మెగాస్టార్ చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 155 సినిమాల్లో నటించిన చిరు.. ఈ క్రమంలో ఎన్నో హిట్లు ఫ్లాప్స్ అందుకున్నారు. అయితే ఆయన కెరీర్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో చిరంజీవి చేసిన పాత్రలు కూడా ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అలాంటి పాత్రలు చిరంజీవి మాత్రమే చేయగలరని, మరే హీరోను ఊహించుకోలేమని.. ఇప్పటికీ ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. నేడు 'బిగ్ బాస్' బర్త్ డే సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.


ఖైదీ (1983):
ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన యాక్షన్ మూవీ 'ఖైదీ'. ఇది 'ఫస్ట్ బ్లడ్' అనే అమెరికన్ చిత్రం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో చిరు సరసన మాధవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించడమే కాదు, చిరంజీవికి స్టార్‌డమ్‌ ని తెచ్చిపెట్టింది. యాక్షన్ హీరోగా నిలబెట్టింది. ఈ చిత్రం హిందీ, కన్నడ భాషల్లో అదే పేరుతో రీమేక్ చేయబడింది.


ఛాలెంజ్ (1984):
చిరంజీవి హీరోగా ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఛాలెంజ్'. ఇందులో విజయశాంతి, సుహాసిని హీరోయిన్లుగా నటించారు. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన 'డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు' అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఐదేళ్లలో ₹50 లక్షలు సంపాదిస్తానని బిజినెస్ మ్యాన్ తో ఛాలెంజ్ ఒక నిరుద్యోగ యువకుడి చుట్టూ కథ నడుస్తుంది. ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలవడమే కాదు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.


చంటబ్బాయ్ (1986):
జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిని జంటగా నటించిన కామెడీ డ్రామా 'చంటబ్బాయ్'. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి అదే పేరుతో రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పటి వరకూ యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన చిరంజీవి.. ప్రైవేట్ డిటెక్టివ్ గా ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో అదరగొట్టాడు. 1986 చిరు పుట్టినరోజుకి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.. కల్ట్ క్లాసిక్ హోదాను పొందింది. 


స్వయంకృషి (1987):
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'స్వయంకృషి'. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు చెప్పులు కుట్టే వ్యక్తిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన అభినయానికి ఉత్తమ నటుడుగా నంది అవార్డు వరించింది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అంతేకాదు రష్యన్ భాషలోకి డబ్ చేయబడి, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేయబడింది. ఈ మూవీ హిందీలో 'ధర్మయుధ్' గా డబ్ చేయబడింది.


రుద్రవీణ (1988):
కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో రూపొందిన మ్యూజికల్ డ్రామా 'రుద్రవీణ'. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ₹ 80 లక్షల బడ్జెట్‌తో నిర్మిస్తే, ₹ 60 లక్షల నష్టం వాటిల్లింది. అయితే ఇది తరువాత రోజుల్లో కల్ట్ హోదాను పొందింది. చిరు కెరీర్ లోని బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆయనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ చిత్రం నర్గీస్ దత్ జాతీయ సమగ్రత అవార్డుతో సహా, మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. 


కొండవీటి దొంగ (1990):
కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన యాక్షన్ మూవీ 'కొండవీటి దొంగ'. ఇందులో విజయశాంతి, రాధ హీరోయిన్లుగా నటించారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. ఓపెనింగ్ వీకెండ్ లో ₹ 7.4 మిలియన్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌తో 70 mm లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం. తమిళంలో 'తంగమలై తిరుడన్‌'గా, మలయాళంలో 'కొడనాడు కల్లన్‌'గా డబ్ చేయబడింది.


జగదేకవీరుడు అతిలోకసుందరి (1990):
చిరంజీవి, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. జంధ్యాల మరియు యండమూరి వీరేంద్రనాథ్‌ కలిసి స్క్రిప్ట్‌ అందించారు. 2 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ₹15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఫాంటసీ జానర్‌లో క్లాసిక్ ఫిల్మ్‌గా నిలచింది.


గ్యాంగ్ లీడర్ (1991):
చిరంజీవి, విజయశాంతి హీరోహీరోయిన్లుగా విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'గ్యాంగ్ లీడర్'. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. 70 మిలియన్లకు పైగా డిస్ట్రిబ్యూషన్ షేర్‌ తో అప్పటికి మెగాస్టార్ కెరీర్‌లో టాప్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా 50కి పైగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలానే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఆ తర్వాత అదే టైటిల్‌తో తమిళంలోకి, 'కుటుంబ' (2003) పేరుతో కన్నడలోకి డబ్ చేయబడింది. ఇక హిందీలో చిరుతోనే 'ఆజ్ కా గూండా రాజ్' ( 1992) గా రీమేక్ చేశారు. 'గ్యాంగ్ లీడర్' చిత్రాన్ని 4K క్వాలిటీతో 2023 మార్చి 4న రీ-రిలీజ్ చేశారు.


ఘరానా మొగుడు (1992):
చిరంజీవి - కె. రాఘవేంద్రరావు కాంబోలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ఘరానా మొగుడు'. ఇది 1986లో వచ్చిన 'అనురాగ అరళీతుకి' అనే కన్నడ చిత్రానికి రీమేక్. ఇందులో నగ్మా, వాణీ విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ₹ 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా.. ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు 1993 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. దీన్ని మలయాళంలో 'హే హీరో' పేరుతో డబ్ చేశారు. 


ఆపద్బాంధవుడు (1992):
కె విశ్వనాథ్ - చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'ఆపద్బాంధవుడు'. ఇందులో మీనాక్షి శేషాద్రి హీరోయిన్ గా నటించగా, జంధ్యాల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి గాను చిరు ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు AISFM ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఇది 'వీర మరుదు'గా తమిళంలోకి డబ్ చేయబడింది. 


ముఠామేస్త్రి (1993):
చిరంజీవి - డైరెక్టర్ కోదండరామి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం 'ముఠామేస్త్రి'. ఇందులో మీనా, రోజా హీరోయిన్లుగా నటించారు. భూపతి రాజా దీనికి కథ అందించగా, పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాదు, మెగాస్టార్ కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని తమిళంలో 'మంభూమిగు మేస్త్రీ' పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.


ఇంద్ర (2002):
బి. గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన యాక్షన్ డ్రామా 'ఇంద్ర'. ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ₹10 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా ₹30 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్ వసూలు చేసి, అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటికి సౌత్ లోనే హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. మొదటి వారంలోనే ₹20 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటుగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డు అందుకున్నారు.


ఠాగూర్ (2003):
మెగాస్టార్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ 'ఠాగూర్'. ఇందులో జ్యోతిక, శ్రియ శరణ్ హీరోయిన్లుగా నటించారు. ఇది 2002లో వచ్చిన 'రమణ' అనే తమిళ్ మూవీకి రీమేక్. ఇది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌లో ప్రదర్శించబడింది. పద్నాలుగు సంవత్సరాల తరువాత, 'గబ్బర్ షేర్ 2' గా హిందీలో డబ్ చేయబడింది.


ఖైదీ నెం.150 (2017):
చిరంజీవి కెరీర్ లో 150వ చిత్రమిది. ఒక దశాబ్దం తర్వాత ప్రధాన పాత్రలో నటించిన మెగాస్టార్.. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమిళ 'కత్తి' (2014) చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందించారు. తొలిరోజు ₹ 50.45 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో రూ. 164 కోట్లు కలెక్ట్ చేసింది. USAలో $2.45 మిలియన్లకు పైగా వసూలు చేసింది. 


వాల్తేరు వీరయ్య (2023):
బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ₹140 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద ₹225.70 కోట్లు వసూలు చేసింది.. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 'సైరా నరసింహా రెడ్డి' 'ఖైదీ నెం.150' తర్వాత యుఎస్ లో 2 మిలియన్ డాలర్ల మార్కును క్రాస్ చేసిన చిరు మూడవ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది.


Also Read: 60+ Heroes: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న షష్టిపూర్తి హీరోలు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial