Sawan 2023 Festivals : నిజ శ్రావణమాసం ఆగస్టు 17 గురువారం నుంచి మొదలై సెప్టెంబరు 15 శుక్రవారం వరకూ ఉంటుంది. మొదటి 15 రోజులు అంటే శ్రావణశుద్ధ పాడ్యమి (ఆగస్టు 17) నుంచి పౌర్ణమి (ఆగస్టు 31) వరకూ వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులేంటో ఇప్పటికే చెప్పుకున్నాం. ఆ వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి....
ఇక సెప్టెంబరు 1 శ్రావణ బహుళ పాడ్యమి నుంచి సెప్టెంబరు 15 అమావాస్య వరకూ వచ్చే పండుగలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబరు 1 శ్రావణ బహుళ (కృష్ణ) పాడ్యమి
శ్రావణ బహుళ పాడ్యమి రోజు ధనప్రాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మొదలు భాద్రపద పౌర్ణమి వరకూ వ్రతంచేయాలని దీనినే శివ వ్రతమని కూడా అంటారు
Also Read: కామాక్షీ దీపం విశిష్టత ఏంటి - ఈ దీపం ఏ సందర్భాల్లో వెలిగిస్తారు!
శ్రావణ బహుళ విదియ
రోజు మొదలు నాలుగు నెలల పాటు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా కూడా ప్రసిద్ధి చెందింది.
శ్రావణ బహుళ తదియ రోజు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం
శ్రావణ బహుళ చవితి రోజు గోపూజ చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయంటారు
శ్రావణ బహుళ పంచమిని రక్షా పంచమి వ్రత దినమంటారు.
శ్రావణ బహుళ షష్ఠి -బలరామ జయంతి
ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాల. ఈరోజునే బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి.
Also Read: ఈ ఏడాది శ్రావణం అధికమాసం, ఇంతకీ అధికమాసం - క్షయమాసం అంటే ఏంటి!
శ్రావణ బహుళ సప్తమి
ఈ రోజు భానుసప్తమి అంటారు…
సెప్టెంబరు 6- శ్రావణ బహుళ అష్టమి -శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవం. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, విజయం సిద్ధిస్తుందని పురాణోక్తి. అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగించి ఉయ్యాలలు కట్టి ఆడిస్తారు. బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శనంగా వీధుల్లో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు.
శ్రావణ బహుళ నవమి
ఈరోజు చండికా పూజ, కౌమార పూజ ఆచరిస్తారు. రామకృష్ణ పరమ హంస వర్ధంతి కూడా ఈ రోజే.
శ్రావణ బహుళ ఏకాదశి
ఈ ఏకాదశిని అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు.
శ్రావణ బహుళ ద్వాదశి/త్రయోదశి
ద్వాదశి తిథి నాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. అలాగే, త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని అంటారు. శ్రావణ బహుళ చతుర్దశి.
సెప్టెంబరు 14- శ్రావణ అమావాస్య
శ్రావణ అమావాస్యనే పోలాల అమావాస్యగా జరుపుకుంటారు. ఈరోజు గో పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుంది. ఈ రోజు వ్యవసాయదారులంతా పశువులతో పనులు చేయించరు.
సెప్టెంబరు 15 సూర్యోదయానికి అమావాస్య ఉండడం వల్ల రోజును కూడా శ్రావణమాస అమావాస్యగా పరిగణిస్తారు. సెప్టెంబరు 16 నుంచి భాద్రపదమాసం ప్రారంభం అవుతుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial