ఈనెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన శ్రావణమాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం....ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసం అంటే శ్రీమహావిష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.
శ్రావణ, భాద్రపద మాసాలు వర్షరుతువుకి సంబంధించినవి. పంచభూతాల్లో ఏ మార్పులు వచ్చినా శరీరంపై ప్రభావం ఉంటుంది. విస్తారంగా వర్షాలు కురిసే సమయం కావడంతో శరీరానికి జల సంబంధమైన వ్యాధులొస్తాయి. పంచ భూతాల ప్రకోపం కారణంగా శరీరంపై పడిన ప్రభావం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అందుకే ముఖానికి, పాదాలకు పసుపు రాసుకోవడం ద్వారా కొంత అనారోగ్యాన్ని పారద్రోలొచ్చు. కుంకుడుకాయతో తలరుద్దుకుంటే ఆరోగ్యానికి చాలామంచిదంటారు పెద్దలు. మరీ ముఖ్యంగా ఈ నెలలో కనీసం రెండుసార్లు నదీ స్నానం చేయాలంటారు. వర్షాల కారణంగా నదులన్నీ ఒండ్రుమట్టి, ఇసుక, వివిధ రకాల ఔషధ గుణాలున్న ఆకులతో ప్రవహిస్తాయి. ఈ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయంటారు.
ఇక పూజల విషయానికొస్తే శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్నీ పవిత్రమైన వారాలే.
శ్రావణ సోమవారాలు :
ఈ మాసంలో వచ్చే సోమవారాలు దాదాపు అందరూ ఉపవాసాలు ఉంటారు. శివుడికి అభిషేకం చేయడం, పార్వతికి కుంకుమ పూజ చేయడం చేస్తారు.
శ్రావణ మంగళవారాలు :
పార్వతి దేవికి మరొక పేరు మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని విశ్వాసం. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. తమ మాంగళ్యాన్ని కాపాడమని కోరుతూ మంగళగౌరికి పూజ చేసి ముత్తైదువులకు శనగలు వాయనం ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లికాని ఆడపిల్లలతో కూడా శ్రావణ మంగళవారం పూజలు చేయిస్తారు.
శ్రావణ శుక్రవారం:
శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందం... వంటివాటిని చిహ్నం. ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడు. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం అమ్మవారిని కొలుచుకుంటే అమ్మవారి అనుగ్రహం, గ్రహాల అనుకూలతా సిద్ధిస్తాయి. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణమాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో... ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునేవారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ చేసుకుంటారు. అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావిస్తారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజిస్తారు. ఏదైనా కారణంతో పౌర్ణమి ముందు శుక్రవారం పూజ కుదరదు అనుకుంటే శ్రావణమాసంలో ఏ శుక్రవారం అయినా పూజ నిర్వహించొచ్చు. ఈ వ్రతవిధానాన్ని సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే, పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
శ్రావణ శనివారాలు : ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పు ని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసం లో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం. శనివారంరోజు స్వామికి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించి…పిండి దీపాలతో ఆరాధించడ, ఉపవాసం ఉండటం చేస్తే విశేష ఫలితాలను పొందుతామని విశ్వాసం.
‘ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:
తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం’
అంటూ రక్షకోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురు నిలిచాడు. అలాంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ సోదరుడు ఆశీర్వదిస్తాడు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు.
సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు శ్రావణ పూర్ణిమ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోపవీతం పేరుతో పిలుస్తారు. అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం. పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు.
ఇలా శ్రావణమాసంలో వచ్చే ప్రతీ రోజు విశేషమైనదిగానే చెప్పుకోవచ్చు. ఈ శ్రావణమాసం శివకేశవులకు అభేదం లేదు అని తెలియజేస్తుంది. ప్రతీ ఇల్లు, గుడి, గోపురం అన్నీ భక్తులతో కళకళలాడుతుంటాయి. ఇంత విశేషమైన శ్రావణమాసం మీ అందరకీ శుభాన్నివ్వాలని కోరుకుంటోంది మీ ఏబీపీ దేశం…..... శ్రీమాత్రేనమః.