Vibhuti Significance in Telugu : విభూతి అంటే విశేషమైనది అని అర్థం. హోమ ద్రవ్యాలైన దర్భలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరికాయ , మోదుగ, రావి, తులసి సహా కట్టెలు, ఆవు పేడతో చేసిన పిడకలు, నవధాన్యాలు నెయ్యి మొదలైనవి వేసి హోమం చేయగా చివరకు  మిగిలిన బూడిదను విభూతి అంటారు. అగ్నికి దహించే గుణం ఉంటుంది. హోమద్రవ్యాలైన కొబ్బరికాయ, కట్టెలు, పిడకలు, నవధాన్యాలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంటుంది. ఈ రెండింటి కలయికవల్ల ఏర్పడిన విభూతి దహించదు, దహనమవదు. ఇలా నిర్గుణత్వాన్ని ప్రతీకగా మారే విభూతిని పరమేశ్వరుడి భక్తులు ధరిస్తారు.
 
విభూతి ధరించేటెప్పుడు ఈ శ్లోకం పఠించాలి


శ్రీకారం చ పవిత్రం చ శోక రోగ నివారణం
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రైలోక్య పావనం


కుడిచేతి మధ్యవేలు, ఉంగరపు వేళ్ళ సాయంతో విభూతిని ధరించాలి. నుదుటిపై ఎడమవైపు నుంచి కుడివైపుకు రేఖలను దిద్దాలి. అప్పుడు బొటనవేలితో విభూతి రేఖలపై కుడివైపు నుంచి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం.  నుదిటిపై కనుబొమ్మలు దాటి గాని కనుబొమ్మల క్రిందికిగాని విభూతి ధరించకూడదు.


Also Read: ఊహించని ఖర్చులు, అనుకోని ఇబ్బందులు- ఈ 6 రాశులవారికి ఈ వారం సవాలే!


ఎప్పుడెప్పుడు ధరించాలి


విభూతిధారణ శుభకార్యాలు నిర్వహించేటప్పుడు, నిత్య పూజ చేసే సమయంలో, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించేటప్పుడు, హోమాలు చేసే సమయం లోనూ ధరించడం వల్ల అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 


సుమంగళి విభూతి ధరించవచ్చా?


విభూతి ధరించేటప్పుడు జాగ్రత్త...ఎందుకంటే నేలపై పడకూడదని చెబుతారు. ఒకవేళ పడితే, వస్త్రంతో తీయాలి కానీ, చీపురు తో ఊడ్చరాదు. పురుషులు విభూతిని స్త్రీల చేతికి ఇవ్వరాదు. పురుషులు, సుమంగళులైన స్త్రీలు విభూతిని తడిపి పెట్టుకోవాలి. పూర్వ సువాసినులు పొడి విభూతిని ధరించాలి. విభూతిని మధ్య వేలు లేదా ఉంగరము వేలుతో పెట్టుకోవాలి . చూపుడు వేలుతో పెట్టుకోరాదు.


Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు - డిసెంబరు 10 నుంచి 16 వారఫలాలు!


బ్రహ్మరాతను చెరిపేసే శక్తి విభూతి సొంతం


బ్రహ్మ రాసిన రాత చెరిగిపోదని విశ్వసిస్తారు..అయితే ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. స్కాంద పురాణంలో విభూతి ధరించిన వ్యక్తిని ముట్టుకున్నందుకే ఒక బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనమైంది. విభూతికి ఉన్న శక్తి అంత మహిమాన్వితం.


అఘోరాలు ధరించేది ఇదే!


విభూతి ఐదు రకాల వర్ణాల్లో ఉంటుంది
భస్మం – శ్వేత వర్ణము
విభూతి – కపిలవర్ణము
భసితము -కృష్ణవర్ణము
క్షారము – ఆకాశవర్ణము
రక్షయని – రక్తవర్ణము
వీటిలో కాపాలికులు, అఘోరాలు ధరించేది చితాభస్మం. గృహస్థులు యోగులు ధరించేది హోమ భస్మం.


Also Read: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!


ఆరోగ్యానికి విభూతి


ఏ వస్తువు లేదా పదార్ధాన్ని అయినా కాలిస్తే బూడిదగా మారుతుంది. కానీ బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుని ఆరాధిస్తున్నాం అని అర్థం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలి పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం.


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం