జులై 29 నుంచి  ఆగస్టు 27 వరకూ శ్రావణమాసం. శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణం పేరుమీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినది, హయగ్రీవోత్పత్తి  జరిగింది, గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే. ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన పక్రియ శ్రావణ మాసంలోనే ప్రారంభమయ్యేది. ఇప్పటికే ఓ కథనంలో శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ వచ్చే పండుగల గురించి ప్రస్తావించుకున్నాం, ఇప్పుడు పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి శ్రావణ అమావాస్య వరకూ వచ్చే ప్రత్యేకమైన రోజులేంటో చూద్దాం...


Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు


శ్రావణ బహుళ (కృష్ణ) పాడ్యమి
శ్రావణ బహుళ పాడ్యమి రోజు ధనప్రాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఇది మొదలు భాద్రపద పూర్ణిమాంతం వరకు వ్రతం చేయాలని..దీనినే శివ వ్రతమని కూడా అంటారని చెబుతారు.


శ్రావణ కృష్ణ విదియ
రోజు మొదలు నాలుగు నెలల పాటు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా కూడా ప్రసిద్ధి చెందింది.


శ్రావణ బహుళ తదియ
ఈనాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలంటారు


శ్రావణ బహుళ చవితి
దీనినే ‘బహుళా చతుర్థి’ అని కూడా పిలుస్తారు. ఈరోజు గోపూజ చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయంటారు


శ్రావణ బహుళ పంచమి
ఇది రక్షా పంచమి వ్రత దినమంటారు.


శ్రావణ బహుళ షష్ఠి
ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలి… బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి.


శ్రావణ బహుళ సప్తమి
ఈ రోజు భానుసప్తమి అంటారు…


Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!


ఆగస్టు 19-శ్రావణ బహుళ అష్టమి
శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మదినోత్సవం. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడిని పూజించడం వల్ల ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, విజయం సిద్ధిస్తుందని పురాణోక్తి. అష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగించి ఉయ్యాలలు కట్టి ఆడిస్తారు. బాల్యంలో కృష్ణుడు చేసిన బాల్య చేష్టలకు నిదర్శనంగా వీధుల్లో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు.


శ్రావణ బహుళ నవమి
ఈరోజు చండికా పూజ, కౌమార పూజ ఆచరిస్తారు. రామకృష్ణ పరమ హంస వర్ధంతి కూడా ఈ రోజే.


శ్రావణ బహుళ ఏకాదశి
ఈ ఏకాదశిని అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు.


శ్రావణ బహుళ ద్వాదశి/త్రయోదశి
ద్వాదశి తిథి నాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. అలాగే, త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని అంటారు. శ్రావణ బహుళ చతుర్దశి.


ఆగస్టు 27 శ్రావణ అమావాస్య
శ్రావణ కృష్ణ అమావాస్య పోలాల అమావాస్యగా ప్రసిద్ధి. గో పూజకు విశేషమైన దినం. ఈ రోజు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులేమీ, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయించరు.


Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి