టీమ్‌ఇండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఉపఖండం పిచ్‌లపై బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ పంపించడం అద్భుతమన్నాడు. రిషభ్ పంత్‌ను ఓపెనింగ్‌కు దించడం వెనక వ్యూహాన్ని హిట్‌మ్యాన్ వివరించాడు. రాహుల్, సూర్యకుమార్ పరిణతి అద్భుతమని పొగడ్తలు కురిపించాడు. విండీస్‌పై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.
'సుదీర్ఘకాలంగా భారత గడ్డపై ఒక ఫాస్ట్‌బౌలర్ నుంచి ఇలాంటి స్పెల్‌ను నేను చూడలేదు. ఉపఖండం పిచ్‌లు, పరిస్థితుల్లో ప్రత్యర్థి బ్యాటర్లను బౌన్స్‌తో దెబ్బతీయడం సులభం కాదు. దానిని ప్రసిద్ధ్ కృష్ణ సాధ్యం చేశాడు. మొతేరాలో మంచు కురవకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రసిద్ధ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మిగతావారు అతడికి సహకరించారు. జట్టులో ఐదుగురు బౌలర్లకు తోడుగా దీపక్ హుడా బౌలింగ్ చేయడం బాగుంది. ఆరో ఆప్షన్ ఉండటంతో అందరినీ రొటేట్ చేశాను' అని రోహిత్ అన్నాడు.
'ఈ సిరీస్ గెలవడం చాలా బాగుంది. కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ మధ్య భాగస్వామ్యంలో పరిణతి కనిపించింది. దాంతోనే చివర్లో మాకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. దాంతో మేం పోరాడగలమని తెలుసు. మా బౌలింగ్ విభాగం మొత్తం కసిగా బంతులు వేసింది. ఇలాంటి కఠిన పరిస్థితులు, ఒత్తిడిలో ఆడితేనే ఆట మెరుగవుతుంది. సూర్య సమయం తీసుకొని తన నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అర్థం చేసుకున్నాడు. కేఎల్ నిలకడగా ఆడాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడొచ్చినా అతడు పరుగులు చేస్తూనే ఉంటాడు' అని హిట్‌మ్యాన్ చెప్పాడు.
రిషభ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించడం గురించి రోహిత్ వివరించాడు. జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేయాలని తనను కోరిందని చెప్పాడు. కొత్తగా ఉంటుందనే పంత్‌తో ఓపెనింగ్ చేయించామన్నాడు. మొత్తంగా అతడితో ఓపెనింగ్ చేయించబోమని, ఒక్క మ్యాచ్ వరకే పరిమితం అన్నాడు. వచ్చే మ్యాచ్‌కు శిఖర్ ధావన్ అందుబాటులోకి వస్తాడని వివరించాడు. ప్రయోగాలు చేస్తూ కొన్ని మ్యాచుల్లో ఓటమి పాలైన ఫర్వాలేదని పేర్కొన్నాడు. దీర్ఘకాల లక్ష్యాలు నెరవేరాలంటే ప్రయోగాలు చేయక తప్పదని వెల్లడించాడు.
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ రోహిత్ సేన 2-0తో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 235 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది.