BJP MP On KCR :   పోడు భూముల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్  ఆదివాసి గిరిజనులను కించపరిచారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులపై కపట ప్రేమ కనబరుస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోయం బాపూరావు ఆదివాసీల హక్కుల కోసం పోరాడే  తుడుం దెబ్బ అనే సంస్థను గతంలో స్థాపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే అంశంపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిన అనంతరం పార్లమెంట్  సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఆయన ఓ ప్రకటన విడదల చేశారు. 


ఆదివాసీలను కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తున్నారన్న బీజేపీ ఎంపీ       


ముందు నుండి కెసిఆర్ ఆదివాసీలను మోసం చేస్తూనే ఉన్నారని, పోడు భూముల కోసం సర్వే పేరిట దరఖాస్తుల పేరిట నాటకమాడి ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని  నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిజాం రజాకార్ లా  వ్యవహరిస్తూ అడవి బిడ్డలైన ఆదివాసులపై విషం వెళ్లగక్కుతున్నారని, భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్ కు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. భారత స్వాతంత్రం అనంతరం రాజ్యాంగంలో అడవులను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులకు 5, 6 షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి పూర్తి అధికారాలు ఆదివాసులకే చెల్లుబాటు అవుతాయని గుర్తు చేశారు. 


ఆదివాసీ చట్టాలపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శలు          


తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారం చేజికించుకున్న ముఖ్యమంత్రి కి ఆదివాసి చట్టాలంటే అవగాహన లేకుండా పోయిందన్నారు. భూమికోసం భుక్తి కోసం పోరాడిన కుమ్రం భీమ్ వారసులుగా ఆదివాసులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని, భారత రాజ్యాంగం ప్రకారం తమ హక్కులను సాధించుకుంటామని, అటవీ శాఖ, పోలీస్ అధికారుల అణచివేతను ఇక సహించబోమని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఆదివాసి జాతిని కించపరుస్తూ ముఖ్యమంత్రి మీ సొత్తా అంటూ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయడాన్ని ఎంపీ ఖండించారు. 


ఆదివాసీలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 


ఖమ్మం జిల్లాలో అటవీ రేంజ్ అధికారి గుత్తి కోయ ఆదివాసులపై దుర్మార్గంగా ప్రవర్తించాడని, అటవీ అధికారి దూరాగతాలను గుత్తి కోయలు బరిస్తూ వచ్చారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం గుత్తికోయలు ఎక్కడైనా నివసించే హక్కు ఉందని ముఖ్యమంత్రి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పి ఆర్హులైన ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వకపోతే తమ సత్తా చూపిస్తామని, ఏజెన్సీ నోటిఫైడ్ ప్రాంతాల్లో అడుగుపెట్టనివ్వమని ఎంపి హెచ్చరించారు. ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణి మార్చుకొని గతంలో ఇచ్చిన హామీ మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు.                


"పోడు" భూముల పట్టాలివ్వడానికి ఎన్నో చట్ట బంధనాలు - కేసీఆర్ ఎలా షరిష్కరిస్తారు ?