకు అలంకరించాడట.  ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండడంతో ఆమెను చంద్రఘంట అని పిలుస్తారు. పులివాహనంపై పదిచేతుల్లో అస్త్రాలు, కమండలం ధరించి రాక్షసులను వణికించే రూపంలో కనిపిస్తుంది. చంద్రఘంటాదేవి ఆలయం వారణాసిలోని జైత్‌పురిలో ఉంది.


కూష్మాండా 


నవరాత్రుల్లో నాలుగో రోజు ఆరాధించే రూపం కూష్మాండదుర్గ. వివాహమైన త్వాత పార్వతీదేవికి తాను మహాశక్తి స్వరూపం అని.. సృష్టిలో సకల ప్రాణులకీ తనే మూలమని తెలుసుకునేలా చేస్తాడు శివుడు. అప్పుడు ఆమె కమండలం, ధనుస్సు, బాణం, కమలం, అమృతకలశం, చక్రం, గద, జపమాల ధరించి కూష్మాండ రూపంలో కనిపించింది. కాశీలో ఈ ఆలయం స్వయంభు రూపంలో ఉంటుంది.  


Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!


స్కందమాత...


దసరా నవరాత్రుల్లో ఐదో రోజు కొలిచే అవతారం ఇది. అన్నపూర్ణా దేవి మందిరం సమీపంలో ఉన్న ఈ ఆలయంలో కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకుని సింహవాహనంమీద దర్శనమిస్తుంది. స్కందమాతకి చేసే పూజలు కుమారస్వామికి చెందుతాయని చెబుతారు. తెలివితేటలకు , సంపదకు ప్రతీకగా స్కందమాతను చెబుతారు. 


కాత్యాయని...


శరన్నవరాత్రుల్లో ఆరోరోజు కనిపించే అవతారం కాత్యాయని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట జన్మించింది. ఆశ్వయుజమాసంలో సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో కాత్యాయన మహర్షి పూజలందుకుని..విజయ దశమి రోజు మహిషాసురుణ్ణి వధించింది. ఈ రూపాన్ని పూజిస్తే ధర్మార్థకామమోక్షములు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కాత్యాయని ఆలయం వారణాసితో పాటూ కర్ణాటక అవెర్సలోనూ ఉంది.  


కాళరాత్రి


శరన్నవారత్రుల్లో ఏడో రోజు కాళరాత్రి రూపంలో ఉన్న దుర్గను పూజిస్తారు. నల్లని శరీరం, విరబోసిన జుట్టు, కాంతులు వెదజల్లే కళ్లతో దర్శనమిస్తుంది. ఈ రూపం భయంకరమే కానీ అన్నీ శుభాలే కలిగించే తల్లి కాళరాత్రి. కాశీలో ఉన్న కాళరాత్రి ఆలయంలో శరన్నవరాత్రుల్లో ఏడోరోజు అమ్మకు ఇచ్చే హారతి చూస్తే చాలు సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.  


మహాగౌరి...


దసరా నవరాత్రుల్లో ఎనిమిదోరోజు కనిపించే రూపం మహాగౌరి. ఈమెను పూజిస్తే చేపట్టిన కార్యంలో అడ్డంకులు తొలగిపోయి సకలకార్య సిద్ధి ఉంటుందంటారు. కాశీతో పాటూ మహాగౌరి ఆలయం లూథియానాలో ఉంది


సిద్ధిధాత్రి...


నవరాత్రుల్లో తొమ్మిదోరోజు కొలిచే అమ్మవారు సిద్ధిధాత్రి.  పాపాలు పోగొట్టి అంతా మంచి జరగాలని దీవించే తల్లిగా సిద్ధిధాత్రిని పూజిస్తారు. ఈమె ఆలయం కాశీతో పాటూ ఛత్తీస్‌ఘడ్‌లో  దేవపహారీ, మధ్యప్రదేశ్‌ సాగర్‌లోనూ ఉంది.  


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!