చీకట్లను తొలగించి సమస్త లోకానికి  వెలుగు ప్రసాదించేవాడు ఆదిత్యుడు.  ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే సూర్య భగవానుడిని ప్రత్యక్షదైవంగా కొలుస్తారు. అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు సూర్యుడు అవతరించిన రోజే సూర్య జయంతిగా,రథ సప్తమిగా జరుపుకుంటారు.  సూర్యరథానికి కూర్చిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు, పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు సంకేతాలు. సూర్యుడి పేరుతో ప్రారంభమయ్యేది భానువారం(ఆదివారం). మేషం నుంచి మీనం వరకూ పన్నెండు రాశుల్ని పూర్తిచేయడానికి సూర్యుడి రథానికి ఏడాది పడుతుందంటారు.


Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
మాఘ మాసంలో సూర్యుడు "అర్క'' నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిదనిని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా, రథసప్తమి నుంచే ఉత్తరాయణస్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయణం నుంచి భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. అందుకే రథసప్తమి అంత విశేషమైన రోజని చెబుతారు. పంటల పండుగ సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ ఇది.  రథ సప్తమి నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఈ రోజున సూర్యకిరణాలు పడేదగ్గర ఇంటి ముందు ఆవుపేడ పిడకలపై పరమాన్నం చేసి ఆదిత్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరుబయట సూర్య కాంతిలో పొంగేపాలు 'సిరులు పొంగు' కి సంకేతంగా భావిస్తారు. సూర్యోదయానిక ముందే  ఇంటిల్లిపాదీ స్నానాలు ముగిస్తారు. గాయత్రీ జపం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, సూర్య సహస్రం వంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేస్తారు. ఇవి తప్పనిసరిగా చదవాలని లేదు టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో టీవీల్లోనో, ఫోన్లలోనో వింటూ కూడా ఆదిదేవుడికి నమస్కరించవచ్చు. 


Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...
మహా విష్ణువు ప్రతిరూపంగా పూజించే సూర్యభగవానుడికి దేశవిదేశాల్లో ఘనంగా పూజలు నిర్వర్తిస్తారు. రథసప్తమి రోజున అరసవల్లి సూర్యదేవాలయం, కర్ణాటకలోని మైసూరు ఆలయాల వద్ద సూర్యమండల, సూర్యదేవర ఊరేగింపులు నిర్వహిస్తారు.  తిరుమలలో మలయప్పస్వామిని రథసప్తమి నాడు అలంకరించి- శ్రీదేవి, భూదేవి సమేతంగా సప్త వాహనాలపైన ఊరేగిస్తారు.  సూర్యుడి దేవాలయాల్లో కోణార్క్‌, విరించి నారాయణ క్షేత్రాలు (ఒడిశా), మొధేరా (గుజరాత్‌) ప్రఖ్యాతమైనవి. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. అందుకే సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయంటారు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు,అర్ఘ్యం అనే ప్రక్రియలు ప్రవేశపెట్టారు. 


వాస్తవానికి సప్తమి తిథి సోమవారం ఉదయం దాదాపు 8 గంటల వచ్చింది. మంగళవారం ఉదయం 8 వరకూ ఉంది.  సూర్యోదయమే పూజకు ప్రధానం కాబట్టి మంగళవారం రథసప్తమి పూజ నిర్వహించాలంటారు పండితులు.
Also Read:  సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి