రణవీర్ సింగ్, షాలినీ పాండే జంటగా నటిస్తున్న ‘జయేష్ భాయ్ జోర్దార్’ చిత్రం చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదలైన ‘జయేష్ భాయ్ జోర్దార్’ ట్రైలర్‌లోని ఓ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా విడుదలపై సందేహాలు నెలకొన్నాయి.
‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాలో రణ్‌వీర్ సింగ్ భిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆడవాళ్లను హీనంగా చూసే సర్పంచ్ కొడుకుగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు. రణ్‌వీర్ భార్యగా షాలినీ పాండే నటించింది. రణ్‌వీర్, షాలినీలకు అప్పటికే ఆడ బిడ్డ పుడుతుంది. దీంతో రెండో బిడ్డ తప్పకుండా మగ బిడ్డే కావాలని రణ్ వీర్ తండ్రి ఆదేశిస్తాడు. ఈ సందర్భంగా ఆలయంలో షాలినీ కడుపులో ఉన్న బిడ్డ, ఆడ పిల్లా లేదా మగ పిల్లా అని తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. అయితే, అది ఆమె కడుపులో ఆడ బిడ్డ పుడుతుందని సంజ్ఞ చేస్తుంది.
తండ్రికి భయపడి రణ్‌వీర్.. షాలినీని హాస్పిటల్‌కు తీసుకెళ్లి అల్ట్రాసౌండ్ టెక్నాలజీ ద్వారా తనకు పుట్టబోయే బిడ్డ ఆడ పిల్లా లేదా మగ బిడ్డా అని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. ఇందుకు ఓ కోడ్ ఉపయోగిస్తారు. కడుపులో మగ బిడ్డ ఉన్నట్లయితే డాక్టర్ ‘హరే కృష్ణ’ అని చెబితే మగ బిడ్డ, ‘జై మాతాజీ’ అంటే ఆడ బిడ్డ అని అర్థం. ఈ నేపథ్యంలో అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసిన డాక్టర్ ‘జై మతాజీ’ అని అంటుంది. అంటే, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆడ పిల్ల అని కోడ్ లాంగ్వేజ్‌లో చెబుతుంది. దీంతో తన తండ్రి నుంచి కడుపులో బిడ్డను కాపాడుకొనేందుకు రణ్‌వీర్, షాలినీలు ఇల్లు వదిలిపారిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెరపైనే చూడాలి. ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
అయితే, ట్రైలర్‌లో అల్ట్రాసౌండ్ టెక్నాలజీలో లింగ నిర్ధరణ చేయడంపై అడ్వకేట్ పవన్ ప్రకాష్ పాఠక్ ద్వారా యూత్ ఎగైనెస్ట్ క్రైమ్ అనే ఎన్జీవో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రసవానికి ముందు లింగనిర్ధారణ వంటి చర్యలను తేలికగా తీసుకోకూడదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, న్యాయమూర్తి నవీన్ చావ్లాతో కూడిన ధర్మాసనం ఈ ట్రైలర్‌ను వీక్షించింది.
Also Read: నాగార్జునకు ముద్దు పెట్టిన అషురెడ్డి - ఏం చెప్పిందో తెలుసా?
ఈ కేసు దాఖలు చేసిన పిటిషనర్ మాట్లాడుతూ.. “అల్ట్రాసౌండ్ క్లినిక్ దృశ్యంలో లింగ నిర్ధరణ అంశాన్ని సెన్సార్ చేయకుండా చూపించారు. ఇది సెక్షన్ 3, 3A, 3B, 4, 6 ప్రకారం ఇది నేరం. PC & PNDT చట్టంలోని సెక్షన్ 22 ఇందుకు అనుమతించదు. అందుకే ఈ పిల్ దాఖలు చేశాం’’ అని తెలిపారు. అయితే, ఈ చిత్రాన్ని సామాజిక కోణంలోనే తెరకెక్కించారు. ఆడ పిల్లలను కాపాడాలనే కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా ట్రైలర్‌లో డిస్‌క్లైమర్‌ను పెట్టామని చిత్ర నిర్మాతల తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసుపై వాదనలు కొనసాగుతున్నాయి.
‘జయేష్ భాయ్ జోర్దార్’ ట్రైలర్: