Husnabad Model School : పాఠశాలలో హీటర్ సరిగ్గా పనిచేయడంలేదని ప్రశ్నించిన విద్యార్థినిపై ప్రిన్సిపల్ , ఉపాధ్యాయులు వేధింపులకు దిగారు. అధికారులకు పాఠశాలలో సమస్యలు ఎందుకు చెప్పావని ఇతర విద్యార్థుల ముందు తరచూ తిడుతూ వేధించారు. అక్కడితో ఆగకుండా ఏకంగా పాఠశాల నుంచి పంపించేశారు. ఈ ఘటన ఇటీవల హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ చోటుచేసుకుంది. దీనిపై విద్యార్థిని తండ్రి అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఇవరికి ఆయన ఆస్క్ కేటీఆర్ లో మంత్రి కేటీఆర్ కు తమ సమస్యను చెప్పుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి. 




ఆస్క్ కేటీఆర్ లో ఫిర్యాదు 


హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ లో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన తనను అక్రమంగా స్కూల్ నుండి పంపించివేశారని, పైగా లేనిపోని ఆరోపణలు చేశారని ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది ఆ పాఠశాల విద్యార్థిని హరిణి. దీంతో స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే ఆమె సమస్యను పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. గతంలో ఇదే అంశంపై సదరు విద్యార్థిని తండ్రి సిద్దిపేట డీఈఓకు వ్యక్తిగతంగా ఫిర్యాదు కూడా చేశారు. మోడల్ స్కూల్ లో మద్యం బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయని తాము కంప్లైంట్ చేస్తే దానికి ప్రతిగా పిల్లలే మద్యం తాగుతున్నారని అంటూ సదరు ప్రిన్సిపాల్ అసత్య ప్రచారానికి పాల్పడుతోందని వారు సంబంధిత ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై పై కేటీఆర్ స్పందించారు కాబట్టి అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి మరి. 


అసలేం జరిగింది? 


స్కూల్ చుట్టూ మద్యం బాటిళ్లపై ప్రశ్నిస్తే పిల్లలు మద్యం తాగుతున్నారంటూ ప్రచారం చేస్తోందని ఓ ప్రిన్సిపాల్ పై పేరెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థిని విద్యార్థుల పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి వేధింపులపై  డీఈఓకి కంప్లైంట్ ఇచ్చారు సదానందం అనే ఓ పేరెంట్. గతంలో సౌకర్యాల విషయంలో తన కూతురు ప్రశ్నిస్తే అధికారులు ప్రిన్సిపాల్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అది గుర్తు పెట్టుకొని విద్యార్థినిని వేధిస్తోందని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. పాఠశాలకు సమీపంలో మద్యం బాటిల్స్ ఉండడంతో పలుమార్లు ప్రశ్నించామని, దీంతో తమపై కక్షగట్టిన ఆ ప్రిన్సిపాల్ పిల్లలే మద్యం తాగుతున్నారని  డైరీలో ఉందని తప్పుడు  ప్రచారం చేశారని ఆవేదన వెలిబుచ్చారు. అక్కడి సమస్యలకు సంబంధించి తన కూతురు పూర్తి స్థాయిలో వివరిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత డైరీలో రాసుకుంటే ఆ డైరీని దొంగలించి తప్పులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని పేరెంట్స్ కోరుతున్నారు.


గతంలో పిల్లలు పేరెంట్స్ కమిటీ మెంబెర్ అయిన తనతో వారికి పెడుతున్న ఆహారానికి సంబంధించి ఓ విద్యార్థి మాట్లాడిన వీడియో కూడా బయటపెట్టారు విద్యార్థిని తండ్రి సదానందం. దీనిపై పూర్తి వివరణ కోసం సిద్దిపేట డీఈఓ రమాకాంత్ ని అప్పట్లో ఏబీపీ దేశం సంప్రదించగా పూర్తిస్థాయిలో విచారణ జరిపి సదరు ప్రిన్సిపాల్ ను వివరణ కోరి మోడల్ స్కూల్ సొసైటీకి పంపిస్తున్నామని తెలిపారు. ఇక ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజే వైఎం నాయకులు డిమాండ్ చేశారు.