Shardiya Navratri 2024: అనుసరించాల్సిన ధర్మాన్ని ఆ గుమ్మం దగ్గర వదిలి కేవలం శారీరక వాంఛలు తీర్చుకునేందుకు ఆ ప్రపంచంలోకి అడుగుపెడతారు. అక్కడకు వచ్చిన వారి పుణ్యాన్ని, అక్కడ వారు చేసే పాపాన్ని స్వీకరించిన ఆ నేల కన్నా ధర్మబద్ధమైనది ఏముంటుంది. అందుకే వ్యభిచార గృహాల నుంచి తీసుకొచ్చిన మట్టితోనే దసరా నవరాత్రుల్లో ప్రతిష్టించే అమ్మవారి విగ్రహం తయారుచేస్తారు.


పశ్చిమ బెంగాల్ లో వందల ఏళ్లుగా ఇదే సంప్రదాయం అనుసరిస్తుంటారు. వేశ్యా గృహాలనుంచి మట్టి తీసుకురాకుంటే అక్కడ విగ్రహం తయారీ సంపూర్ణం అయినట్టు, అమ్మవారి కళలు అందులో నిక్షిప్తం అయినట్టు భావించరు..


 వేశ్యా గృహాల ప్రాంగణంలో మట్టి స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవం అని నమ్ముతారు. విగ్రహం తయారు చేసేముందు.. ఆ ప్రదేశాలకు వెళ్లి మట్టి తీసుకొచ్చేయడం కాదు..అక్కడున్న మహిళలకు నమస్కరించి, శిరస్సు వంచి మట్టి అడగాలి. వారు తమ ప్రాంగంణం నుంచి మట్టిని తీసి ఇచ్చిన తర్వాతే తీసుకురావాలి.  


Also Read: దసరా ఉత్సవాలకు రారాజు మైసూరు దసరా - రాచరికం ఉట్టిపడేలా జంబూసవారి!


వ్యభిచార గృహాల ప్రాంగణంలో మట్టి ఎందుకు?


తన కుటుంబాన్ని, బాధ్యతలను మరిచి కేవలం వాంఛతో ఆ ప్రదేశానికి వెళ్లే పురుషుడు తన పుణ్యాన్ని, ధర్మాన్ని అక్కడే విడిచిపెట్టి వస్తాడు. అందుకే ఆ నేలధర్మబద్ధమైనదని భావిస్తారు. దుర్గా మాత విగ్రహం తయారీకి గంగాతీరంలో మట్టి, గోమూత్రం, ఆవు పేడతో పాటూ వ్యభిచార గృహాల ప్రాంగణంలో మట్టిని వినియోగిస్తారు. ఈ మట్టిని  నిషిద్ధో ఫల్లీస్ అని అంటారు. వీటిలో ఏది లేకపోయినా ఆ విగ్రహం అసంపూర్ణమే అని భావిస్తారు. దీనినే  పుణ్య మిట్టి..అంటే.. పవిత్రమైన మట్టి అని అంటారు.  వ్యభిచారి చేతినుంచి పూజారి చేతిలోకి వచ్చే ఆ మట్టిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మట్టిని ఉత్సవాలకు కొన్ని రోజుల ముందునుంచే సేకరించడం మొదలుపెడతారు.  


దీనివెనుకున్న పౌరాణిక గాథ


ఒకప్పుడు కొంతమంది వేశ్యలు స్నానానికి గంగా నదికి వెళుతున్నారు.  ఆ సమయంలో నదీ ఒడ్డున ఉన్న ఓ కుష్టురోగిని చూశారు. ఆ దారిలో వెళుతున్న వారందర్నీ తనను నదిలోకి స్నానానికి అనుమతించాలని వేడుకున్నాడు ఆరోగి. కానీ ఎవ్వరూ స్పందించలేదు, తన అభ్యర్థనను మన్నించలేదు. ఆ రోగిని చూసి చలించిపోయిన వేశ్యలు.. ఆ కుష్టురోగికి గంగాస్నానం చేసే భాగ్యం కల్పించారు. ఆ రోగి మరెవరో కాదు సాక్షాత్తూ శంకరుడే. ప్రశన్నుడైన పరమేశ్వరుడు వరం కోరుకోమనగా..తమ ప్రాంగణంలో మట్టితో శక్తి రూపాన్ని తయారు చేయాలని అడిగారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 


Also Read: అయోధ్య రాముడిని దొంగతనం చేసి జరుపుకునే " కుల్లు దసరా"


నవ కన్యారాధన


సమాజానికి దూరంగా బహిష్కరణకు గురైనవారిని కూడా కలుపుకుని వెళ్లడమే శరదృతువులో జరిగే ఈ ఉత్సవం వెనుకున్న ఉద్దేశం. అందుకే ఇలాంటి ఆచారం ఏర్పాటు చేశారని చెబుతారు. వేదాల్లో ప్రాచుర్యంలో ఉన్న మరో విషయం ఏంటంటే నవకన్యల ఆరాధన. తొమ్మిది తరగతులకు చెందిన స్త్రీలను ఆరాధించడమే నవకన్యారాధన. వారిలో నర్తకి,  వేశ్య,  బానిస, బ్రాహ్మణ కన్య, శూద్ర వనిత, ఒక గోపాల వనిత ఇలా తొమ్మిది తరగతుల స్త్రీలను ఆరాధిస్తారు.


Also Read: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!