ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు విజయం లభించింది. ఆదివారం భారత్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్‌కు పాకిస్తాన్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాకిస్తాన్ 39.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పాకిస్తాన్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (78: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్: 79 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అజేయంగా అర్థ సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (64: 87 బంతుల్లో, ఐదు ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (53: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
ఆడుతూ... పాడుతూ...
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు నెమ్మదిగా అయినా సరే కుదురైన ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్ (20: 31 బంతుల్లో, మూడు ఫోర్లు), ఇమామ్ ఉల్ హక్ (78: 84 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. ఈ దశలో ఫఖర్ జమాన్‌ను అవుట్ చేసి షోరిఫుల్ ఇస్లామ్ బంగ్లాకు మొదటి వికెట్ అందించాడు. అనంతరం ఇమామ్ ఉల్ హక్‌కు బాబర్ ఆజం (17: 22 బంతుల్లో, ఒక ఫోర్) జత కలిశాడు. వీరు రెండో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. బాబర్ ఆజమ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి టస్కిన్ అహ్మద్ రెండో వికెట్ పడగొట్టాడు.
మహ్మద్ రిజ్వాన్ (63 నాటౌట్: 79 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 85 పరుగులు జోడించారు. కానీ లక్ష్యానికి 40 పరుగుల దూరంలో ఇమామ్ ఉల్ హక్ అవుటయ్యారు. కానీ మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్ (12 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్) పాకిస్తాన్‌ను విజయ తీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, మెహదీ హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
పాక్‌కు పేసే బలం
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయాలని అనుకుంది మెరుగైన టార్గెట్ ఇచ్చి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని భావించింది. కానీ వారి వ్యూహాన్ని పాక్ పేసర్లు పటా పంచలు చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ అల్లాడించారు. పరుగుల ఖాతా తెరవకముందే మెహదీ హసన్ మిరాజ్ (0: 1 బంతి)ను నసీమ్ షా ఔట్ చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ నయీమ్ (20: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లిటన్ దాస్ (16: 13 బంతుల్లో, నాలుగు ఫోర్లు) నిలకడగా ఆడారు. క్రీజులో కుదురుకున్నారులే అనుకుంటుండగానే వీరిద్దరినీ పాక్ పెవిలియన్ పంపించింది. జట్టు స్కోరు 31 వద్ద లిటన్‌ను అఫ్రిది, 45 వద్ద నయీమ్, 47 వద్ద హృదయ్ (2: 9 బంతుల్లో)ను హ్యారిస్ రౌఫ్ ఔట్ చేశాడు.
పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాను కెప్టెన్ షకీబ్ (53: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు), సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (64: 87 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూనే పరుగులు రాబట్టారు. సింగిల్స్, డబుల్స్ తీశారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపించారు. ఐదో వికెట్‌కు 120 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. షకిబ్ 53 బంతుల్లో, ముషి 71 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. వీరిద్దరూ బంగ్లా స్కోరు బోర్డు పరుగెత్తించే దశలో ఫమీమ్ అఫ్రామ్ షాకిచ్చాడు. జట్టు స్కోరు 147 వద్ద షకిబ్‌ను పెవిలియన్ పంపించాడు. మరికాసేపటికే షామిమ్ హుస్సేన్ (16: 23 బంతుల్లో, ఒక సిక్సర్) ఔటయ్యాడు. 190 వద్ద ముషిని రౌఫ్ ఔట్ చేయడంతో బంగ్లా టైగర్స్ పని ముగిసింది. మిగతా టెయిలెండర్లు వరుసగా ఔటవ్వడంతో స్కోరు 193కు చేరుకుంది.