Swiggy Losses FY22: జొమాటోకు ప్రధాన ప్రత్యర్థి కంపెనీ, ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని డోర్‌ టు డోర్‌ ఫుడ్ డెలివరీ చేసే (Online Food Delivery Platform) స్విగ్గీ భారీగా నష్టాల్లో కూరుకుపోతోంది. కంపెనీ వ్యయాలు గణనీయంగా పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.


2021-22 ఆర్థిక సంవత్సరంలో (FY22) స్విగ్గీ నష్టం రెండింతలు పైగా పెరిగి (2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే) రూ. 3,629 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020-21లో ‍‌(FY21) ఇది రూ. 1,617 కోట్లుగా ఉంది. FY22లో కంపెనీ మొత్తం వ్యయాలు భారీగా 131 శాతం పెరిగి రూ. 9,574.5 కోట్లకు చేరుకున్నాయి. 


కంపెనీ మొత్తం వ్యయంలో ఔట్‌ సోర్సింగ్ (పొరుగు సేవల సిబ్బంది కోసం చేసిన ఖర్చులు) వ్యయాలే దాదాపు పావు వంతు (24.5 శాతం) ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,031 కోట్లుగా ఉన్న ఔట్‌ సోర్సింగ్ వ్యయాలు, అక్కడి నుంచి 2.3 రెట్లు పెరిగిస 2022 ఆర్థిక సంవత్సరంలో  రూ. 2,350 కోట్లకు చేరుకున్నాయి.


టీవీలు, హోర్డింగ్‌లు, బిల్‌ బోర్డ్‌లు సహా సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల కోసం 2022 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టింది. FY22లో ప్రకటనలు, ప్రచారా వ్యయాలు 4 రెట్లు (2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే)  పెరిగి రూ. 1,848.70 కోట్లకు చేరాయి.


ఆదాయం పెరిగింది, అయినా ప్రయోజనమేంటి?
జాతీయ మీడియా రిపోర్ట్‌ చేస్తున్న ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 2.2 రెట్లు (2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే) పెరిగి రూ. 5,705 కోట్లకు చేరుకుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2,547 కోట్లుగా నమోదైంది. అయితే, ఖర్చులు ఇంకా భారీ మొత్తంలో పెరగడం వల్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది.


గత శనివారం, అంటే 31 డిసెంబర్ 2022న 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్‌లను స్విగ్గీ డెలివరీ చేసింది. అదే రోజు, రాత్రి 10.25 గంటల వరకు, యాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా 61,000 పైగా పిజ్జాలను డోర్‌ టు డోర్‌ అందించింది. ట్విటర్‌లో నిర్వహించిన సర్వేలో, హైదరాబాద్‌లో బిర్యానీ కోసం 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో లఖ్‌నవూ (14.2 శాతం), కోల్‌కతా (10.4 శాతం) ఉన్నాయి.


ఉద్యోగుల తొలగింపు ఉండవచ్చు
గత నెలలో వచ్చిన మీడియా రిపోర్ట్స్‌ను బట్టి, తన వర్క్‌ఫోర్స్‌ నుంచి 5 శాతం లేదా 250 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను స్విగ్గీ తొలగించే అవకాశం ఉంది. అయితే, ఇంకా ఎలాంటి రిట్రెంచ్‌మెంట్ జరగలేదని స్విగ్గీ అధికార ప్రతినిధి చెప్పారు. 2022 అక్టోబరులో ఉద్యోగుల పని తీరును మదించిన తర్వాత, వాళ్ల పనికి తగ్గట్లుగా అన్ని ఉద్యోగ స్థాయుల్లో రేటింగ్స్‌ & ప్రమోషన్లను ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రతి పెర్ఫార్మెన్స్‌ అసెస్‌మెంట్‌ సైకిల్‌లో, పని తీరు ఆధారంగా కొంతమంది తీసేస్తూ ఉంటారని కూడా చెప్పారు.


రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (RoC) డేటా ప్రకారం...  FY22 చివరి త్రైమాసికంలో (2022, జనవరి-ఏప్రిల్‌) Swiggy విలువ 10 బిలియన్‌ డాలర్లు దాటింది. దీంతో డెకాకార్న్‌గా (Decacorn - 10 బిలియన్‌ డాలర్లు/ రూ. 82,000 కోట్ల విలువ) అవతరించింది. ఈ విలువ ప్రకారం, పెట్టుబడి సంస్థ ఇన్వెస్కో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‍‌(Invesco Asset Management) నుంచి 700 మిలియన్‌ డాలర్లను సమీకరించింది.