Surya Narayana Temple Budagavi Uravakonda: సూర్య భగవానుడు సమస్త జీవకోటికి ప్రాణదాత.. సకల లోకాలకు వెలుగునిచ్చే దేవుడు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కొన్ని సూర్య దేవాలయాలు మాత్రమే మనకు దర్శనమిస్తుంటాయి. వాటిలో ఒకటి ఉరవకొండ మండలం బుధగవి గ్రామంలో ఉన్న ప్రత్యక్షనారాయణుడి ఆలయం.ఈ ఆలయాన్ని13వ దశాబ్దంలో బోధగవిలో చోళ మహారాజులు నిర్మించారాని చరిత్ర చెబుతోంది.
బ్రహ్మ,విష్ణు మహేశ్వరులైన రూపమైన సూర్య భగవానుడు నిలయమైన ఈ ఆలయం... చుట్టూ ఎత్తైన కొండలు, పర్వతాలతో ఎంతో ఆహ్లాదకరంగా భక్తులను ఆకర్షిస్తుంది. 13వ దశాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం లోపల పెద్ద పెద్ద బండరాళ్లతో బలమైన కట్టడాలతో దేవాలయం నిర్మించారు. ఆలయం గోపురం పై త్రిశూలాకారంలో ఉంటూ కాషాయ జెండా ఎగురుతూ ఉంటుంది. సూర్య భగవానుడు సూర్యోదయం, అస్తమించే సమయంలోనూ దేవాలయంపై పడుతున్న లేలేత కిరణాలు ఎంతగానో భక్తులను కనువిందు చేస్తుంటాయి. ఆలయం చుట్టూ విగ్నేశ్వరుడు, కార్తికేయ స్వామి ఇతర దేవుడి ప్రతిమలు భక్తులకు దర్శనమిస్తుంటాయి. ఆలయ ధ్వజస్తంభాన్ని దర్శించుకుని ఆలయంలోకి అడుగుపెట్టేముందు అతి పెద్ద రాతి కట్టడ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.
ప్రపంచంలో ఏ దేవుడైనా తూర్పు అభిముఖాన భక్తులకు దర్శనమిస్తుంటారు. మనదేశంలో కోణార్క్, అరసవెల్లి సూర్య దేవాలయాల్లో కూడా తూర్పు అభిముఖాన భక్తులకు సూర్యనారాయణ దర్శనమిస్తూ ఉంటాడు. బూదగవి దేవాలయంలో మాత్రం సూర్య భగవానుడు వింతగా దక్షిణ ముఖాన భక్తులకు దర్శనమిస్తున్నాడు. దక్షిణ అభిముఖాన దర్శనమిస్తున్న సూర్యనారాయణ స్వామి కి ఎదురుగా ఆంజనేయ స్వామి సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఆంజనేయస్వామి సూర్య భగవానుడికి ఎంతో ప్రియ శిష్యుడు. ఆంజనేయ స్వామి విగ్రహం రామాలయాల్లోనే చూస్తుంటారు ఎక్కువగా.. కానీ బూదగవి దేవాలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి సాష్టాంగ నమస్కారం తో ఉండే విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.
Also Read: రథసప్తమి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
సూర్యనారాయణడి గుడిలో ఎదురుగా పెద్ద లింగాకారంలో శివుడు దర్శనమిస్తాడు సూర్యనారాయణ దేవాలయంలోకి వెళ్లిన వెంటనే ముందుగా సూర్యభగవానుడిని భక్తులు దర్శించుకొని అనంతరం పరమేశ్వరుని దర్శించుకుంటారు. సూర్యనారాయణడి రెండు చేతులలో అటువైపు ఇటువైపు రెండు తామర పువ్వులు ఉంటాయి. స్వామికి ఇరువైపులా ఛాయాదేవి, ఉషాదేవి కొలువై ఉంటారు.
ప్రతి ఆదివారం స్వామివారికి క్షీరాభిషేకం, ఆకు పూజ సహా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దక్షిణ అభిముఖంలో ఉన్న సూర్య భగవానుడిని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం జరిగే రథసప్తమి వేడుకలకు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.
Also Read: దేవేంద్రుడు ప్రతిష్టించిన అరసవల్లి సూరీడు, రథసప్తమి వేడుకలకు పోటెత్తిన భక్తులు
13వ దశాబ్దంలో చోళ రాజులు ఆలయం నిర్మించిన ఈ ఆలయంలో మొదట శివుడు, రాముడు కొలువై ఉన్నారని భక్తులు విశ్వసించేవారు. గతంలో ఆర్కియాలజీ బృందం ఈ సూర్య దేవాలయాన్ని సందర్శించి ఆలయంలో ఉన్నది రాముడు కాదని సూర్య భగవానుడు అని కనుగొన్నారు. సూర్యనారాయణ చేతిలో రెండు తామర పూలు..భగవానుడి పక్కనున్నది ఛాయాదేవి, ఉషాదేవి అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బృందం తేల్చి చెప్పింది.