ఏపీలో మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల యజమాని నారాయణను ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్న పత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణ వెంట ఆయన భార్య కూడా ఉండడంతో ఇద్దర్నీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏపీలోని చిత్తూరుకు ఆయన సొంత కారులోనే తరలిస్తున్నారు.


ఏపీలో పదో తరగతి పరీక్షల ప్రారంభం సందర్భంగా క్వశ్చన్ పేపర్లు వరుసగా లీకైన సంగతి తెలిసిందే. అందుకు కారణం నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలే అని ఇటీవల తిరుపతిలో ఓ కార్యక్రమంలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను అరెస్టు చేయడం చర్చనీయాంశం అయింది.


నారాయణ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం - అచ్చెన్నాయుడు
జగన్ రెడ్డి తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు లేకుండా మాజీ మంత్రి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని అన్నారు. రోజురోజుకూ జగన్ రెడ్డి పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్నాల లీకేజీ ఎక్కడా జరగలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి చెబుతుంటే, నారాయణను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని, పరీక్షల నిర్వహణలో విఫలమై ఆ నెపాన్ని నారాయణపై నెట్టారని అన్నారు. అక్రమ అరెస్ట్ ల పట్ల భవిష్యత్ లో మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


అడ్డుకొనేందుకు యత్నిస్తున్న టీడీపీ నాయకులు


మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు చిత్తూరుకు ఆయన సొంత కారులోనే తరలిస్తున్నందున టీడీపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం టోల్ గేట్ల వద్ద మోహరించారు. మరోవైపు, నారాయణకు బెయిల్ కోసం టీడీపీ నేతలు చిత్తూరు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.