Sri krishna:  ప్రేమలేఖ..అదో వర్ణనాతీతమైన అనుభూతి. మనసైనవారిని తలుచుకుంటూ ఒక్కో అక్షరంలో ప్రేమ భావాన్ని వ్యక్తపరిచే భావన. అయితే లవ్ లెటర్స్ ట్రెండ్ కలియుగంలోనే మొదలైంది అనుకుంటే పొరపాటే గోపాలుడు ద్వాపరయుగంలోనే అందుకున్నాడు. సృష్టిలో తొలి ప్రేమలేఖ కూడా అదే కావడం విశేషం. 


కృష్ణుడికి తొలి ప్రేమలేఖ
కృష్ణుడి గురించి వింటూ వింటూ ప్రేమలో పడిపోయింది రుక్మిణి. విదర్భ రాజు భీష్మకుడి కుమార్తె రుక్మిణి. అందంలోనూ, గుణంలోనూ తనకు తానే సాటి.  ఓ రోజు తన మనసులో మాటను తండ్రికి తెలియజేసింది. తండ్రి అంగీకరించాడు కానీ  ఆమె సోదరుడైన రుక్మికి ఇష్టంలేదు. ఎందుకంటే తన సోదరిని శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానని అప్పటికే ప్రకటించాడు. సోదరుడి పట్టుదల చూసిన రుక్మిణికి ఏం చేయాల అర్థంకాలేదు. శిశిపాలుడితో పెళ్లి ఇష్టంలేదు - మనసులోంచి శ్రీకృష్ణుడిని చెరిపేసుకోలేదు. అందుకే పెళ్లికి ముందు రోజు శ్రీకృష్ణుడికి లేఖ రాసిన రుక్మిణి తన అంతరంగాన్ని తెలియజేసింది. 


ప్రేమలేఖలో ఏం ఉందంటే
రుక్మిణి రాసిన ప్రేమలేఖలో ఏముందంటే..."ఓ కృష్ణా మీ సౌందర్యం గురించి విన్నాను. మీ పేరు వింటే దు:ఖం నశించి, మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. నా మనసులో నిరంతరం మీ ధ్యాసే, అందం, జ్ఞానం, యవ్వనం సంపదలో మీకు మీరే సాటి. మిమ్మల్ని నమ్ముకున్న వారి మనసులు సంతోషంగా ఉంటాయి. యుక్తవయసుకు వచ్చిన అమ్మాయి శ్రేష్ఠమైన, మంచి మనసున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటుంది. ఓ దేవా ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీరే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నాకు నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మీ భార్యగా స్వీకరించండి". ఇదీ లేఖ సారాంశం. 


Also Read: కృష్ణుడికి 8 మంది భార్యల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా!


రుక్మిణిని ఎత్తుకొచ్చి పెళ్లిచేసుకున్న కృష్ణుడు
తనపై అంతులేని ప్రేమను లేఖద్వారా వ్యక్తిపరిచిన రుక్మిణి గురించి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాడు కృష్ణుడు. వెంటనే తన పరివారంతో కలసి విదర్భ చేరుకుని రుక్మిని ఓడించాడు. సుముహూర్తానికి ముందు గౌరీదేవి ఆలయానికి వచ్చి గౌరీపూజ చేసి బయటకి వచ్చిన రుక్మిణిని... అప్పటికే రథంతో తయారుగా ఉన్న కృష్ణుడు అందరూ చూస్తుండగానే చేయందించి..ఆమెను రథమ్మీదకి ఎక్కించుకుంటాడు. ఇది రుక్మిణీ కళ్యాణానికి పతాక సన్నివేశం.


Also Read: 'భారత్' అనే పేరు ఎలా వచ్చింది - మన దేశానికి అసలు పేరు ఏంటి!


ఓ యువతి తాను ప్రేమించినవాడిని పొందడం కోసం, వ్యతిరేక పరిస్థితులను అధిగమించి ప్రయత్నాలు సాగించి సఫలీకృతురాలు కావడం... ఆ ప్రేమను పొందిన యువకుడు ఏదోలే అని కొట్టిపారేయకుండా, నిర్దిష్టమైన ప్రణాళికతో అందరి ముందూ ఆమెను తన రథమ్మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోవడం...ఇంతకు మించిన ప్రేమకథ ఉంటుందా. ప్రేమను గెలిపించుకునేందుకు రుక్మిణి పడిన తాపత్రయాన్ని ఇలా వివరించాడు బమ్మెర పోతన....


వలచిన శ్రీకృష్ణుడి కోసం రుక్మిణి ఆరాటం ఇది (పోతన భాగవతంలోని పద్యాలు)


ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని జన్మమేల యెన్ని జన్మములకు?


భావము: శ్రీకృష్ణా! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ. పురుషోత్తమా నీవు భోగించని అందమెందుకు దండగ. ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ. ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండగ. పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ. ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగ జన్మ ఎందుకు...నాకు వద్దు.”


లగ్నం బెల్లి వివాహముం గదిసె నేలా రాఁడు గోవిందుఁ? డు
ద్విగ్నం బయ్యెడి మానసంబు వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం
డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో?
భగ్నంబై చనునో? విరించికృత మెబ్బంగిం బ్రవర్తించునో?


భావము: సుముహర్తమేమో రేపే. పెళ్ళిముహుర్తం దగ్గరకి వచ్చేసింది. శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు ఎంచేతో ఏంటో? నా మనస్సు ఆందోళన చెందుతోంది. ఆయన విషయం విన్నాడో లేదో మరి? అసలు నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో? బ్రహ్మ దేవుడు ఏం రాసిపెట్టి ఉన్నాడో ఏంటో?


ప్రపంచం లోనే తొలి ప్రేమలేఖగా విశ్లేషకులు భావించే రుక్మిణి ‘ప్రేమలేఖ’లో ముఖ్యమైన పద్యం ఇది. ఇందులో తనను శ్రీ కృష్ణుడు ఎలా చేపట్టాలో వివరిస్తోంది రుక్మిణి


అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా
వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్.


భావము: పంకజనాభుడవూ, పురుషశ్రేష్ఠుడవూ అయిన ఓ కృష్ణా! నీవు అడ్డు చెప్పేందుకు కారణమేమీ లేదు. రథ, గజ, తురగ, పదాతి చతురంగబలములతో నీవు విచ్చేసి, శిశుపాల జరాసంధులను జయించి, నా వద్దకు వచ్చి, క్షత్రియోచితమైన రాక్షసవివాహ పద్ధతిలో నన్ను పరిగ్రహించి తీసికొని వెళ్ళు. నేను నీ వెంట వస్తాను.