Ex Minister Narayana Arrest: మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన భార్యను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకెళ్తుండగా ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ వచ్చిన ఏపీ పోలీసులు కొండాపూర్‌లోని నారాయణ నివాసం నుంచి ఆయన సొంత మెర్సిడిస్ బెంజ్ వాహనంలోనే తరలించారు. ఈ క్రమంలో నారాయణను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు వెంటనే రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాహనం నెంబరు, ఇతర వివరాలను పోలీసులకు చెప్పారు. ఏపీలో పోలీసులు నారాయణను కాసేపటి క్రితమే తీసుకెళ్లారని చెప్పగా, వెంటనే స్పందించిన రాయదుర్గం పోలీసులు ఆ మార్గంలో ఉండే పోలీసులను అప్రమత్తం చేశారు. బెంగళూరు మార్గంలో ఉన్న కొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు.


వీరి వాహనం కొత్తూరుకు చేరుకోగానే, స్థానిక పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లోపల నారాయణతో పాటు ఆయన భార్య, చిత్తూరు పోలీసులు ఉన్నట్లుగా నిర్ధరించారు. అయితే, ఫలానా కేసులో భాగంగా నారాయణను తీసుకెళ్తున్నట్లుగా వారు చెప్పారు.


నారాయణపై మరో కేసు, చంద్రబాబుపై కూడా
ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణలపై అమరావతి భూముల (అమరావతి ల్యాండ్ పూలింగ్) విషయంలో మరోసారి కేసులు నమోదు చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ లో అక్రమాలు అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఏప్రిల్ 4వ తేదీన మంగళగిరి సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.  దీనిపై ప్రాథమిక దర్యాప్తు నిర్వహించారు. మే 6వ తేదీ ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. మే 9 వ తేదీన కేసు నమోదు చేశారు. మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చి ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, మజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేష్, ప్రభుత్వ అధికారులు నిందితులుగా పేర్కొన్నారు. 


ఆయన వాంగ్మూలం ఆధారంగా అదుపులోకి..
చిత్తూరులోని నారాయణ స్కూల్స్ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నారాయణను హైదరాబాద్ లో నుంచి అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారని, ఎవరికీ అందుబాటులో లేరని తెలుస్తోంది. దీంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఏపీలోని చిత్తూరుకు తరలిస్తున్నారు. 


ఈ పేపర్ లీకేజీ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్‌ఐ స్కూళ్లలో పనిచేస్తున్న వారిగా తెలుస్తోంది.