Spirituality: నిత్యం మనం తినే ఆహారంలో ఐదు రకాలైన దోషాలుంటాయి..అవి..
1.అర్ధ దోషం
2.నిమిత్త దోషం
3.స్ధాన దోషం
4.గుణ దోషం
5. సంస్కార దోషం
1.అర్ధ దోషం
సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే అర్థదోషం అంటారు.. మీకు అర్థమయ్యేందుకు ఈ చిన్న కథ...ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి ఆ శిష్యుడికి డబ్బు మూట ఇవ్వడం చూశాడు. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ గదిలో మూట చూసిన సాధువు మనసులో దుర్భుద్ధి కలిగింది. అందులోంచి కొంత మొత్తాన్ని తీసి తన సంచీలో దాచేసి ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు పూజా సమయంలో తాను చేసిన దొంగతనం గుర్తొచ్చి సశ్చాత్తాపం చెందాడు. తను శిష్యుడి ఇంట్లో దోషంతో కూడిన భోజనం చేయడం వల్లే తనకా దుర్భుద్ధి కలిగిందని..ఆ ఆహారం జీర్ణమై మలంగా విసర్జించిన తర్వాత మనసు నిర్మలమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బు తీసుకుని శిష్యుడి ఇంటికి వెళ్లి జరిగింది చెప్పి ఇచ్చేసి..ఆ డబ్బు ఎలా సంపాదించావని అడిగాడు. శిష్యుడు తలవంచుకుని, "నన్ను క్షమించండి, స్వామి! ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు" అన్నాడు.
Also Read: ఈ రాశివారు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు, జనవరి 3 రాశిఫలాలు
2.నిమిత్త దోషం
చెడ్డ గుణాలు ఉన్నవారు ఇచ్చింది తినడం వల్ల మంచి గుణం నశించి నిమిత్త దోషం కలుగుతుంది. ఇందుకు ఉదారహణ ఈ కథ
భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకూ అంపశయ్యపై ప్రాణాలతో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉన్న పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడికి మంచి విషయాలు బోధించాడు. అప్పుడు ద్రౌపది కి ఓ సందేహం కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు అప్పుడు కురుసభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ఎందుకు ఎదిరించి మాట్లాడలేకపోయాడు అని మనసులో అనుకుంటుంది. ఆ ఆలోచన గ్రహించిన భీష్ముడు 'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం తిన్నాను. నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది. కొన్నాళ్లుగా ఆహారం తీసుకోపోవడంతో అంపశయ్యపై బాణాలతో శరీరం ఛిద్రమై ర్తం బిందువులుగా బయటకుపోయి పవిత్రుడినయ్యాను..అందుకే ఇప్పుడు మంచి మాటలు చెప్పగలుగుతున్నా అని సందేహం తీర్చాడు.
అంటే..మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి స్వభావం కలిగి ఉండాలి. వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు ముట్టుకోకూడదు. ఆహారం మీద దుమ్ము, తల వెంట్రులకు పడకూడదు. అపరిశుభ్రమైన ఆహారం అసహ్యాన్ని కలిగిస్తే.. వక్రబుద్ధి, చికాకుతో వండిన భోజనం చేస్తే దుష్ట గుణాలు కలుగుతాయి.
Also Read: కొత్త ఏడాదిలో మేషం నుంచి మీనరాశి వరకూ ఫలితాలు, 12 రాశుల వార్షిక ఫలితం
3. స్ధాన దోషం
దుర్యోధనుడు ఓసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సులభ సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏం పెట్టాలా అనే ఆలోచించి, ఆనందం-తొందరపాటు ఏకమైన ఆ క్షణం అరటి పండు ఒలిచి పండుకి బదులు తొక్క చేతికి అందించింది. కృష్ణుడు దాన్ని తీసుకుని సంతోషంగా తిన్నాడు. ఇదిచూసిన విదురుడు భార్య సులభ వైపు కోపంగా చూడడంతో స్పందించిన కృష్ణుడు... "విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటా అన్నాడు.
ఎక్కడైతే వంట చేస్తారో అక్కడంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. వంటచేసేవారు,వండించేవారు కూడా మంచి మనసు కలిగి ఉండాలి. వడ్డించేటప్పుడు అంతే ప్రేమగా వడ్డించాలి. వంట చేసే సమయంలో అనవసర చర్చలు, వివాదాలు , అరుపులు కేకల మధ్య చేసిన వంట శరీరానిక మంచి చేయదు. యుద్ధరంగం, కోర్టులు, రచ్చబండలు ఉన్న చోట్ల వండిన వంటలు అంత మంచివి కాదంటారు పండితులు.
4.గుణ దోషం
మనం వండే ఆహారం సాత్వికంగా ఉండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృద్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని మాయలో పడేస్తుంది,స్వార్థాన్ని పెంచుతుంది.
5. సంస్కారదోషం
ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.