రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలు అంటాం. ఇతి హాస: అంటే ఇది నిజం అని అర్థం. పరిపూర్ణమైన వ్యక్తి ఎలా జీవించాలో చెప్పేది రామాయణం, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి  సమాధానం చెప్పేది మహాభారతం.


ధర్మార్ధ కామ మోక్షాణాముపదేశ సమన్వితం
పూర్వావృత్త కథాయుక్త మితిహాసం ప్రచక్ష్యతే


ధర్మ,అర్ధ,కామ,మోక్షాలు అనే చతుర్విధ పురుషార్ధాలు, ఉపదేశాలు, పూర్వవృత్తాంత కథలతో కూడినది ఇతిహాసము


ఏక శ్లోక రామాయణం
పూర్వం రామ తపోవన గమనం, హత్వా మృగం కాంచనం,
వైదేహీ హరణం,జటాయు మరణం.సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం,సముద్ర తరణం, లంకాపురీ దాహనం
పశ్చా ద్రావణ కుంభకర్ణ నిధనం యేతద్ది రామాయణం


పూర్వము రాముడు అడవులకు వెళ్ళడం, బంగారు లేడిని హతమార్చడం, సీతాదేవి అపహరణకు గురవడం,  జటాయువు మరణించడం, సుగ్రీవునితో స్నేహం చేయడము,వాలిని చంపడము,సముద్రము దాటడము,లంకా దహనము,తరువాత రావణ కుంభకర్ణులను చంపడము.ఇదీ సూక్ష్మముగా ఒకే ఒక్క శ్లోకము లో రామాయణ గాథ. ,


Also Read: శివాలయంలో ఉండే నవగ్రహాలకే పవర్ ఎక్కువ ఉంటుందా


ఏక శ్లోక భారతం
ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షా గృహే దాహనం
ద్యూతే శ్రీ హరణం వనే విహరణం మత్స్యాలయే వర్ధనం
శ్రీ మద్గోగ్రహణి రణే విహరణం సంధిక్రియాలంబనం
పశ్చాద్భీష్మ సుయోధనాది హననం యేతన్మహా భారతం


పాండవులు-కౌరవులు జన్మించడం, లక్క ఇల్లు తగలబడడం. జూదములో ద్రౌపదిని ఓడడం, వనవాసం చేయడం, విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం, గోగ్రహణ యుద్ధములో విజయోత్సాహం, సంధి విఫలమవడం, భీష్మ ద్రోణ దుర్యోధనాదులు మరణించడం. ఇదీసూక్ష్మముగా ఒకే ఒక శ్లోకంలో మహాభారత గాథ.


Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం


ఏక శ్లోక భాగవతం
ఆదౌ దేవకీ గర్భ జననం గోపీగృహే వర్ధనం
మాయా పూతనజీవితాపహరణం గోవర్ధనోద్ధరణం
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతా పాలనం
ఏతత్ భాగవతం పురాణ కథిథమ్ శ్రీ కృష్ణ లీలామృతం


దేవకీ గర్భమున జన్మించడం, యశోద గృహముంలో పెరగడం, మాయావి పూతనను సంహరించడం, గోవర్ధన గిరి పైకి యెత్తడం, కంసుని వధించడం, కౌరవాదుల సంహరించడం, కుంతీ దేవి పుత్రులను రక్షించడం... ఇదీ సూక్ష్మంగా ఒకే ఒక్క శ్లోకంలో శ్రీకృష్ణ లీలామృతమైన భాగవత గాథ .


Also Read: మహాభారతంలో ఈ పాత్రల్లో మీరు ఏటైపు, ఓ సారి చూసుకోండి
"యదిహాస్తి తదన్యత్ర, యన్నేహాస్తి నతత్క్వచిత్" అని మహాభారతం చెబుతుంది. అంటే అందులో లేనిది లోకంలో ఎక్కడా లేదని. అంతటి మహోన్నత సాహిత్యం ఎన్ని తరాలకైనా తరగని ఆసక్తిని, సాహితీ పిపాసను కలుగజేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పుట్టిన ప్రతి కథా రామాయణ మహాభారతాల్లోని ఏదో ఒక కథను బీజంగా తీసుకుని పుట్టిందే. అందుకే మనం ఏ కథ చదువుతున్నా పరోక్షంగా భారతాన్నో, రామాయణాన్నో చదువుతున్నట్లే. అందుకే ఈ మూడు శ్లోకాలు నిత్యం చదివితే రామాయణ, మహాభారత, భాగవతం చదివినట్టే అంటారు పండితులు.