కేరళ రాష్ట్రంలో ఏటా నిర్వహించే అతి పెద్ద పండుగ తిసూర్ పూరం. లాక్ డౌన్ కారణంగా రెండేళ్ళ నుంచి ఈ ఉత్సవం జరగలేదు. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో త్రిసూర్ పూరం ఉత్సవం వైభవోపేతంగా జరుగుతోంది.






త్రిసూర్ పూరం 18వ శతాబ్ధపు కొచ్చి రాజు శక్తి తంపురాన్ ప్రారంభించిన వార్షిక పండుగగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 36 గంటలపాటు తెక్కింకాడు మైదానంలో కన్నుల పండుగా నిర్వహిస్తారు. త్రిసూర్ పూరం అనేది కేరళ వ్యాప్తంగా ఉన్న 10 ఆలయాలకు చెందిన దేవతల సమావేశం గురించింది. కానీ ఇప్పుడు తిరువాంబడి, పరమెక్కావు ఆలయాలు మాత్రమే ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 






అద్భుతంగా అలంకరించినన ఏనుగులు, వీనుల విందైన సంగీతం, ఉత్సాహభరితమైన పెద్ద పెద్ద గొడుగుల ప్రదర్శన, బాణాసంచా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఏడాదంతా ఎక్కడున్నా ఈ త్రిసూర్ పూరం ఉత్సవానికి మాత్రం కేరళ చేరుకుంటారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేలాది భక్తుల హర్షధ్వానాల మధ్య శివకుమార్ అనే ఏనుగు ఆలయ దక్షిణ ద్వారాన్ని తెరవడంతో.. ఆ తర్వాత నీతిలక్కవిళమ్మ విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగించడంతో ఆదివారం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. దీనిని పూర విలంబరం అంటారు.కరోనా వల్ల మొదటిసారి ఉత్సవం రద్దయింది. ఇండో-చైనా యుద్ధం జరిగిన 1962లో కూడా ఈ ఉత్సవం నిరాటంకంగా నిర్వహించారంటే ఈ ఉత్సవానికి వున్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు.


Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం


త్రిసూర్‌ పూరం వేడుక ఆవిర్భావమే ఆసక్తికరం
ఒకప్పుడు త్రిసూర్‌ జాల్లాలోని ఆలయాలన్నీ ఆరట్టుపుళ పూరంలో పాల్గొనేవి. ఓ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా శ్రీవడక్కునాథన్‌ ఆలయ సిబ్బంది సమయానికి ఆరట్టుపుళకు చేరుకోలేకపోయింది. కారణమేంటో తెలుసుకోకుండా త్రిసూర్‌కు చెందిన బృందాన్ని వేడుకల నుంచి బహిష్కరించారు. దీన్ని అవమానంగా భావించారు వడక్కునాథన్‌ ఆలయ అధికారులు. అప్పుడే తమ ఆలయానికి ప్రత్యేకంగా పూరం జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. అయితే వీరితో మిగతా ఆలయాల అధికారులు కలిసిరాలేదు.. దాంతో ఈ పూరం ఎక్కవకాలం నిలువలేకపోయింది. 18వ శతాబ్దం ఆరంభంలో కొచ్చిన్‌ రాజవంశానికి చెందిన శ్రీరామవర్మ పాలన ప్రారంభమయ్యింది.త్రిసూర్‌ పూరం గురించి తెలుసుకున్న ఆయన తిరిగి ఆ పండుగను నిర్వహించడానికి పూనుకున్నారు. అలా త్రిసూర్‌పూరం పున:ప్రారంభమయ్యింది. రెండు వందల సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. 


పదిహేను రోజుల ముందునుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. కేరళలో పేరొందిన కళాకారులంతా త్రిసూర్‌కు వస్తారు. పంచవాద్య, చెండామేళం కళాకారుల బృందాలు సాధనలో నిమగ్నమవుతాయి. ఏటా జరిగే ఉత్సవమే అయినా ఏటికేడు రెట్టించిన ఉత్సాహం, అనిర్వచనీయమైన ఆనందం.. అదే త్రిసూర్‌ పూరం ప్రత్యేకం.పూరం అంటే పర్వం కాదు. పూరం అంటే సమ్మేళనం, సంపూర్ణం. అందరూ కలిసి చేసుకునే అపురూప సంబరం. పూరం అంటే సమూహమని అర్థం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా స్థానికులతో కలిసి సమూహంగా ఏర్పడి ఏడాదికోసారి పరమేశ్వరుడిని సేవించుకోవడమే పూరం అర్థం.


Also Read:  విలువైన వస్తువులు, పత్రాలు పోగొట్టుకుంటే ఈ అమ్మవారిని ప్రార్థిస్తే దొరుకుతాయట