Sri Ramanujacharya Jayanti 2023: సంసారబంధం నుంచి విడివడేందుకు కావలసిన తత్త్వజ్ఞానాన్ని జీవులకు అందించేవారినే ‘ఆచార్యులు’ అంటారు. ఆచార్యుని స్థానం ఉన్నతమైనది. అందుకే భగవంతుడు సైతం ఆచార్యుడిగా ఉండేందుకు  ఇష్టపడ్డాడు.
 ‘లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం’
అంటూ దేవదేవుడినే తొలిగురువుగా మనం భావిస్తుంటాం. బ్రహ్మ సృష్టిలో మొదటివారైన సనకాదుల మొదలు అన్ని యుగాల్లోనూ విష్ణుభక్తులున్నారు. కలియుగం మొదలైన 43 రోజులకు ప్రభవించిన నమ్మాళ్వార్‌తో మొదలుపెట్టి ఎందరో గురువులు భూమ్మీద విష్ణుభక్తిని నెలకొల్పేందుకు, పెంచేందుకు పాటుపడ్డారు.  12 మంది ఆళ్వార్ల తర్వాత యామునాచార్యులు జగదేక గురువుగా నిలిచారు. సామాన్యశకం 1042లో తన శిష్యుని కలుసుకోకుండా పరమపదించిన యామునాచార్యుని వారసత్వాన్ని నిలబెట్టేందుకు వచ్చిన దివ్యావతారమే శ్రీరామానుజాచార్యులు.


రామానుజాచార్య హిందూమతానికి చెందిన భక్తి ఉద్యమకారులు, సిద్ధాంతకర్త. క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధి అయ్యారు. తమిళనాడులో శ్రీపెరంబుదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామిని పూజించారు


భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే


రామానుజులు కాంచీపురంలోనే పెరియనంబి వద్ద ద్రవిడ వేదాన్ని అభ్యసించారు. శ్రీశైలపూర్ణుల వద్ద దర్శన రహస్యాలు, వర రంగాచార్యుల వద్ద వైష్ణవ దివ్యప్రబంధాలను అనుసంధించారు. మాలాధనుల వద్ద భగవద్విషయం చెప్పుకొన్నారు. తిరుమంత్రార్థ రహస్యాన్ని తెలుసుకోవడానికి గోష్ఠీపూర్ణులను ఆశ్రయించి వారు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడ్డారు. చివరికి తిరుమంత్రార్థ రహస్యాన్ని వారివద్దనే గ్రహించారు.ప్రాణులు చేసే ధర్మబద్ధమైన పనులన్నీ భగవద్‌ ఆరాధనమేనని ఎలుగెత్తి చాటింది రామానుజుల సిద్ధాంతం. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని చాటిచెప్పిన రామానుజులు బోధనలతో సరిపెట్టలేద..ఆలయ సేవల్లో అన్ని వర్గాల్ని భాగస్వాముల్ని చేశారు. కొందరికి పల్లకీ మోసే సేవలు, మరికొందరికి వింజామరలు వీచే అదృష్టం, ఇంకొందరికి దివిటీలు పట్టే భాగ్యం ప్రసాదించారు. 


Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!


కులం కాదు గుణం గొప్పది


కులం కాదు గుణం గొప్పది.. గుణాన్నిమించిన యోగ్యత లేదన్నారు రామానుజాచార్యులు. ఆ మార్పులను ఛాందసవాదులు జీర్ణించుకోలేకపోయారు. శాస్త్రవిరుద్ధమన్నారు, అధర్మం అని మండిపడ్డారు. కానీ రామానుజులు ఆ విమర్శలేవీ పట్టించుకోలేదు.  సాక్షాత్తు భగవానుడే గీతలో తాను అందరివాడినని ప్రకటించినప్పుడు.. మనలో మనం ఇలాంటి బేధాలు సృష్టించుకోవడం సరికాదన్నారు. 


మహిళలకు మంత్ర యోగ్యత కల్పించిన రామానుజులు


మహిళల విషయంలోనూ రామానుజాచార్యులు తీసుకున్న నిర్ణయాలు అసామాన్యం.  స్త్రీ.. మాతృమూర్తిగా జగత్తుకే మాటలు నేర్పుతుంది. చదువుల తల్లి  సరస్వతి కూడా ఓ మహిళే.. అలాంటప్పుడు ఆ తల్లి...వేదం చదివితే అది అపవిత్రం అవుతుందా అని ప్రశ్నించారు. అయితే గియితే మరింత పవిత్రం కావాలిగానీ అపవిత్రం కానేకాదంటూ మహిళలకు మంత్ర యోగ్యత కల్పించి ఆధ్యాత్మిక సాధనకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే ఎంతోమంది మహిళలు పండిత చర్చల్లో పాల్గొన్నారు. ఆధ్యాత్మికోన్నతిని సాధించారు. 


సంస్కరణలు ఆలయాలనుంచే ఆరంభం కావాలి


సమాజంలో రావాల్సిన సంస్కరణలు తొలుత మతాలు, ఆలయాల నుంచే ఆరంభం కావాలని  ఆకాంక్షించారు విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటారు రామానుజాచార్యులు. అందుకే ఆలయాల్లోని అస్తవ్యస్త పరిస్థితులను, అక్రమాలను సరిదిద్దారు. ఆధ్యాత్మికత పేరుతో జరుగుతున్న ఆగడాలను అరికట్టారు. తన నిర్వహణలోని శ్రీరంగనాథ దేవాలయం నుంచే సంస్కరణలు ఆరంభించారు. మూఢాచారాలకు స్వస్తి పలికారు. కుల వివక్ష లేకుండా భగవంతుణ్ణి దర్శించుకునేలా, పెరుమాళ్ల ఉత్సవంలో అందరూ పాల్గొనేలా విధి విధానాలను సవరించారు. అలాగే తిరుమల ఆనందనిలయంలో వైఖానస ఆగమం ప్రకారం ఆచార వ్యవహారాలు, పూజాదికాలు రూపొందించింది కూడా రామానుజాచార్యులే! వారు నిర్దేశించిన ప్రకారమే శ్రీవారి ఉపచారాలు, ఉత్సవాలు నేటికీ నిర్వహిస్తున్నారు. అందుకే అన్నమాచార్యులు కూడా రామానుజాచార్యులను గురువుగా స్వీకరించారు.


Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!


ఆధ్యాత్మికవేత్తలకు స్ఫూర్తి ప్రదాత 


తన తర్వాత వచ్చిన ఆధ్యాత్మికవేత్తలకు రామానుజుడు స్ఫూర్తి ప్రదాత. అప్పటివరకూ ప్రపంచంలో ఉన్న మాయావాదాన్ని ఖండించారు. నువ్వు నిజం, నీ బతుకు నిజం, నీ అనుభవాలు నిజం, ఈ జగత్తు అంతా నిజం.. అని చాటిచెప్పారు. ఆ మూలాల ఆధారంగానే, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, ప్రభు పాదులు.. ఎవరికివారు తమతమ సిద్ధాంతాల్ని నిర్మించుకున్నారు. అలా భక్తి ఉద్య మానికి మూలపురుషులుగా నిలిచారు రామానుజాచార్యులు.