Couple Murder For not Repaying Loan in Film Nagar: హైదరాబాద్ ఫిలింనగర్ లో శనివారం దారుణం వెలుగుచూసింది. తీసుకున్న అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తి మరో ఇద్దరు నిందితులతో కలిసి దంపతులను దారుణంగా హతమార్చాడు. తొలుత భర్తే భార్యను చంపి పరారైనట్లు అనుమానించిన పోలీసులు సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా అసలు నిందితులను గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఇదీ జరిగింది


హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను అజ్ఘర్ పాషా పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు నదీం కాలనీలో నివాసం ఉంటూ గొర్రెల పెంపకం, విక్రయం చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ద్వారా జుబేర్ ఖాద్రీతో అజ్ఘర్ కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి, వ్యాపార భాగస్వామ్యానికి నాంది పడింది. జుబేర్ ఫామ్ హౌస్ లో గొర్రెలు, మేకలు పెంచేందుకు అజ్ఘర్ విడతల వారీగా రూ.20 లక్షలకు పైగా చెల్లించాడు. అయితే, లాభాలు రాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలని అజ్ఘర్ కోరగా, జుబేర్ దాటవేస్తూ వచ్చాడు. దీంతో కక్ష పెంచుకున్న అజ్ఘర్, జుబేర్ హత్యకు కుట్ర పన్నాడు. ముంబైలోని తన స్నేహితుడు సల్మాన్ తో పాటు మణికొండకు చెందిన సమీర్ సాయంతో జుబేర్ ను నవంబర్ 28న హతమార్చాడు. బిర్యానీ తిందామని చెప్పి జుబేర్ ను ఫామ్ హౌజ్ కు పిలిపించి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ముగ్గురూ కలిసి సమీపంలోని చెరువు పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సత్య కాలనీలోని ఇంట్లో నగదు దాచి ఉండొచ్చనే అనుమానంతో అజ్ఘర్, అతని స్నేహితులు జుబేర్ ఇంటికి వెళ్లారు. అయితే, వారికి అక్కడ ఏమీ దొరకలేదు. రాత్రి వరకూ ఇంట్లోనే వేచి ఉండగా జుబేర్ భార్య ఫాతిమా అక్కడికి వచ్చింది. దీంతో ఆమెను కూడా గొంతు నులిమి చంపేసి ఫ్యాన్ కు చున్నీతో ఉరేశారు. ఆమె ఒంటిపై ఉన్న 9 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆ ఇంటికి వచ్చిన ఫాతిమా సోదరి, మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణలో అసలు నిజాలు వెలికితీశారు.


200 సీసీ కెమెరాల పరిశీలన


ఫాతిమా మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అది హత్యగా అనుమానించారు. మృతురాలి భర్త ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండడం, అతని హెల్మెట్, ఇతర వస్తువులు లభించగా భర్తే హత్య చేసి పరారైనట్లు తొలుత భావించారు. ఫాతిమా మృతదేహానికి పోస్టుమార్ట్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నవంబర్ 29న ఆ ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు ఎవరనే విషయం తెలుసుకునేందుకు 200 సీసీ కెమెరాలు పరిశీలించినట్లు ఫిలింనగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. అందులో ఓ వ్యక్తిని మణికొండకు చెందిన సమీర్ గా గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఫాతిమాను చంపింది భర్త కాదని ముంబయికి చెందిన అజ్ఘర్ పాషా అని గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.


Also Read: Accident: బైకును ఢీ కొన్న లారీ, మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం