Kesineni Nani :  విజయవాడలో లోకేష్ పాదయాత్రను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  అందుకే  వారధి మీద విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి జన సందోహం ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు.  పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు.  జన సమీకరణ చేశారో నిజంగానే పెద్ద ఎత్తున లోకేష్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు తరలి వచ్చారో కానీ.. జన జాతర విజయవాడలో కనపిిస్తోంది. ఈ కారణంగా పాదయాత్ర ఆలస్యంగా సాగుతోంది. తెల్లవారు జాము మూడు గంటల వరకూ ఆదివారం పాదయాత్ర సాగింది. మంగళవారం గన్నవరంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. మొత్తం టీడీపీ లీడర్, క్యాడర్ అంతా కదిలింది కానీ.. కేశినేని నానీ కానీ.. ఆయన కుమార్తె .. నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ శ్వేత కానీ ఎక్కడా కనిపించలేదు. కనీసం తమ అనుచరుల్ని కూడా పంపలేదు. దీంతో మరోసారి టీడీపీలో కేశినేని తీరుపై చర్చ ప్రారంభమయింది. 


గందరగోళంగా ఎంపీ కేశినేని వ్యవహారం ! 


కృష్ణా జిల్లా నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగా.. టీడీపీ ఓడిపోయినప్పటి నుంచి కేశినేని నాని భిన్నంగా స్పందిస్తున్నారు. అత్యంత కీలక సమయాల్లో కూడా పార్టీకి అండగా ఉండలేదు. టీడీపీ ఆఫీసుపై అల్లరి మూకలు దాడి చేసినప్పుడు కూడా స్పందించలేదు. అయితే పార్టీ తరపున అధికారిక కార్యక్రమాలకు  మాత్రం ఎప్పుడూ మిస్ కాలేదు.  పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లకు  హాజరయ్యే వారు. చంద్రబాబు పర్యటనల్లో ఢిల్లీకి  కూడా వెళ్లి వచ్చారు.  ఇటీవల పుంగనూరులో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి సమయంలోనూ స్పందించారు. వైసీపీపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాదయాత్ర విషయంలో ఆయన అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం మాత్రం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. 


టిక్కెట్ రాదని ఫిక్సయ్యారా ?


తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు టిక్కెట్లపై ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నరు. ఈ కసరత్తులో కేశినేని నాని పేరు ఎక్కడా వినిపించలేదు. విజయవాడ ఎంపీ సీటును ఆయనకు మళ్లీ ఇస్తారన్న ప్రచారం లేదు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలే. ఈ కారణంగానే ఆయన  సోదరుడు కేశినేని శివనాథ్ ను టీడీపీ అధినేత ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. గుడివాడ టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న  వెనిగండ్ల రాము, కేశినేని శివనాథ్ .. కలిసి టీడీపీ కార్యక్రమాలు చేపడుతున్నారు. విస్తృతంగా సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. తన సోదరుడితో  సంబంధాలను కేశినేని నాని తెంపేసుకున్నారు. ఆయనను ప్రోత్సహిస్తున్నారని.. తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆ అసంతృప్తిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూపడం ద్వారా ముఖ్యంగా పాదయాత్రలో పాల్గొనకపోడం ద్వారా ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారన్న ప్రశ్న టీడీపీ క్యాడర్‌లో వినిపిస్తోంది. 


ఇక కేశినేని టీడీపీ మర్చిపోతుందా ?


కేశినేని నాని తాను ఇండిపెండెంట్  గా పోటీ చేసినా  గెలుస్తానని గతంలో ప్రకటించారు. అంటే ఆయన ఉద్దేశం.. టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోయినా పోటీ చేస్తాననే. నిజంగానే పోటీ చేస్తారో లేదో కానీ.. టీడీపీ మాత్రం కేశినేని నాని అభ్యర్తిత్వాన్ని ఇక పరిగణనలోకి తీసుకోదని ఆ పార్టీ క్యాడర్ నమ్మకంతో ఉన్నారు. అంతర్గతంగా ఎన్ని విబేధాలున్నా.. లోకేష్ పాదయాత్రలో కనీసం పాల్గొనే ప్రయత్నం చేయకపోవడాన్ని హైకమాండ్ తేలిగ్గా తీసుకునే అవకాశం లేదంటున్నారు. రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకుంటున్న నాని  కుమార్ కేశినేని శ్వేత కూడా స్ట్రాటజిక్ మిస్టేక్ చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి.