భారతీయ సంస్కృతి లో వృక్షాలకి ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలకి ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక ఉంది. ప్రతి నక్షత్రానికి అధిదేవతలు వేర్వేరుగా ఉంటారు. అధిదేవతలతో పాటూ ఆయా నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. మీకు అవకాశం ఉంటే..మీ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని ఇంటి ఆవరణలో పెంచితే ఆరోగ్యం బావుండడంతో పాటూ ఆర్థికంగా బలపడతారంటారు.
నక్షత్రం పెంచాల్సిన వృక్షం
అశ్విని - జీడి మామిడి
భరణి - ఉసిరి
కృత్తిక - అత్తి
రోహిణి - నేరేడు
మృగశిర - మారేడు/ చండ్ర
ఆరుద్ర - చింతచెట్టు/ వనచండ్ర
పునర్వసు - వెదురు
పుష్యమి - రావి
ఆశ్లేష - నాగకేసరం/సంపంగి
మఖ - మర్రి
పుబ్బ - మోదుగ
ఉత్తర - జువ్వి
హస్త - అంబాళము/ కుంకుడు
చిత్త - మారేడు/తాడి
విశాఖ - మొగలి/వెలగ
అనూరాధ - పొగడ
జ్యేష్ట - నిరుద్ధి/విష్టి
మూల - వేగి
పూర్వాషాడ - పనస/నిమ్మ
ఉత్తరాషాడ - పనస
శ్రవణం - జిల్లేడు
ధనిష్ఠ - జమ్మి
శతభిషం - కానుగ
పూర్వాభాద్ర - వేప/మామిడి
ఉత్తరాభాద్ర - వేప
రేవతి - విప్పచెట్టు
కొన్ని వృక్షాలని ఇంటి ఆవరణలో పెంచడం కుదరదు కాబట్టి ఆయా వృక్షాల దగ్గరకు వెళ్లి నీరు పోయడం, నమస్కరించి రావడం చేయొచ్చు. వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు పెంచాల్సిన మొక్కను ఇంటి ఆవరణలో నాటడమే కాదు.. ఆయా నక్షత్రాల వారికి చెందిన మొక్కలను బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.
ఇంటి ఆవరణలో ఉండాల్సిన చెట్లు
అయితే ఏ చెట్లు ఎటువైపు ఉండాలన్నది కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టు ఉంటే ఆర్థికంగా కలిసొస్తుందట. ముఖ్యంగా కొబ్బరి చెట్టు తూర్పు, ఈశాన్యం వైపు ఉంటే మంచిది. తూర్పు దిక్కున మామిడి చెట్టు కనుక ఉంటే ఆ ఇంటి వారికి సంపద పెరుగుతుందని చెబుతారు. మిగిలిన దిక్కుల్లో ఉన్న ఎలాంటి నష్టం జరగదు. ఇంకా పనస, మారేడు,నిమ్మ, రేగు వంటి చెట్లు తూర్పు దిక్కున ఉంటే ఉత్తమ సంతానం, ఇతర దిక్కుల్లో ఉంటే ధనం వృద్ధి చెందుతుందట. దానిమ్మ,అల్లనేరేడు, అరటి చెట్లు తూర్పు దిక్కులో ఉంటే ఆ ఇంట నివాసం ఉండేవారికి బంధుమిత్రులతో మంచి సఖ్యత ఉంటుంది. సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కున ఉన్న మంచిదే. గుమ్మడి, సొర,మోదుగ, దోస, వంటివి కూడా ఇంటి ఆవరణ ఎక్కడ ఉన్నా కూడా మంగళప్రదమే అంటారు వాస్తు పండితులు. పండ్ల మొక్కలు, తీగలు ఏ ప్రదేశం అయినా ఉండొచ్చు. అశోక, శిరీషం, కదంబ వృక్షాలు శుభప్రదం అయిన చెట్లు అని చెబుతారు.
ఇంటి ఆవరణలో ఉండకూడని చెట్లు
ఇంటి ఆవరణలో పాలు కారే వృక్షాలు ఉండరాదు. వినాయకుడిని పూజించటానికి తెల్ల జిల్లేడు శ్రేష్ఠం అనే భావనతో ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుతున్నారు కానీ ఇవి ఉండకూడదంటారు వాస్తు పండితులు. ఇంకా గృహ ఆవరణలో ముళ్ల చెట్లు కూడా పెంచకూడదు..
వాస్తు నిపుణులు చెప్పిన విషయాలు, కొన్ని బుక్స్ నుంచి సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...