పసుపు, ఆకుపచ్చ మిళితమైన రంగులో నిగనిగలాడుతుంది స్టార్ ఫ్రూట్. మిగతా పండ్లలాగా చూడగానే నోరూరించదు, అందుకేనేమో దాన్ని తినేవారి సంఖ్య తక్కువ. మన దగ్గర ఈ పండ్లు అంత ఎక్కువగా కూడా పండవు. కానీ ఈ పండ్ల వల్ల ఆరోగ్యప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు. చాలా ఆరోగ్యసమస్యలకు చెక్ పెట్టగల సత్తా ఈ పండుకుంది. కాబట్టి దీన్ని కూడా మన ఆహారమెనూలో చేర్చుకోవాల్సింది. ఈ పండును అడ్డంగా ముక్కలుగా కోస్తే వాటి ఆకారం స్టార్స్‌లా ఉంటుంది. అందుకే వీటిని ‘స్టార్ ఫ్రూట్స్’ అంటారు.


విటమిన్ సి
రోగనిరోధక శక్తి పెరిగేందుకు విటమిన్ సి అవసరం. ఈ విటమిన్ పుష్కలంగా ఉన్న పండు స్టార్ ఫ్రూట్. దీన్ని తినడం వల్ల శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌తో పోరాడే శక్తి రోగనిరోధక వ్యవస్థకు వస్తుంది. 


బరువు తగ్గేందుకు
అధిక బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఈ పండును తినవచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. మహిళలకు రోజుకు 25 గ్రాముల ఫైబర్ అవసరం. స్టార్ ఫ్రూట్ ఒక్కటి తింటే 2.8 గ్రాముల ఫైబర్ వచ్చేస్తుంది.  మిగతా ఆహారం ద్వారా మిగిలిన ఫైబర్ కూడా అందుతుంది. 


డయాబెటిస్ ఉన్నవారు
కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు... ఈ మూడు ఇందులో తక్కువే. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ పండ్లు తినవచ్చు. తక్కువ కేలరీలుండే ఆహార ఎంపికలో ఇది ముందుంటుంది. 


రక్తహీనతకు చెక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలలో రక్త హీనత సమస్య కనిపిస్తోంది. శరీరంలో ఇనుము తక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. స్టార్‌ఫ్రూట్ ఇనుము పుష్కలంగా ఉంటుంది.  కాబట్టి రక్త హీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. 


యాంటీ బ్యాక్టిరియల్...
స్టార్ ఫ్రూట్‌లో హానికర సూక్ష్మజీవులను తట్టుకునే యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. స్టార్ ఫ్రూట్‌లో ఉన్న ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, సపోనిన్లు, స్టెరాయిడ్స్, ఫైటో కెమికల్స్ వల్లే దీనికి యాంటీ బ్యాక్టిరియిల్ లక్షణాలు వచ్చాయి. పండిన స్టార్ ఫ్రూట్ తో పోలిస్తే, ఆకుపచ్చగా ఉన్న పండులోనే అధికగా నిరోధక శక్తి ఉంటుంది. 


ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తాయి
క్వెర్సటిన్, ఎపికాటెచిన్, గల్లిక్ యాసిడ్ వంటి ఫ్లేవనాయిడ్లు శరీరంలోని ఇన్‌ఫ్లమ్మేషన్‌ను తగ్గిస్తాయి. ఈ పండు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకుంటాయి.  


నిద్రలేమికి చెక్
ఈ పండులో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. నిద్ర ప్రోత్సహించే ఖనిజం ఇది. ప్రతి 100 గ్రాముల పండులో 10 గ్రాముల మెగ్నిషియం లభిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి స్టార్ ఫ్రూట్ మేలు చేస్తుంది. 


గుండెకు మేలు
స్టార్ ఫ్రూట్ గుండెకు ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు తేల్చాయి. హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారికి కూడా ఇది చాలా మంచిది. స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఇందులో ఉన్న కాల్షియం రక్తనాళాలు మరియు ధమనులపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా అథెరోస్క్లెరోసిస్, గుండెపోటు, స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


క్యాన్సర్...
స్టార్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. జీవక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అంతేకాదు లివర్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also Read: మొక్కలతో మాంసం తయారీ, రుచిగా ఉంటుందా? వేటితో తయారుచేస్తారు?


Also Read: హ్యాపీ టెడ్డీ డే... ఏ రంగు టెడ్డీ బేర్‌ ఏ భావాన్ని సూచిస్తుంది?