రామాయణం హిందువులకు అత్యంత పవిత్ర గ్రంథం. రాముడు మర్యాద పురుషుడిగా ప్రపంచానికి ఆదర్శం. కష్టసుఖాల్లో తోడు నీడగా ఉండే దంపతులకు ప్రతీక సీతారాములు. రాముడి వ్యక్తిత్వాన్ని కొనియాడేందుకు ఎన్నో సందర్భాలున్నాయి. కానీ సీతారాధనకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది అదే సీతాష్టమి లేదా సీతా జయంతి లేదా జానకి జయంతి. రాముడి ఔదార్యం, సీతమ్మ ఓర్పును తలచుకుని ఈ రోజున ఈ దంపతులను ఆరాధిస్తారు. 


ఫల్గుణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు జానకీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజును సీతాదేవి జనక మహారాజుకు పొలంలో దొరికిన రోజుగా చెప్పుకుంటారు. సీత త్యాగానికి, అంకిత భావానికి ప్రతీక. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతా మాతను కూడా పూజిస్తే లక్ష్మీ నారాయణుల కటాక్షం దొరుకుతుందట. ఈ ఏడాది జానకీ జయంతి, పూజ మూహుర్త వివరాలు తెలుసుకుందాం.


ఈ ఏడాది ఫల్గుణ మాసంలో కృష్ణపక్ష అష్టమి ఫిబ్రవరి 13వ తేదిన వస్తోంది. ఉదయం 8.15 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 14 ఉదయం 7.40 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుని ఫిబ్రవరి 14న జానకి జయంతిని జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు.


ఈ పండుగను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. సీత భూదేవి పుత్రిక కనుక భూమి అనే పేరుతో కూడా సీతను పిలుస్తారు. జీవితం ముందుకు సాగడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతిని భక్తిగా జరుపుకునే వారికి ఆనందదాయకమైన దాంపత్య జీవితం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు కూడా సీతాజయంతి రోజున సీతారాములను ఆరాధించి, ఉపవాసం చేస్తే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరుగుతుందని కూడా చెబుతారు.


జానకీ జయంతి వ్రత విధానం


ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లోని దేవుడి ముందు దీపం వెలిగించాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని, సీతా దేవికి పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు బట్టలు సమర్పించుకోవాలి.  తర్వాత దేవతా మూర్తుల అభిషేకం చేయ్యాలి. గంగా జలం అందుబాటులో ఉంటే అభిషేకానికి ఉపయోగించే నీటిలో గంగా జలం కలుపుకోవాలి. సీతారాములను ఆరాధించాలి.  శ్రీ జానకి రామాభ్యామ్ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సాయంత్రం వరకు ఉపవాసం చెయ్యాలి. సాయంత్రం జానకీ మాతకు దీపం వెలిగించి పూజ అనంతరం సీతారాములకు పాలు బెల్లంతో చేసిన వంటలను నివేదించిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు. ఈ పూజను దంపతులిద్దరూ కలిసి జరుపుకోవడం వల్ల వారి మధ్య అనురాగం పెరుగుతుందని కూడా నమ్మకం.


జానకీ జయంతి మహత్మ్యం


జానకి జయంతి రోజున సీతామాత జయంతి జరుపుకుంటారు. ఈరోజున పుణ్యస్త్రీలు ఇంట్లో సుఖ శాంతుల కోసం, భర్త దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. ఈరోజు సీతారాములను పూజించినవారికి పదహారు మహా దానాల ఫలం లభిస్తుందట. 



Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?