నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం
అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం


ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి.. పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు. శివ పంచాక్షరీ మంత్రం అయిన న-మ-శి-వా-య అనే  బీజాక్షరాల నుంచి పంచ భూతాలు వచ్చాయని వాటి నుంచి సమస్త విశ్వం పుట్టిందని చెబుతారు. పరమేశ్వరుడిని లింగరూపంలో దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శివాలయాలు ఎన్ని ఉన్నా..కేవలం పంచభూతాత్మక స్వరూపుడిగా శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాలు ఐదు. అవేంటో చూద్దాం..


పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం...వీటినే పంచభూతలింగాలు అంటారు. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.


1.ఆకాశలింగం-చిదంబరం


పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశ లింగం తమిళనాడు చిదంబరంలో ఉంది. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు అనంతమైన ఆయన తత్వానికి పరిమితులుండవు అని సూచిస్తూ మూలవిరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి ఉన్న 9 ద్వారాలను నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై 'యంత్రం' ఉంటుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది.


2.పృథ్వి లింగం-కంచి


పంచభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరఆలయం. ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు. ఓ సమయంలో గంగమ్మ..లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా  అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు.


Also Read: శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతానికి బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు


3.వాయులింగం- శ్రీకాళహస్తి


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసింది వాయులింగం. ఏ దేవాలయం గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశం ఉండదు. ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిని అలాగే నిర్మిస్తారు. శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ రెండు దీపాలు స్వామివారి నాశికా భాగానికి సమాన దూరంలో వుంటాయి. దీనితో స్వామి వారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి. 


4.జలలింగం- జంబుకేశ్వరం


తమిళనాడులో కొలువైన మరో పంచభూతలింగక్షేత్రం జంబుకేశ్వరం. శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం. ఇందుకు సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. భక్తులకు ఈ విషయం తెలిసేందుకు పానపట్టుపై ఓ వస్త్రం కప్పుతారు. కొద్దిసేపటికి ఆ వస్త్రాన్ని తీసి నీళ్లు పిండి మళ్లీ పరుస్తుంటారు.


Also Read: ఆగష్టు 22 రాశిఫలాలు, శ్రావణ మంగళవారం ఈ రాశులవారికి ఆర్థిక వృద్ధి


5.అగ్నిలింగం-అరుణాచలం


కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం . ఇక్కడి స్వామిని అణ్ణామలై అని పిలుస్తారు. శివుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.