Sita Temples Across India: సీతారాముల ఆలయం లేని ఊరు ఇండియాలో కనిపించదు. కానీ రాముడు లేని సీతకు గుడి ఉందా అంటే అవి అత్యంత అరుదుగా కనిపిస్తాయి. నార్త్ ఇండియా లో కొన్ని గుళ్ళు అలాంటివి ఉంటే సౌత్ ఇండియాలో మాత్రం ఒకటి రెండు  ఉన్నాయి . తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం  వడ్లూరు గ్రామంలో సీతాదేవికి మాత్రమే  ఒక గుడి ఉంది. ఈ గుడిని బాల సీతమ్మ  లేదా జానకి దేవి  గుడిగా పిలుస్తారు.  సీతాదేవి పాదాలు కూడా ఇక్కడ ఉండడంతో ఈ గుడిని జానకి దేవి పాదపద్మాలయం అని కూడా అంటారు. ఈ చుట్టుపక్కల ఊళ్ల లోని మహిళలు ఈ ఆలయంలో  ప్రత్యేకమైన పూజలు, వ్రతాలూ చేస్తుంటారు. అన్నట్టు ఈ గుడి అభివృద్ధికి ఇచ్చిన స్థలం అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా చిలుకూరి  పూర్వికులది. వారిచ్చిన స్థలంలోనే ఈ గుడిని  డెవలప్ చేశారు. ఈ ప్రాంగణంలోనే సాయిబాబా ఆలయం కూడా  ఉంది. ఆడపిల్లలు ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్  ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లడం  ఆనవాయితీగా మారింది.


Also Read: లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం క్షీరాబ్ధి ద్వాదశి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి !


సీతమ్మ పాదాలకు పూజలు


తణుకు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్లూరు గ్రామం అమెరికా ఎన్నికల పుణ్యమా అంటూ  ప్రస్తుతం బాగా పాపులర్ అయింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్  భార్య ఉష చిలుకూరి పూర్వీకులది ఈ ఊరే. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఈ ఊరి పేరు వైరల్ అయింది. కానీ నిజానికి చాలా కాలం క్రితం  నుంచీ సీతమ్మ ఆలయం పేరు మీద వడ్లూరు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సీతమ్మ పాదాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచీ ఆ పాదాలనే ఈ చుట్టుపక్కల ఊరు వాళ్ళు  పూజించేవారు. తర్వాత కాలంలో ఇక్కడ సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు.


శ్వేతవర్ణంలో మెరిసిపోయే  విగ్రహాన్ని చూడడానికి తణుకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి  వడ్లూరు వస్తుంటారని  ఆలయ పూజారి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ముఖ్యంగా ఆడవాళ్లు తమ నోములు నోచుకోవడానికి గుడికి వస్తుంటారు.


Also Read: క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ ఇదే.. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాక చదువుకోవాలి!


ఉషా చిలుకూరి పూర్వీకులు దానం చేసిన స్థలంలో ఈ గుడిని డెవలప్ చేశారు. సీతమ్మ విగ్రహంతో పాటే సీతాదేవి భూమి లోపలికి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని కూడా ఇక్కడ శిల్పాల రూపంలో చెక్కారు. అలాగే ఇదే గుడిలో నవగ్రహాల విగ్రహాలు, నాగ ప్రతిష్టలు ఉన్నాయి.


రాముడు లక్ష్మణుడు  విగ్రహాలు మాత్రం ఇక్కడ కనపడవు. అందుకే ఈ గుడిని జానకి దేవాలయంగా  లేదా జానకి పాదపద్మాలయంగా పిలుస్తుంటారు. అయితే సీతారామ కళ్యాణం మాత్రం ఇక్కడ ఘనంగా జరుగుతుందని ఊరి వాళ్ళు తెలిపారు.


 దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న సీతాదేవి ఆలయాలు 
వడ్లూరు ఊరి వాళ్ళు సౌత్ ఇండియాలో ఇది ఒకటే సీతాదేవి టెంపుల్ అని చెప్తున్నా  నిజానికి కేరళలోనూ  సీతాదేవికి ఒక ఆలయం ఉంది. అలాగే దేశం మొత్తం మీద  5 ఆలయాలు  ఇలాంటివి ఉన్నాయి. అవేంటో చూద్దామా.


1) సీతాదేవి టెంపుల్, వయనాడు కేరళ


కేరళలోని వయనాడు లో సీతాదేవికి ఒక టెంపుల్ ఉంది. పూర్వకాలంలో  రాముడు విడిచిపెట్టేసాక సీతాదేవి ఇక్కడే తన బిడ్డలు లవకుశలను పెంచి పెద్ద చేసిందని  ఇక్కడి స్థలపురాణం


2) సీత సంహిత స్థల్, బదోహి, యూపీ 


వారణాసి సమీపంలో గంగానది  వడ్డునే ఉన్న సీతా సంహిత స్థల్ ఆలయంలో సీతాదేవి పాలరాతి విగ్రహం ఉంది. సీతాదేవి ఇక్కడే కుశలవులకు జన్మ ఇచ్చిందని  అలాగే ఇక్కడే వారిని రాముడికి అప్పజెప్పి  తాను భూములోకి వెళ్లిపోయిందని భక్తులు నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలోనే వాల్మీకి ఆశ్రమం కూడా ఉంటుంది.


3) సీత వాణి టెంపుల్, నైనిటాల్, ఉత్తరాఖండ్


ఉత్తరాఖండ్ లోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య ఉంది సీతవాణి ఆలయం. సీతాదేవిని ఇక్కడ  వాణి రూపంలో  కొలుస్తారు. స్వర సంబంధమైన సమస్యలు  ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఉన్న గుహలో సీతాదేవి  కొంతసేపు విశ్రమించిందని అలాగే కొంతకాలం ధ్యానం చేసిందని భక్తుల నమ్మిక.


4) సీతామాయి టెంపుల్, హర్యానా


హర్యానాలోని కమల్ జిల్లాకు చెందిన సీతామాయి టెంపుల్ చాలా పురాతనమైనది. ఈ గుడి  దీని అర్క్ టెక్చర్ కు పెట్టింది పేరు. అలాగే ఈ గుడి ప్రాంగణంలో పురాతనమైన చెట్టును  సీతాదేవి నాటిందని  ప్రసిద్ధి. ఈ చెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. 


5) పునౌరా ధామ్ జానకి మందిర్, బీహార్ 


బీహార్ లోని  సీతామారి పట్టణంలోని పునౌరా ధామ్ జానకి మందిర్ ఉన్నచోటే సీతాదేవి  దొరికింది అనేది స్థల పురాణం. జనకమహారాజు పొలాన్ని దున్నుతుండగా సీతాదేవి ఇక్కడే నాగలికి దొరికిందని ప్రసిద్ధి. ఇక్కడ నల్ల రంగు లో ఉండే సీత దేవి విగ్రహం బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ ఉంటుంది. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే సీతా ఉత్సవం  చాలామంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది


Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!