మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా తన తరువాతి సినిమాకు సంబంధించిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ ఒకటి విడుదలయ్యింది. ఈ పోస్టర్ చూస్తుంటే.. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది.
10.53 గంటలకు రివీల్..
మెగాస్టార్ చిరంజీవి అనేది ఒక పేరు కాదు. ఒక ఎమోషన్ లాంటిది. అందుకే తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తన తరువాతి సినిమా అప్డేట్‌ను అందించి చిరు ఫ్యాన్స్‌కు మరింత సంతోషాన్ని పంచాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తన సినిమా ఉంటుందని చిరు.. ఈ పోస్టర్ ద్వారా బయటపెట్టారు. ఈ పోస్టర్‌లో అంతకంటే పెద్దగా వివరాలు ఏమీ లేవు. చీకటిలో రాళ్ల మీద ఉన్న తేలుతో ఈ ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ విడుదలయ్యింది. ఇంకా దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఆగస్ట్ 22 ఉదయం 10.53 వరకు ఆగాలని ఇందులో రాసుంది. దీంతో అసలు ఈ సినిమా ఏంటి, దీని థీమ్ ఏంటి, దర్శకుడు ఎవరు లాంటి వివరాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సడెన్ సర్‌ప్రైజ్..
చిరంజీవి పుట్టినరోజు అర్థరాత్రి 12 గంటలు కొట్టగానే ఈ ప్రీ కాన్సెప్ట్ వీడియో అనేది ఒక సర్‌ప్రైజ్ లాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాకుండా ఇది చిరు పుట్టినరోజుపై మరింత ఆసక్తి పెరిగేలా చేసింది. యూవీ క్రియేషన్స్ అనేది కాన్సెప్ట్‌తో ఉన్న ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. మొదటిసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి యూవీ క్రియేషన్స్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ గురించి ఎలాంటి వివరాలు తెలియకపోయినా ఫ్యాన్స్ మాత్రం దీనిపై అప్పుడే అంచనాలు పెంచేసుకున్నారు. మామూలుగా మెగాస్టార్ సినిమా అంటే పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నిండిపోయి ఉంటుంది. కానీ ఈ ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే అలా అనిపించడం లేదు. ఈసారి చిరు ఏదో ప్రయోగాత్మకమైన చిత్రంలో నటిస్తున్నాడనే అనిపిస్తోంది.
రీమేక్ కాదని నమ్మకం..
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన తర్వాత మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత మెల్లగా ఆయన రీమేక్స్ చూసి ఫ్యాన్స్‌కు సైతం విసుగు వచ్చింది. తాజాగా తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కిన ‘భోళా శంకర్’ కూడా ఫ్లాప్‌గానే నిలిచింది. మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కనీసం కలెక్షన్స్ సాధించకపోగా.. మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్‌గా నిలిచింది. అందుకే తన తరువాతి సినిమా అయినా రీమేక్ కాకుండా ఉండాలని ఫ్యాన్స్ బలంగా కోరుకున్నారు. తాజాగా విడుదలయిన ప్రీ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది రీమేక్ అన్నట్టు ఏ మాత్రం అనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial