Karimnagar Woman Special Gifts to Chiranjeevi Ramcharan: కుక్క పిల్ల... అగ్గిపుల్ల... సబ్బు బిళ్ళ.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు కళాకారుల దృష్టి పడితే ఏ వస్తువైనా వారు చెప్పినట్టుగా మారాల్సిందే. అలాంటి ఓ అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న ఓ మహిళ ఈమె. ఈవిడ పేరు బొడ్డు శ్రీమతి. తన భర్త సుదర్శన్. వీరి కుటుంబం కరీంనగర్ లోని బోయవాడలో నివాసం ఉంటోంది. ఇంతకీ శ్రీమతి స్పెషాలిటీ ఏంటంటే బాంబూ broomstick (వెదురు)తో చేసే చీపురు పుల్లలతో అద్భుతమైన కళా ఖండాలను తయారు చేస్తోంది. కేవలం కరీంనగర్ పట్టణానికి చెందిన టవర్, కమాన్ లాంటి ప్రాంతాలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఈఫిల్ టవర్, లోటస్ టెంపుల్, హైటెక్ సిటీ, ఎర్రకోట, గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్ తోబాటు మన పార్లమెంట్ భవనాన్ని సైతం అచ్చుగుద్దినట్టుగా పుల్లలతో తయారు చేసింది.
ఒక్కో ఆర్ట్ తయారీకి దాదాపుగా మూడు నెలల నుండి ఆరు నెలల సమయం పడుతుందని, రోజుకు దాదాపు 10 నుండి 12 గంటలపాటు కూర్చుంటేనే పూర్తవుతుందని ఆవిడ అంటున్నారు. ఎంతో ఓపికగా, శ్రద్ధగా కొలతల్లో ఏమాత్రం తేడా రాకుండా వీటిని తయారు చేయాల్సి ఉంటుందని అందుకే అవి చూసిన వారు సైతం ఎలాంటి వంకలు పెట్టలేరని ఆవిడ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. చిన్నప్పుడు తన మామగారు అట్టముక్కలతో చేస్తున్నటువంటి స్కూల్ బిల్డింగ్ చూసిన తన మనసులో దీనిపై ఆసక్తి పెరిగిందని.. క్రమక్రమంగా పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతలు పెరిగాక తను ఈ కళపై దృష్టిసారించలేక పోయానని తెలిపారు. కానీ మళ్లీ ఈ వయసులో పూర్తిస్థాయిలో కళకే తన జీవితాన్ని కేటాయించానని ఆవిడ అన్నారు.
గతంలో రామ్ చరణ్ కొత్తగా కట్టుకున్న ఇంటిని ఇలాగే పుల్లలతో తయారు చేసి బర్త్ డే గిఫ్ట్ గా అందించానని, అందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ఆవిడ చెప్పారు. రామ్ చరణ్ గత పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను కలిసి ఆ బహుమతి అందించగా, ఆయన ఉబ్బితబ్బిబ్బైనట్లుగా చెప్పారు. ఆ సందర్భంగా రామ్ చరణ్.. ఆర్టిస్ట్ శ్రీమతి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా ఆవిడ ఒక గిఫ్ట్ తయారు చేశారు. చిరంజీవి సొంత ఊరు మొగల్తూరులో నివాసమున్న ఇంటిని పూర్తిస్థాయిలో వెదురు పుల్లలతో తయారు చేశారు శ్రీమతి. అచ్చుగుద్దినట్టుగా అలాగే ఉన్న దీన్ని ఈసారి మెగాస్టార్ బర్త్ డేకి గిఫ్ట్ గా ఇస్తానని చెబుతున్నారు. ఈవిడ టాలెంట్ ని గమనించిన పలు సంస్థలు సత్కరించగా.. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వారి అమేజింగ్ టాలెంట్ లో ఈవిడకి స్థానం కల్పించారు. ఈమె ప్రతిభకు ఎన్నో గుర్తింపులు కూడా దక్కాయి.